Wednesday, July 31, 2013

ఏమీ తోచక....

ఇప్పుడు నేను మీకు ఒక కవిత చెప్తా అన్నమాట. తీరా చదివేసాక ఇది కవితా..తవికేం కాదు అనొద్దు. 
దమ్ము-దుమ్ము, బుడ్డి-వడ్డీ ఇలాంటి సినిమా పాటలు రాస్తే  వినట్లేదా,ఇది మాత్రం ఎలా తప్పించుకుంటారు ..

Google Image

నా పేరు అనామిక
ఉన్నాను ఏమీ తోచక
చేస్తున్న పని చాలక
అనుకున్నాను ఏమైనా రాయలిక
అందుకే చేసుకున్నాను బ్లాగును దానికి వేదిక
ఇక వీయాలి ఆలోచనల వీచిక
కురవాలి పదాల అల్లిక
కావాలి మీ ఆశీస్సుల కానుక
అదే నా కోరిక

వాహ్వా...వాహ్వా..(ఈ డైలాగ్ నాది కాదు మీదని నాకు తెల్సు :):) )

Tuesday, July 30, 2013

గన్ షూటింగ్

ఎప్పుడు షాపింగూ, రొటీన్ పనులు కాకుండా ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాం అనుకుని, దగ్గర్లో ఏమున్నాయి అని వెతుకుతూంటే గుర్తొచ్చింది, గన్ షూటింగ్ రేంజ్ ఉంది దగ్గర్లోనే, పైగా ఎప్పుడూ వెళ్ళలేదు కూడా.
షూటింగ్ రేంజ్ అంటే అక్కడ కొంత స్పేస్ తో కొన్ని లైన్స్ ఉంటాయ్. ఒక్కో లైన్లో
కావాల్సిన దూరం లో ఒక టార్గెట్ ని సెట్ చేసుకొని, గన్ తో షూట్ చెయ్యాలి. గన్ అంటే బొమ్మ గన్ కాదు, నిజ్జంగా నిజం  తుపాకినే.   అందులోకి వెళ్ళే ప్రతి మనిషికి కొంత ఛార్జ్ చేస్తారు, ఇంకా గన్ కి, బుల్లెట్స్ కి మనకి కావాలనుకున్న దాన్ని బట్టి రెంట్ తీసుకోవాలి.
సరే వెళ్దాం అని డిసైడ్ అయ్యాక, appointment తీస్కుందాం అని కాల్ చేస్తే, కేవలం members మాత్రమే reservation చేసుకోవచ్చంట. మాకు మెంబర్‌షిప్ లేదు కాబట్టి వెళ్ళి లైన్లో వెయిట్ చేస్తే అప్పుడు బుక్ చేసుకోవచ్చు అని చెప్పాడు, కావాలంటే మన సొంత గన్స్ కూడా తీస్కెళ్ళొచ్చు అంట.
అక్కడికెళ్ళాక  ఒక ఫాం నింపమని ఒక అరగంట వెయిట్ చేయించాక మా ID కార్డ్స్ తీసుకున్నాడు. చాలా గన్స్, రైఫిల్స్ చాలా రకాలవి డిస్‌ప్లే  లో పెట్టి ఉన్నాయ్. వెళ్ళనైతే వెళ్ళం కాని వాటిని చూడగానే కొంచెం భయమేసింది. చాలా మంది వాళ్ల సొంత గన్స్ అనుకుంటా బయటి నుండి తెచ్చుకుంటున్నారు, అయిపోగానే వాళ్ళతో తీస్కెళ్తున్నారు.
  ఒకసారెప్పుడో  TV లో చూసా, గన్ పేల్చితే ఆ ఫోర్స్ కి పేల్చిన వ్యక్తి వెనక్కి పడిపోయాడు. మనకి మరీ ఆ రేంజ్ లో వద్దని, వాడికి చెప్పాం, ఇదే ఫస్ట్ టైం షూటింగ్ రావడం సో కొంచెం ఈజీ   గా ఉండేది ఇవ్వమని.
మొత్తం నలుగురం వెళ్ళాం కాబట్టి 2 గన్స్ చాలనుకున్నాం. వాడు ఒక పిస్టల్ ఇంకా ఒక రైఫిల్ తీసి, వాటిని ఎలా పట్టుకోవాలో, ఏ position లో నిల్చోవాలి, ఎలా ఫైర్ చెయ్యాలి అంతా చూపించాడు.
తర్వాత బుల్లెట్స్ తీసుకొచ్చి, లోడ్ చెయ్యడమూ, రీఫిల్ చెయ్యడం చూపించాడు. అలా 2 గన్స్ రెంట్ తీస్కొని, కళ్ళకి, చెవులకి సేఫ్టీ కోసం  గ్లాసెస్, ear muffs పెట్టుకొని లోపలికి వెళ్ళాం. 
Google Image
ఏ రోడ్ మీదనో ఇంకెక్కడో ఒక సైకో వచ్చి మనల్ని గన్ తో షూట్ చేస్తే అయ్యో పాపం అనుకుంటారు కాని, ఇప్పుడు ఎవరన్నా మనల్ని కాల్చేస్తే కనీసం పాపం అని కూడా అనుకోరు అనుకున్నాం.  
లోపల కూడా ఒక ఆఫీసర్ ఉన్నాడు, డౌట్స్ వస్తే చెప్పడానికి ఇంకా ఎలా షూట్ చేస్తున్నారో చూడడానికి. 
ఇంకా ఆ గన్స్ లో ఒక్కో బుల్లెట్ మెల్లగా లోడ్ చేస్తూ, మధ్య మధ్యలో అతన్ని మళ్ళీ అడిగి  మొత్తానికి ఒక గన్ లోడ్ చేసాం, మళ్ళీ సరిగ్గా లోడ్ చెయ్యక తేడా వచ్చి అది వెనక్కి పేలిపోతే ఎలా అని( అతడు సినిమా లో లాగ). అందరు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే మేము మాత్రం అన్నిటికన్నా పెద్దగా ఉన్న టార్గెట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం దగ్గర్లో సెట్ చేస్కున్నాం.
ఇంక ఫస్ట్ బుల్లెట్ పెల్చే అప్పుడు మాత్రం నిజంగానే కొంచెం చేతులు వణికాయి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నలుగురం కలిపి గంటలో ఒక 20 కూడా కాల్చామో లేదో ( వాడు 200 బుల్లెట్స్ ఇచ్చాడు, గంటసేపు  ఉంటాం అంటే). ఇంకా చాలని చెప్పి వచ్చేసాం. 
అదీ సంగతి.. 

