Thursday, August 29, 2013

నీ జ్ఞాపకాలు

సంతోషానికి సంకెళ్ళు పడ్డాయి
మనసు గోడల్ని దాటి రానంటోంది
ఆనందం ఆనవాలు కోల్పోయింది
నీ జ్ఞాపకాల వలలో చిక్కుకొని...

దు:ఖం కొత్త చుట్టమయ్యింది
నీ తలపుల తలుపులు తెరుచుకొని
విషాదమే ఆకాశమై  ఆదుకొంది 
నువ్వు వదిలేసిన ఈ ప్రపంచాన్ని...

Tuesday, August 27, 2013

కొన్ని నమ్మకాలు

మనలో చాలామందికి రకరకాల నమ్మకాలుంటాయి. ఏదైనా పని మొదలుపెట్టే అప్పుడు తుమ్మితే ఆ పని కాసేపు ఆపాలని,ఇంట్లోంచి బయటికి వెళ్ళే అప్పుడు పిల్లి ఎదురైతే మంచి జరగదని అనుకోవడం,   ప్రొద్దున్నే లేచి ఇష్టమైన వాళ్ళ మొహం చూడాలనుకోవడం ఇల్లంటివి చాలా ఉన్నయి.
కొందరు కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు.
ఆ నమ్మకం ఎదుటివాళ్ళకి ఇబ్బంది కలిగించనంతవరకూ నష్టం లేదు.ఇవన్ని మన దేశంలోనే ఎక్కువ అనుకునేదాన్ని. కాని ఇక్కడికొచ్చాక అర్థమైంది అమెరికా వాళ్ళకి కూడా నమ్మకాలెక్కువ, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చాలా విషయాల్లో మన నమ్మకాలతో కలుస్తాయి. నల్ల పిల్లి విషయం, పగిలిన అద్దం లో  చూసుకోకూడదు ఇలంటివి కొన్ని.
ఇంక చెప్పాలంటే అమెరికా వాళ్ళకి ఎంత భయమో చూడండి.

ఇది మా బిల్డింగ్‌లో లిఫ్ట్ లో తీసిన ఫోటో.చూసారా అందులో 13 నంబర్ లేదు. 13 అంటే దురదృష్టమైన సంఖ్య అని నమ్ముతారని తెలుసు కాని ఇలా ఒక బిల్డింగ్‌లో 13వ ఫ్లోర్ లేకుండా 12 తర్వాత 14 వ ఫ్లోర్ నంబర్ వేసారు.

ఈ సీరియస్ నమ్మకాలని వదిలేస్తే చిన్నతనంలో అమాయకంగా అనుకున్న కొన్ని విషయాలు ఎంత బావుంటాయో..
కాకి అరిస్తే కాని, చేతిలోంచి ఎదైనా జారిపోతే కాని, ఇద్దరు ఒకేసారి ఒకే మాట అంటే కాని ఇంటికి చుట్టాలొస్తారనీ..
వర్షం పడ్డప్పుడు రెయిన్‌బో వస్తే సీతమ్మ చీర ఆరేసుకుందనీ..
పిడుగు పడిటం అంటే అర్జునుడి రథం లోంచి ఒక ముక్క విరిగిపడటం అనీ..
కాళ్ళు చాపుకున్నప్పుడు దాటితే పుండు పడుతుందనీ..
బుక్‌లో నెమలీక దాచిపెట్టుకుంటే అది పిల్లలు పెడుతుందనీ..(అంటే ఒకటి పెడితే అది పిల్లలు పెట్టి 2 అవుతాయంట)
జడ వేసుకోకుందా జుట్టు వదిలెస్తే దయ్యం పడుతుందనీ(అలా అయితే ఇప్పుడు ప్రతీ అమ్మాయికి ఒక దయ్యం అవసరం పడేది :))
మాడిపోయిన అన్నం తింటే జుట్టు బాగా పెరుగుతుందనీ..(ఇదైతే మాడిన అన్నం అవగొట్టడానికి అమ్మ వాళ్ళు చేసిన కుట్ర  అని నా అభిప్ర్రాయం, అందులోను ఆడపిల్లలకి ఎక్కువ అన్యాయం జరిగేది దీని వలన, మరి వాళ్ళే కదా జుట్టు కోసం ఆరాట పడేది)
అన్నం చాలా సేపు తింటే పెళ్ళి ఆలస్యంగా అవుతుందనీ...
ఇంకా అందరం ఒక్కసారన్నా అనుకొని ఉంటాం తలలు గుద్దుకుంటే కొమ్ములొస్తాయని...
ఇంకా..
హా..హాచ్చ్...అబ్బ ఇప్పుడే పోస్ట్ పబ్లిష్ చేద్దామనుకుంటే తుమ్మొచ్చింది కాసేపాగి చేస్తానేం..