Monday, July 29, 2013

సోమవారం నీలం..

సోమవారం నీలం ఏంటి అనుకుంటున్నారా .. Monday blues కి నిజ అనువాదం అదే true translation.
రోజు పొద్దున అనిపిస్తుంది ఆఫీస్ 9 కి బదులు కనీసం 10 కి ఉండొచ్చు కదా అని. monday రోజు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. 
ఐనా ప్రతిరోజు 10 కి ఉన్నా అప్పుడు కూడా ఇంకాస్త లేట్ గా ఉంటే బావుండు అనిపిస్తుందేమో. అసలు నాకు  సండే సాయంత్రం నుండి బెంగ స్టార్ట్ అవుతుంది, అయ్యో.. వీకెండ్ అయిపోయింది మళ్ళీ రేపటి నుండి 5 రోజులు రొటీన్ అని.అప్పటికి పది సార్లు అనుకుంటాను అప్పుడే సండే అయిపోయిందా, ఎంత త్వరగా అయ్యింది, రేపు త్వరగా లేవాలి, మళ్ళీ వీకెండ్ కి 5 డేస్ ఉంది అని.... 
 అసలు పనేమి లేకుండా ఖాళీగా ఉంటే ఎంత బావుండు అనిపిస్తుంది, అమ్మో అప్పుడు ఇంకా బోర్ కొడుతుందేమో, అలా కాకుండా నీకిష్టమొచ్చిన పని, ఇష్టమున్నప్పుడు ఇష్టమొచ్చినంత సేపు చెయ్యమ్మా అంటే ఎంత బావుంటుంది.
Google Image

 హ్మ్ ఇలా ఆలోచించినా నాకు ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలనిపించే ఒక్క పనీ productive పనేం కాదు, అందుకే ఈ సోది ఆపి I am getting started with monday morning work         

Friday, July 26, 2013

నా ఫస్ట్ & లాస్ట్ బస్ ప్రయాణం-2

అలా ఇక్కడ చెప్పినట్లు ఇంక ఫ్లైట్ బుక్ చేసుకుందాం కొత్త యూనివర్సిటీ కి అని రూం కి వెళ్ళాను.  వెళ్ళేముందు అక్కడ ఎవరితోనైనా మాట్లాడితే బావుంటుందేమో అని నాతో పాటు జాయిన్ అయ్యే ఇంకో అమ్మాయిని  కాంటాక్ట్ అయి కాల్ చేసాను. 
తనేమో ఎల్లుండే ఇక్కడ Student orientation, అందరు స్టూడెంట్స్  రోజు రిపోర్ట్ చెయ్యాలి అని చెప్పింది. అంతేకాదు క్లాసులకి కూడా ఆరోజే రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే క్లాస్ ఫుల్ అయిపోతే  కష్టం అంది. ఎల్లుండే అంటే నేను రేపు ఎలాగైనా బయల్దేరాలి ఇక్కడి నుండి. ఇప్పుడు ఫ్లైట్ బుక్ చెయ్యాలి, అంతకన్నా ముఖ్యం గంట దూరం లో ఉన్న ఏర్ పోర్ట్ లో డ్రాప్ చెయ్యడానికి  ఎవరినైనా అడగాలి. 
రూం లో ఉన్న సీనియర్ కి విషయం చెప్తే, ఎవరినైన కనుక్కుంటాను డ్రాప్ చేస్తారేమో అంది. సరేలే అని వెళ్ళి టికెట్ కోసం చూస్తే కళ్ళు తిరిగే అంత ఉంది రేట్. ఎలాగో నాకు నేనే నచ్చచెప్పుకోని, పర్లేదులే టికెట్ రేట్ పోతేపోయింది, ఎలాగూ అక్కడ ఫీ తక్కువ కదా.. దాంట్లో సేవ్ చేస్తున్నాం కదా అనుకొని ధైర్యం తెచ్చుకున్నా. 
కాని అసలు సమస్య ఇంకా తీరలేదు, రేపు డ్రాప్ చెయ్యడానికి ఎవరు లేరు, అక్కడ కార్ ఉన్నవాళ్ళే తక్కువ , అందులోను రేపు కావల్సిన టైం లో ఎవరుంటారు, పైగా వర్షం కూడా ఉందట. 
అసలే కోతి, పైగా కల్లు తాగింది, ఆ పైన తేలు కుట్టింది టైపులో కష్టాలన్ని ఒకదాని పైన ఒకటి ఉన్నాయి అనిపించింది. 
ఈ డిస్కషన్ లో ఎవరో చెప్పారు,ఇక్కడ grey hound అని బస్సులు ఉంటాయ్ ప్రొద్దున ఎక్కితే, రాత్రి కల్లా చేరుకోవచ్చు. పైగా అది ఇంటి దగ్గర్లొనే ఎక్కొచ్చు అని చెప్పారు. బస్ టైమింగ్స్ చూస్తే ఉదయం 8 కి బయల్దేరి, రాత్రి 7 కి చేరేలాగ ఒక బస్ ఉంది, దగ్గరే కబట్టి వాళ్ళ పని డిస్ట్రబ్ అవకుండ ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారు. ఇంకా లేట్ చేస్తే ఇది కూడా ఉండదేమో అని బుక్ చేసా బస్ టికెట్. కాని ఇక్కడ ఇంకో సమస్య ఉంది,ఆ 11 గంటల జర్నీ లో మధ్యలో ఒక చోట బస్ మారాలి.
అసలే యు.ఎస్ కి కొత్త, ఇక్కడ ఏవి ఎలా ఉంటాయో ఎమి తెలియదు, పైగా ఇండియా నుండి తెచ్చిన లగ్గేజ్ అంతా నాతో ఒక్కదాన్నే మోసుకెళ్ళాలి. సరే ఎలాగైన వెళ్ళక తప్పదు కదా అనుకొని ధైర్యం తెచ్చుకున్నా, రాత్రంతా నిద్ర సగం  సగం నిద్ర, తర్వాతి రోజు ఎదో అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నట్టు అనిపించింది. 
మర్నాడు ప్రొద్దున్నే మా రూమ్మేట్ ఫ్రెండ్ డ్రాప్ చేసాడు బస్టాప్ లో. లగ్గేజ్ అంతా తన సహాయం తో బస్ కింద ఉన్న లగ్గేజ్ స్పేస్ లో పెట్టి బస్ ఎక్కి కూర్చున్నా.
 అలా యు.ఎస్ లో మొదటిసారి బస్ ఎక్కానన్నమాట. 

ఇక్కడి నుండి 6 గంటలు ఈ బస్ లో ప్రయాణించిన తర్వాత ఒక స్టేషన్లో ట్రాన్స్‌ఫర్ అయ్యి వేరే బస్ ఎక్కాలి. అక్కడ 2 గంటలు వెయిటింగ్ మళ్ళీ 3 గంటలు ఇంకో బస్ లో వెళ్తే నేను వెళ్ళాల్సిన ఊరు వస్తుంది, (ఊరు అంటే నిజ్జంగా ఊరే అక్కడ మా కాలేజ్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. అసలు ఆ ఊర్లో కాలేజ్ పెట్టలేదు, కాలేజ్ ఉంది కాబట్టే అక్కడో ఊరు ఏర్పండిందేమో అనిపిస్తుంది నాకు).
బస్ లో ఎక్కువ జనం లేరు, ఒక సగం బస్ నిండా ఉండి ఉంటారు. ఖాళీగా ఉన్న సీట్లో వెళ్ళి కూర్చున్నా. నా పక్కన ఎవరు కూర్చుంటారో ఏమో అని భయపడ్డా బస్ స్టార్ట్ అయ్యింది కాని  ఎవరూ రాలేదు. నేను చూసినంత వరకు ఎవరూ ఇండియన్స్ ఎక్కినట్టు అనిపించలేదు. మధ్యలో కొన్ని చోట్ల బస్ ఆగింది కాని నేను మాత్రం ఇంక ఆ 6 గంటలు  ఆకలేసినా,దాహమేసినా సీట్లోంచి లేవకుండా అలాగే కూర్చుండిపోయా.  బస్ ఆగినప్పుడల్లా అది ఏ ఊరో అనౌన్స్ చేస్తున్నారు.నేను దిగాల్సిందే చివరి స్టేషన్ కాబట్టి వాటి గురించి పట్టించుకోలేదు.
ఫైనల్ గా ఒక 30-40 నిమిషాలు లేట్ గా నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.బస్ దిగి కింద స్పేస్ లో ఉన్న చెక్ ఇన్ బ్యాగ్స్ తీసి కింద పెట్టా.బస్ ని స్టేషన్ బిల్డింగ్ కి ఆనుకొనే ఆపారు. అయినా కానిమొత్తం లగ్గేజ్ ఒకేసారి తీసుకొని లోపలొకి వెళ్ళలేను, ఎలాగా అని ఆలోచిస్తూ వాటితో కష్టపడుతుంటే ఒకతను వచ్చి 2 పెద్ద సూట్‌కేస్ లని పట్టుకొని లోపలికి తీస్కెళ్ళాడు.  
లోపల బిల్డింగ్ చాల చిన్నదిగ ఉంది, ఇక్కడ జనం ఎక్కువగానే ఉన్నారు.తర్వాతి బస్ ఎక్కడ ఎక్కాలో ఏమో కనుక్కుందాం అని లగ్గేజ్ అంతా కనిపించే అంత దగ్గర్లొ పెట్టి అక్కడే కౌంటర్ లో వెళ్ళి అడిగా.   కౌంటర్లో ఉన్న అమ్మాయి ఎక్కడ బస్ ఎక్కాలో చూపించింది. అది కనిపించే అంత దూరంలోనే ఉంది కాబట్టి వెళ్ళి నా లగ్గేజ్ దగ్గరే నిల్చున్నా, అక్కడ కూర్చోవడానికి ఏమి కనిపించలేదు. పైగా ఆ సామాను పట్టుకొని అటు ఇటు తిరగలేను కాబట్టి అక్కడే నిల్చున్నా ఇంక .
అక్కడే అక్కడే అక్కడే.....  నాకు అమ్రుతం దొరికింది, అంటే అంత టైం తర్వాత నీళ్ళు తాగితే అలానే ఉంటది కదా!!కాని తినడానికి ఏమి కనిపించలేదు, వెతికే ఓపిక కూడా లేదు.
ఇంకా గంట టైం ఉంది కాని, ఇంకో 15-20 నిమిషాల్లో ఆ డోర్ ముందు లైన్లో నిలబడటం మొదలు పెట్టారు జనాలు, నేను కూడా వెళ్ళి కలిసా అందులో. లైన్ పెద్దది అయ్యింది కాని గేట్ ఎంతకీ ఓపెన్  చెయ్యరు, అలా ఇంకొంచెం సేపు వెయిట్ చేసాక  ఒక్కొక్కర్ని టికెట్ చెక్ చేస్తూ బస్ లో కి పంపించారు.ఈ బస్ మొత్తం నిండిపొయింది.నా పక్కన ఎవరో ఒకతను వచ్చి కూర్చున్నాడు. ఎంతకీ బస్ స్టార్ట్ అవదు, చాలాసేపు తర్వాత అనుకున్న టైం కన్నా ఒక అర గంట లేట్ గా బయల్దేరింది.
ప్రొద్దున్నుండి ఏమీ తినలేదుగా నా కడుపులో తిప్పుతూ ఉంది.తెలియకుండానే నిద్ర పట్టేసింది, మెలకువ వచ్చేసరికి మొత్తం చీకటైపొయింది. టైం చూస్తే schedule ప్రకారం ఇంకా గంట ఉంది. బస్ లో అప్పుడే వాడు 40 నిమిషాలు లేట్ గా వెళ్తున్నాం , అని వచ్చే స్టేషన్ పేరు అనౌన్స్ చేసాడు.
అక్కడికెళ్ళాక బస్టాప్ నుండి పిక్ చేసుకోవడానికి సీనియర్స్ వస్తారు, వాళ్ళకి బస్ టైమింగ్స్ బయల్దేరే ముందు కాల్ చేసి చెప్పాను. ఆ చీకట్లో నిమిషాలు, సెకన్లు లెక్కపెడుతూ   దిగాక వాళ్ళకి ఎలా ఫోన్ చెయ్యాలి...అసలే బస్ లేట్ గా వెళ్తుంది, ఇంకా రాలేదు అని చూసి చూసి వాళ్ళు వెళ్ళిపోతే ఎలా... అని ఆలోచిస్తూ కూర్చున్నా.  
ఫస్ట్ బస్ లో ఆ 6 గంటలకన్నా, ఈ 3 గంటలు ఎక్కువ టైం అనిపించింది, బయటికి చూడ్డానికి కూడా లేకుండాఅంతా చీకటి. అలా అలా ఒక జీవిత కాలం గడిచాక నన్ను సంతోషం లో ముంచేస్తూ నేను దిగాల్సిన స్టేషన్ వస్తుందని అనౌన్స్ చేసాడు.
ఎందుకైనా మంచిదని దిగేముందు ఒకసారి అడిగా పక్కన కుర్చున్న అతన్ని, ఆ ఊరేగా ఇందాక చెప్పింది అని.
దిగేసరికి బస్ ఎదో షాప్ ముందు ఆగింది అనిపించింది. ( తర్వాత తెల్సింది అది walmart అని) జనాలే లేరు అసలు అక్కడ,ఇప్పుడేం చెయ్యాలా అని నా ఫ్యూచర్ ని తలచుకుంటూ లగ్గేజ్ కిందపెట్టేసరికి
నా సంతోషాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఇద్దరు ఇండియన్ అబ్బాయిలు వచ్చారు నా దగ్గరికి, చూడగానే అర్థమైంది నా కోసమే వచ్చారని. ఆ టైం లో వాళ్ళు నాకు నా కోసమే దిగి వచ్చిన దేవదూతల్లా అనిపించారు. వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ, బస్ కనపడగానే వచ్చారట.
ఒక 10 నిమిషాల్లో తీస్కెళ్ళి మా రూం లో వదిలారు నన్ను.
నా సంతోషాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ అక్కడ అన్నం, కూర పెట్టగానే మొహమాటం లేకుండా, కరువు బాధితురాలి లాగా తిన్నా చూడండి...ఒక రోజంతా తినకుండా ఎపుడూ లేనేమో . ఆ తర్వాత లోకల్ బస్ లలో వెళ్ళా కాని, మళ్ళీ ఇంత దూరం ఒక ఊరి నుండి ఇంకో ఊరికి బస్ లో ఎప్పుడూ వెళ్ళలేదు.  
అందుకే అది నా లాస్ట్ బస్ ప్రయణం అయ్యింది. ( హమ్మయ్య Title justification అయ్యింది ఫైనల్ గా!!) 

Thursday, July 25, 2013

ఒక నిజం..

ఎన్నో కథలు చదువుతుంటాం. వాటిలో ఎన్నో మర్చిపోతాం, కొన్ని గుర్తుంటాయ్, కాని అందులో కొన్ని లైన్స్ అలానే నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి
నన్ను నేను ద్వేషిస్తున్నా.
నిన్ను ప్రేమించినందుకు కాదు
నిన్ను వదిలేసినందుకు కాదు
నీకు దూరంగా ఉన్నందుకు కాదు
నిన్ను మర్చిపోయి బ్రతకగలుగుతున్నాను అన్న నిజం తెలిసినందుకు..

ఏదో కథలో చదివా ఇది కొన్ని నెలల ముందు, ఆ కథ అందులో స్టోరీ ఏంటో గుర్తులేదు కాని ఈ నాలుగు లైన్స్ గుర్తుండిపోయాయి.  



Wednesday, July 24, 2013

నేనేం చేస్తున్నానో తెలుసా..


నేనేం చేస్తే మీకెందుకు అనుకుంటున్నారా, ఎలాగూ వచ్చారు కదా ఇంక తప్పించుకోలేరు కాని చూసేసి వెళ్ళండి..

Brunch చేసాక వేస్తున్న ఆకలిని quench చేయడానికి bunch of french చిప్స్ లో pinch of salt వేసి, సాల్సా తో drench చేసి కొద్దిగా ranch వేసి punch కోసం crunch చేసి grunch లా ఉన్నా పట్టించుకోకుండా inch కూడా వదలకుండా bench మీద కూర్చుని lunch లాగ munch చేస్తున్నా.....


అదన్నమాట సంగతి

Tuesday, July 23, 2013

నా ఫస్ట్ & లాస్ట్ బస్ ప్రయాణం-1

ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నానని ఈమెవరో గొప్ప ఇంటి అమ్మాయి , అసలు చిన్నప్పటినుండి బస్ ఎక్కలేదట పాపం అనుకుంటున్నారా!
అక్కడే మీరు బస్సులో కాలేసారు..అసలు విషయానికొస్తే ట్రిన్ ట్రిన్ ట్రిన్
ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..నా ఫ్లాష్ బ్యాకే కాని మీరు కూడా రావాలి మరి..
నా వీసా పనులు అన్ని పూర్తిచేసుకొని యు.ఎస్ కి వెళ్ళడానికి రెడీ గా ఉన్నా. వీసాకి వెళ్ళే ముందు నా దగ్గర 3 యూనివర్సిటీలకి అప్ప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఒక దాంట్లో ఫీజు కాస్త తక్కువ, అందుకే దానితోనే వీసా ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకున్న.ఆ యూనివర్సిటీ పేరు M అనుకుందాం, M వాడు నా i20 లో బ్రాంచ్ పేరు తప్పు ఇచ్చాడు. అందుకే నేను చివరి నిమిషం లో ఇంకో యూనివర్సిటీ తో వీసా అప్ప్లై చెయ్యాల్సి వచ్చింది( ఇది K అనుకుందాం). సో అలా యూనివర్సిటీ K కి నా ప్రయాణం fix అయింది. కనుక్కుంటే అక్కడికి వెళ్ళాక ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని M కి మారిపోవచ్చు అని చెప్పారు. 

అక్కడ తెల్సినవాళ్ళు ఎవరూ లేరు.ఆ యూనివర్సిటీకి చాలామందే వస్తున్నారు కాని నా టికెట్ విడిగా బుక్ చేసుకోవాల్సి వచ్చింది.
 ఇంకా వెళ్ళేముందు ఒకటే టెన్షన్, అసలు ఒక్కదాన్ని ఫ్లైట్ లో ఎలా వెళ్తా ఒక్కరు కూడా తోడు లేకుండా అని ( ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అంత టెన్షన్ ఎందుకు పడ్డానా అని, ఆ తర్వాత ఒక్కదాన్ని చాలసార్లు ఫ్లై చెయ్యడమే కాదు ఇంకా చాలా పనులు చేసా).
ఫేస్ బుక్/యూనివర్సిటీ కమ్యూనిటీ నుండి ఇప్పటికే అక్కడ చదువుతున్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. అదే రోజు ఇంకో ఇద్దరు అబ్బాయిలు వేరే ఫ్లైట్ కి వస్తున్నారని, ముగ్గురిని కలిసి రిసీవ్ చేసుకుంటామని చెప్పారు.
ఎలాగోలా ఏ సమస్య లేకుండా వచ్చేసా, ఫ్లైట్ దిగగానే లగేజ్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేద్దామని పక్కనే ఒక షాప్ ఉంటే అందులోకి వెళ్ళి అడిగా. ఒక కార్డ్ కొనుక్కోమని దానితో 200 ( 200 లేక 300 ఎంతో గుర్తులేదు) నిమిషాలు యు.ఎస్ లో ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చని చెప్పింది. నేను తెచ్చుకున్న క్యాష్ లోంచి ఒక 20$ తీసి ఇచ్చా. 13.78 ఎంతో చెప్పి మిగిలిన చిల్లర 6$ 22 సెంట్స్ ఇచ్చింది. ( ఇది కూడా పెద్ద చెప్పే విషయమా అనుకుంటున్నారా, మరి నాకు ఇక్కడికి రాగానే కొత్తగా అనిపించిన మొదటి విషయం కదా!!). 
అలా వాళ్ళకి ఫోన్ చెయ్యడం, ఏర్ పోర్ట్ నుండి 50 నిమిషాల దూరం లో ఉన్న మా యూనివర్సిటీకి వెళ్ళిపోవడం జరిగింది. 
ఎలాగూ ఇక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను, ఇక్కడి నుండి మారిపోతాను కాబట్టి టెంపరరీగా ఉండడానికి మరో ఇద్దరు అమ్మాయిలతో షేరింగ్ లో ఇల్లు  దొరికింది. ఇంకేముంది రేపు కాలేజ్ కి వెళ్ళి M కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని, ఎలాగు వారం టైం ఉంది కాబట్టి ఈ వారంలో ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నా. నేను తప్పనిసరిగా M కి వెళ్ళిపోవాలి, ఎందుకంటె నాకు ఎడ్యుకేషన్ లోన్ రాలేదు, నేను తెచ్చుకున్న మనీ ఇక్కడి ఫీ కి సరిపోవు. ఇక్కడ ఫీ కట్టాలంటే ఇండియాలో మా ఆస్తులన్నీ అమ్ముకోవాలి, ఇంకా చెప్పాలంటే అంతా అమ్మినా ఇక్కడి మొత్తం ఫీ కట్టలేము. ఎలాగైనా మారిపోవచ్చు అని ధైర్యం చేసి వచ్చేసా. 
తర్వాత రోజు లేచి కాలేజ్ కి వెళ్ళాలి ఇదీ సంగతి అని అప్పటికే అక్కడ చదువుకుంటున్న రూమ్మేట్ కి చెప్పా. తనేమో అలా ఎలా వెళ్తావ్ ఇక్కడ International affairs లో ఒక officer ఉంటది, తను ఫస్ట్ సెమిస్టర్ లో ట్రాన్స్‌ఫర్ కి అస్సలు ఒప్పుకోదు అని చెప్పి, తన ఫ్రెండ్స్ ఎవరో వస్తే నా గురించి చెప్పింది. వాళ్ళు కూడా అస్సలే అలా కుదరదు అన్నారు. సరే ఏదైతే అది అయిందని కాలేజ్ కి వెళ్ళా. కాని ఆ రోజు ఆ ఆఫీసర్ రాలేదు, తర్వాతి రోజు రమ్మన్నారు. ఇంటికి వచ్చాక ఇంక టెన్షన్ మొదలైంది.
ఇంకా ఆ రోజంతా ఎవరితో ఈ విషయం చెప్పినా ఒకటే మాట అలా కుదరదు అని. రాత్రి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ హాయిగా సామాన్లు సర్దుకుంటూ, వాళ్ళ వాళ్ళ రూం సెట్ చేసుకుంటూ ఉంటే నేనేమో దిక్కుతోచకుండా ఆలోచిస్తూ ఉన్నా.  ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అవకపోతే ఏం చెయ్యాలి, మా నాన్న ని మనీ పంపియమంటే ఇప్పటికిప్పుడు ఎలా తెస్తారు అని అలోచిస్తున్నా. వాళ్ళేమో ఇక్కడే ఉండిపో దాంట్లో ఏముంది అంటున్నారు, అసలు సమస్య తెలియక.
ఎలాగోలా ఆ రోజు గడిపేసి, తర్వాతి రోజు లేవగానే కాలేజ్ కి వెళ్ళా.నాకు కావాల్సిన ఆఫీసర్ ఉంది, భయపడుతూ వెళ్ళి కలిసి విషయం చెప్పా. 
వెంటనే ట్రాన్స్‌ఫర్ అవుతావా ఒక సెమిస్టర్ కూడా పూర్తి చెయ్యకుండా అంది, అవును అని చెప్పా. 
"ఎందుకు" అంది, టక్కున అక్కడ నా బ్రదర్ ఉన్నాడు అందుకే అన్నా కాస్త దీనంగా.
కాసేపు నా పాత i20 కొత్త యూనివర్సిటీ i20 చూసి "OK" అని ఇంకేదో అంది. అర్థం కాక Question mark  మొహంతో అక్కడే నిల్చున్నా. "Now you are lo longer student of this school, i relesed your Sevis" అంది. ఆ పని అంతా పూర్తి అవడానికి 2,3 రోజులు పడుతుంది.  కాని మళ్ళీ ఆఫీస్ కి రావాల్సిన పని లేదు, కొత్త యూనివర్సిటీకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అంది. హమ్మయ్య అనుకున్నా.
కానీ... ఇంకో పెద్ద సమస్య గురించి ఇంకాసేపట్లొ తెలుసుకోబోతున్నానని నాకు తెలియదు అప్పుడు.  

Monday, July 22, 2013

Welcome back


టైం ఎంత తొందరగా గడిచిపోతుందో!3 సంవత్సరాలు అయింది నేను బ్లాగ్ చూసి, అసలు ఇది ఒకటి ఉందనే విషయమే మర్చిపోయా ఇన్ని రోజులు.
అప్పట్లో బ్లాగ్స్ నాకు పరిచయం అయిన కొత్తలో ఇంట్లో ఖాళీగా ఉండి కొన్ని రోజులు అదే పనిగా అన్ని బ్లాగ్స్ చదివి నేను కూడా ఏదో రాసేద్దాం అని మొదలు పెట్టా కాని చాలామంది new year resolution లాగే 3,4 పోస్ట్ లు రాయగానే ఆపేసా. తర్వాత కొత్త ప్లేస్ కి మారిపొవడం వల్ల, కాస్త బిజీ అయిపోవడం వల్ల అసలు దీని గురించే మర్చిపోయా.ఇంకో కారణం ఎవరైనా నమ్ముతారో లేదో కాని నా కజిన్స్, ఫ్రెండ్స్ (స్కూల్, కాలేజ్ ఇప్పుడు కొలీగ్స్) వీరిలో ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగులో ఏది చదవరు. మొదట్లో ఒక పోస్ట్ చదివి నాకు చాలా నచ్చి ఎవరితోనైనా షేర్ చేసుకుందామని నా ఫ్రెండ్స్ ముగ్గురికి పంపాను చాలా ఫన్నీ గా ఉంది చదవండి అని.
ఒక్కరు కూడా చదవలేదు, చదవక పోయినా ఫీల్ కాకపోయేదాన్ని పైగా "ఏదో 1,2 లైన్స్ అంటే చదివేవాళ్ళం ఇంత పెద్ద పోస్ట్ చదవడం మా వల్ల కాదు" అన్నారు.సరే నేను చదివింది వాళ్ళతో  చెప్పుదామని నాకు గుర్తున్నది అంతా జోక్ లాగా చెప్పా. చెప్తుంటే నాకే అది జోక్ లాగా అనిపించలేదు వాళ్ళకేం నవ్వు తెప్పిస్తుంది  ఇంకా. అప్పుడు అర్థం అయింది ఇద్దరు చదివితేనే దేని గురించైనా మంచిగా మాట్లాడుకోగలరని, నేనొక్కదాన్నే చదివి ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే బావుండదని.
ఇంకా ఆ పరిస్థితుల్లో నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారు, సో అలా ఇది మరుగున పడిపొయింది.
ఇన్ని రోజులకి మళ్ళీ టైం కుదిరింది, దీన్ని బూజు దులిపి బయటికి తీయడానికి .
 So I am saying Welcome to myself .

Sunday, July 21, 2013

జైలు జీవితంలో ఒక లేడి డిటెక్టివ్!!


టైటిల్ చూసి ఇది అప్పుదేప్పుడు టీవీ లో వచ్చిన సీరియల్ అనుకునేరు.. అది కాదు కానీ నేను డిటెక్టివ్ రోల్ పోషించాను ఒకసారి..
నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో హాస్టల్లో చేరిపించారు మా ఇంట్లో వాళ్ళు ఏదో చదివి ఉద్ధరిస్తానని, చదవటం సంగతి అటుంచి ఆ జైలు లో సారీ హాస్టల్లో మేం పడిన కష్టాలు ఎన్నో.ప్రొద్దునే 5 గంటలకు లేపేవాళ్ళు అది కూడా ఎంత కర్ణ కఠోరంగా అరుచుకుంటూ మా వార్డెన్ వచ్చేది అలాఅందరి రూమ్స్ తలుపులు బాదుతూ వెళ్ళేది. మేము ఫస్ట్ ఫ్లోర్ కాబట్టిఇంకా అదృష్టవంతులం ఒక వార్డెన్ కే బలి అయ్యేవాళ్ళం పాపం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవాళ్ళకి వాచ్ మాన్ కూడా కర్రతో బాదే వాడు తలుపుల పైనే లెండి. ఇప్పుడే చెప్తుంటే చినన్ విషయం లానే ఉంది కానీ ఆ సమయం లో చలికి అంత ఉదయమే లెగవాలంటే ఎంత కష్టంగా ఉండేదో (ఎంతైనా యుగానికి ఒక్కడు సినిమా చూసిన కష్టం ముందు చిన్నదే అనుకోండి).అప్పుడు లేచి వాళ్ళు పెట్టే ఆయిల్ ఫుడ్ తిని పరిగెత్తుకుంటూ క్లాసు కి వెళ్ళేవాళ్ళం. ఆలస్యం అయితే అక్కడ కర్ర పట్టుకొని రెడీ గా ఉండేది ఒక దయ్యం. అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉంటె అలా పరిగెత్తి పరిగెత్తి ఒలంపిక్స్ లోబంగారు పతకం తెచ్చేదాన్ని. ఇంకా ఆ ఫుడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొందరు బానే తినేవాళ్ళు , నాలాంటి కొందరికి ముద్ద దిగకపోయేది.పైగా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చూసి "ఏందే ఇంత సన్నగా ఐపోయావ్ అంత డబ్బు కడుతున్నాం, కట్టినదానికి సరిపడా తినవే అలా డబ్బులు వేస్ట్ చెయ్యకు" అని, ఇంతకి వీళ్ళ బాధ నేను చిక్కిపోయినందుకా లేక కట్టిన డబ్బు కు సరిపడా తినలేదనా??
మా రూం లో ఐదుగురం ఉండే వాళ్ళం. ఒకే ఒక అమ్మాయ్ కి సెల్ ఫోన్ ఉండేది. ఇంకా ఆమెకి కాల్ రావడం బిల్డప్ ఇస్తూ ఫోజు కొడుతూ తిప్పుకుంటూ మాట్లాడటం. ఇంకా నా మనసు రగిలి పోయింది ఈ సారి నేను కూడా ఎలాగైనా తెచ్చేసుకుందాం సెల్ ఫోన్ అని ఇంటికెల్లినప్పుడు మా నాన్న మంచి మూడ్ లో ఉన్నప్పుడు చూసి న కోరిక వదిలా. మా అమ్మ అయితే అసలు ఛాన్స్ లేదు. ఆయన పక్కనే నా ఆ జన్మ శత్రువు ఉంది అదేనండి మా అక్క. మా నాన్నకి ఉన్న బడ్జెట్ లో దానికి అన్ని కొనిచేవాళ్ళు నా దగ్గరికి వచేసరికి అది మళ్లీ ఒక కొత్త అవసరం అనబడే కోరికతో రెడీ. అలా నాకు అది ఉపయోగించిన పుస్తకాలూ, బట్టలు ,సైకిల్ ఒకటేంటి అన్ని....:(
మా అక్క మహా తెలివైనది లెండి. అది అన్ని వస్తువులు చాల జాగ్రత్తగా చూసుకునేది ఇంకా పనికి రావు అనిపించగానే ప్రేమగా అమ్మానాన్న సమక్షం లో నాకు ఇచ్చేది చూడడానికి అంత బావున్నట్టే అనిపించేది
. అలా దాని సైకిల్ నాకు ఇచ్చేసి స్కూటీ కొనుక్కుంది. నేను అలా నాకు వచ్చిన సైకిల్ ని మహదానందంగా వేసుకొని ఒకే ఒక్క రౌండ్ వేసోచ్చా మా వీధిలో , ఇంకేముంది ఇంటికి మళ్లీ నేను ఆ సైకిల్ పైన రాలేకపోయా అంత పురాతన స్తితిలో ఉంది అది కానీ చూడడానికి మాత్రం కోతదనిల ఉంది రంగు అది పోకుండా. నాకు మళ్లీ తిట్లు దాని వలన. ఇలా చిన్నప్పటి నుండి మా అక్క చేతిలో బలి అవుతూనే ఉన్నా.

మళ్లీ న సెల్ ఫోన్ విషయానికి వస్తే నాన్నని కి అడగగానే పక్కనే ఉన్నా మా అక్క తన సెల్ ఇచ్చి నన్ను ఉన్చేసుకోమంది.నాకు అప్పుడప్పుడే దాని దుర్మార్గపు ఆలోచనలు అర్థం అవుతున్నాయ్ కాబట్టి ఈ సారి గట్టిగ చెప్పను నాకు కొత్తదే కావాలి అని .ఇంకేముంది మరో సంవత్సరం కి వాయిదా పడింది నా సెల్ సంగతి.
ఇంకా మళ్లీ హాస్టల్ విషయనికి వస్తే మా రూమ్మేట్ అలా సెల్ తో గడుపుతుండగా నేను కుళ్ళు పడుతూ ఉండగా ఒకరోజు రూం లోనే సెల్ కనిపించకుండా పోయింది, నేను తీసాను అనుకునేరు కాదు లెండి. రూం లో కి కోతగా ఎవరు రాలేదు, మేము బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కనుక హాస్టల్ లోనే ఎవరో తీసి ఉండాలి కానీ ఎవరి మీద డౌట్ పడతాం ఎవర్ని అడుగుతాం, మా ఫ్లోర్ లో అందరి రూమ్స్ లో అడిగి మొత్తం వెతికి చివరికి వచ్చి కూర్చున్నాం. నేను మళ్లీ అలా చూస్తూ చూస్తూ వెళ్ళాను. మా వార్డెన్ రూం ఒక వైపుకి ఉండేది అదే ఫ్లోర్లో , ఆమె ఇంకా రాలేదు. అటు వైపు ఎవరు వెళ్లారు సాధారణంగా. ఎందుకో నా డిటెక్టివ్ బుర్ర పని చేసి అటు కూడా ఒక లుక్కేసా. ఆ రోజు వర్షం పడి ఉంది ఆ రూం కిటికీ పక్కనే చెప్పులతో నడిచిన మట్టి గుర్తులు ఉన్నాయ్.ఎందుకో అనుమానం వచ్చి కిందికి వెళ్లి ఆ కిటికీ ఉన్నా ప్లేస్ లో చుస్తే ఫోన్ ఉంది అక్కడ నాకు అర్థమైంది సీన్, అదేమన్న చదువుకు సంభందించిన విషయమా అర్ధం కాకపోవడానికి. ఎవరో సెల్ తీసుకున్నారు వెతుకుతున్నాం అని తెలియగానే పైన కిటికీ లోంచి కిందకి పడేసారు. ఇప్పుడు ఆ దొంగని పట్టుకోవడం కోసం నాకో ఐడియా తట్టింది వెంటనే అందరి చెప్పులు కింది భాగం చూసి ఈ గుర్తులతో మ్యాచ్ అయ్యే వి దొరకపడితే సరోపోతుంది. కానీ అందర్నీ చూపించమంటే ఎందుకు వింటారు , ఇంకా మా వార్డెన్ కి చెప్పి ఒక్కొక్క రూం కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసాం. ఇంకేం దొంగ దొరికింది. మొదట్లో ఒప్పుకోలేదు కానీ, మా వార్డెన్ గట్టి గ అడగగానే ఒప్పుకుంది. ఇంకా నేను నిజంగానే నా తెలివితో "లేడి డిటెక్టివ్" అయ్యా.....
కానీ ఇంత తెలివైన దాన్ని మా వాళ్ళు డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుంటా అంటే ఒప్పుకోలేదండి . నా టాలెంట్ ని తోక్కేసారు :(

కలల లోకం లో నేను

మీకు కలలు వస్తాయా????
ఇదేం ప్రశ్న !!! కలలు రాకుండా ఎవరైనా ఉంటారా అని అనుకుంటున్నారా??
నాకు అయితే విచిత్రమైన కలలు వస్తాయ్ ...
నేను ఆ రోజు ఎం చేస్తానో, లేకపోతే ఏదైనా సినిమా చూస్తానో రాత్రంతా అదే విషయమ్మీద కలలు.ఒకోసారి కలలో జరిగింది నిజమే అనుకుంటున ఉంటాను
నిన్నే టీవీ లో నరసింహ సినిమా చూసానా , రాత్రి అంత నేను నీలాంబరి ఫ్రెండ్ ఐపోయినట్టు, ఎందుకు అలా మొండిగా చేస్తావ్, నరసింహ ని మర్చి పోయి వేరే పెళ్లి చేసుకోవచ్చుగా అని నేను సర్దిచేప్తున్నా , నీలాంబరి నా మీద కూడా అరుస్తుందట, ఇది నా కల. హ్యాపి డేస్ చుసిన రోజు మా కాలేజ్ లో అందరు ఫ్రెండ్స్ అయపోయినట్టు నక మొత్తం సినిమా వచ్చింది కలలో, కాకపోతే సీన్ మా కాలేజ్ లో .....
ఇంకా చంద్రముఖి రోజు అయితే ఏకంగా జ్యోతిక ప్లేస్ లో నేనే..ఇంకా నయం అరుంధతి చూసినపుడు నాకు అసలు కలేం రాలేదు న అదృష్టం :)
ఒకసారి మా కాలేజ్ లో కొత్త లెక్చరర్ వచ్చింది...రాగానే ఏదో అసైన్మెంట్ ఇచ్చింది ,,,ఇంకా ఆ రోజు కలలో ఆమే పళ్ళు అమ్ముతుందట కాలేజ్ లో సాయంత్రం వరకు ఎవరు ఎక్కువ పళ్ళు అమ్మి పెడితే వాళ్ళు అసైన్మెంట్ ఫినిష్ చేసినట్టు ,ఎక్కువ పళ్ళు అమ్మితే ఎక్కువ మార్క్స్ అట ..ఇంకా చూడాలి తర్వాత నుండి ఎప్పుడు ఆ క్ల్లాస్ లో ఆమెని చుస్తే ,అరటిపళ్ళు , ఆపిల్ లు ముందు పెట్టుకుని పళ్ళు అమ్మే సీన్ గుర్తుకు వచ్చేది.

Saturday, July 20, 2013

నేను గెలిచిన ఫస్ట్ ప్రైజ్

అందరు చిన్నప్పటి విషయాలు రాస్తున్నారు కదా నేను గుర్తు తెచుకొని ఏదో ఒకటి రాద్దామనుకున్నాను , కాని నాకు ఏమి గుర్తు రావట్లేదు :(
ప్రతి మనిషి లో ఒక టాలెంట్ ఉంటుందంటారు ....మంచిదో చెడ్డదో .కానీ అదేంటో చిన్నప్పటి నుండి చూస్తున్న నాలో ఏదో ఒక టాలెంట్ బయటపడుతుందేమో అని ప్చ్ ..లాభం లేదు ,జీవితం గడిచి పోతుంది కాని నాలో ఒక్క టాలెంట్ కూడా బయటపడలేదు.
చిన్నప్పుడు నా వయసు వాళ్ళందరూ పరిగెడుతుంటే నేను నడవటమే మొదలు పెట్టలేదట ,అప్పటి నుండి మొదలు అన్ని పనులు లేట్ గానే నాకు :( పోనియండి లేట్ గా వచ్చిన పర్లేదు , కొన్ని అయితే ఎంత ట్రై చేసిన చెయ్యలేని పనులున్నాయండి బాబు .
కొంచెం
పెద్దయ్యాక స్కూల్ కి వెళ్ళే టైం లో , పంద్రాగస్టు కి , రిపబ్లిక్ డే వస్తే చాలా గేమ్స్ పెట్టేవాళ్ళు , మా అక్క ఉందే, రెండు చేతులతో కప్పు లు పట్టుకోచ్చేది ..మనలో మన మాట ఏదో స్టైల్ గా ఉంటుంది , అది కాకుండా సినిమాల్లో చిన్న పిల్లల చేతుల్లో కూడా కప్పులు చూపించే వాళ్ళని అలా అన్నాను కానీ , మాకు కప్పులు ఇచ్చే అంత సినిమా లేదండి, స్టీల్ గిన్నెలు ,గ్లాసులు ఇచేవాళ్ళు ప్రైజు కింద . అవి పట్టుకోచి తెగ ఫోజులు కొట్టేది.నేను అన్ని గేమ్స్ లో పాల్గొనేదాన్ని , కానీ అదేందో ప్రతి చోట విధి నన్ను వెక్కిరించేది.కనీసం సెకండ్ ప్రైజ్ కూడా రాకపోయేది.
నాకు సరిగ్గా గుర్తు లేదు కానీ ఏడో,ఎనిమిదో క్లాసు లో కి వచ్చాక, ఒకసారి క్రికెట్ ఆడించారు , ఎవరు ముందుకు రాలేదు,ఖో -ఖో , స్సిప్పింగ్ , రన్నింగ్ ఆడే వాళ్ళని క్రికెట్ ఆడమంటే ఏమి ఆడతాం చెప్పండి. అన్నట్టు చెప్పడం మర్చి పోయా మాది గర్ల్స్ స్కూల్
మా హై స్కూల్ నుండి కస్టపడి రెండు టీం లు సిద్ధం చేసారు , పాటికి అర్ధమయ్యే ఉంటది అందులో నేను కూడా ఉన్నానని. అసలు అందరి కన్నా ఫస్ట్ పేరు ఇచ్చిందే నేను. ఇంకేముంది రెండు టీం లలో ఒకటి ఫస్ట్, ఒకటి సెకండ్ . అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ,మనకు సెకండ్ ప్రైజ్ వచ్చింది.
ఇంకా పండగ రోజు రానే వచ్చింది అదేనండి ప్రైజ్ తీసుకునే రోజు, కానీ ఏం చేస్తాం , నేను కెప్టెన్ కాదు కదా , ఐతేనేం నా వంతు ప్రైజ్ నాకు వచ్చింది, "స్టీల్ ప్లేట్ " .
అది పట్టుకొని విజయ గర్వం తో ఇంటికి చేరాను. పరిగెత్తుకుంటూ వెళ్లి , "అమ్మా , నాన్నా, అక్కా..." ఇంట్లో అందర్నీ పిలిచి నా విజయ చిహ్నాన్ని చూపించాను. మా అమ్మ కళ్ళల్లో ఆనందం తో కూడిన కన్నీళ్ళు.
సీన్ కట్ చేస్తే రోజు నుండి మన భోజనం అందులోనే ఇంకా. అందులో తినడానికి సరిగ్గా వచెది కాదు, అయినా సరే దాంట్లోనే తినేదాన్ని.
ఇలా జరుగుండగా ఒకరోజు ,
' అమ్మ ఒక ఇరవై రూపాయలివ్వా..'అప్పట్లో నాకు చేతికి పది రూపాయలు కూడా ఇవ్వకపోఎది మా అమ్మ .ఎందుకే ? మొన్నేగా పది ఇచ్చా ...అంటే ఇప్పుడు ఇవ్వను అని దాని అర్ధం..నేను ఊరుకుంటానా ....నేను తెచ్చియన్ ప్లేట్ వాడుతున్నారు కదా ఇంట్లో ...దాని కి ఐన ఇవ్వు లేకపోతే, నాకు ఇచ్చేసేయ్ ....
వెంటనే టంగు మని నా ముందు ఏదో పడింది...
తర్వాత అలిగి నాకు కావాల్సింది తీసుకునే వెళ్ళాను మర్నాడు స్కూల్ కి , మా ఫ్రెండ్స్ ముందు పరువు నిలుపుకున్నాను...
ఇంతకీ నేను ఇంత కష్టపడింది , అప్పుడే మా స్కూల్ ముందు తెరిచిన బేకరీ లో తినడానికి. అలాగా ఆరోజు స్కూల్ అవగానే వెళ్లి తినేసి వచ్చాం.
అదన్న మాట సంగతి..