Monday, August 26, 2013

రెండు పుస్తకాలు - 2

అలా పని మనిషిగా గడుస్తున్న చియో కి ఒక సంఘటన జరుగుతుంది. ఆ ఇంటికి ఒకరోజు అతిథిగా వచ్చిన mamesha అనే పేరు గల geisha చియో ని చూసి ఆ ఇంటి యజమానురాలితో , తనే చియో geisha అవడానికి కావాల్సిన ఖర్చు భరిస్తా అని, ఒకవేళ తను అనుకున్న సమయం లోగా పూర్తిచెయ్యలేకపోతే తనకి ఏమీ తిరిగివ్వక్కర్లేదనీ, పూర్తి చెస్తే కనుక అంతకు రెట్టింపు డబ్బు ఇవ్వాలని చెప్తుంది.  అలా తను ఎలాగైతేనెం చియో Geisha school లో చేరుతుంది. చాలా కష్టపడి అన్ని విద్యలు నేర్చుకుంటుంది.geisha అంటే పాడటం, డాన్స్, సంగీతం ఇలా అన్ని విద్యలు తెలిసి ఉండాలి అప్పుడే అతిథుల్ని ఎంటర్‌టైన్ చేయగలరట.
తర్వాత కథ అంతా తను ఎలా training అయింది, తన పోటీగా ఉన్న వాళ్ళని అధిగమించి ఎలా జపాన్‌లోనే ఫేమస్ geisha గా ఎదిగింది వివరిస్తూ సాగుతుంది. తను మంచి స్థానంలో ఉండగానే 2వ ప్రపంచ యుధ్ధం మొదలవుతుంది. అప్పుడు జపాన్ అంతటా ఉన్న geisha houses ని మూసివేయడంతో అందరూ వివిధ చిన్న చిన్న పనులకి వెళ్ళిపోతారు.
చియోని అభిమానించే ఒక వ్యక్తి తనకి ఒక ఆశ్రయం కలిపిస్తాడు అన్ని సంవత్సరాలు.కష్టాల పడుతూ కొన్ని సంవత్సరాలు అక్కద గడిపిన తర్వాత యుధ్ధం ముగుస్తుంది. కాని geisha ల పరిస్థితి అంతకుముందు అంత మెరుగ్గా ఉండదు. కొంతకాలం తర్వాత తను అభిమానించే వ్యక్తి వద్దకు శాశ్వతంగా వెళ్ళిపోతుంది.
మొదటి సగం తను చిన్నపిల్లగా ఉన్నంతవరకు బాగా నచ్చింది, తర్వాత కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు కాని మొత్తంగా చూస్తే మాత్రం బావుంది. ఈ పుస్తకం పబ్లిష్ చేసినప్పుడు చాల మంది ఇది నిజం ఆత్మకథ అనుకున్నారట.  రచయిత Golden Arthur చాల పరిశోధించి, 1930-40 లలో  జపాన్‌లో geisha పరిస్థితుల గురించి తెల్సుకొని వ్రాసాడట. అప్పటి జపాన్ వీధులని, geisha housesని, tea houses ని కళ్ళకి కట్టినట్టు వివరిం చిచదువుతున్నంత   సేపు మనల్ని జపాన్‌లో విహరింపజేస్తాడు.
కొన్ని సార్లు ఏమీ తెలియకుండ కొన్న బుక్స్ చదవలేకపోయా కాని కవర్ చూసి కొన్నందుకు ఇది నిరాశపర్చలేదు.  i enjoyed reading this.
ఇంకా ఇది పూర్తయ్యక మొదలు పెట్టింది, చాలా మంది దగ్గర  విని, చాలా గొప్పగా దాని గురించి తెల్సుకొని చదువుదాం అని తెచ్చుకొన్నది Ayn rand's Atlas shrugged. కాని అది మరీ 1100 పేజీలు ఉంది. ఒక 50 పేజీల వరకి చదివా, త్వరగా చదవాలి అనిపించే లాగ ఐతే లేదు ప్రస్తుతానికి.
అందులోనూ ప్రింటింగ్ చాల దగ్గర దగ్గరగా ఉండి ఇంకా ఇంట్రెస్ట్ రాట్లేదు. చూడాలి ఎప్పుడు పూర్తి చేస్తానో. అసలే అంత గొప్పగా విన్న సినిమాలు, పుస్తకాలు నచ్చే అంత ఎదగలేదేమో ఇంకా నేను.

Friday, August 23, 2013

రెండు పుస్తకాలు -1

ఈ మధ్య నేను చదివిన పుస్తకం ఒకటి, చదువుతున్న పుస్తకం ఒకదాని గురించి రాద్దామని.
ఒకటి Arthur Golden రాసిన Memoirs of a Geisha.
ఈ బుక్ చదివే వరకు దీని గురించి వినలేదు. ఏదైనా కొత్త బుక్ చదువుదామని వెతుకుతుంటే ఇది కనిపించింది . చూడగానే కవర్ పైన ఉన్న పిక్చర్ తెగ నచ్చేసింది. కేవలం కవర్ చూసి కొన్న పుస్తకం ఇదేనేమో.
చూడండి ఎంత బావుందో. అమ్మాయి కళ్ళు డిఫరెంట్ గా ఉన్నాయి కదా, కథలో కూడా ఆ కళ్ళ గురించి చాలాసార్లు చెప్తాడు రచయిత . రచయిత పుస్తకాన్ని ఒక ఆత్మకథ లా రాసాడు.
sayuri అనే ఒక geisha తన గురించి, తన జీవితం లో చిన్నతనం నుండి జరిగిన విషయాలు, ఒక చిన్న ఊరి నుండి జపాన్ లోనే ప్రముఖమైన geisha గా మారడానికి  చేసిన ప్రయాణం ,చియో నుండి సయూరి గా మారే క్రమంలో తను ఎదుర్కొన్న కష్టాలు కళ్ళకు   కట్టినట్టు వివరిస్తుంది.
geisha అంటే జపాన్‌లో పాత కాలం లో ఆడవాళ్లకే పరిమితమైన ఒక వృత్తి. అందంగా అలంకరించుకొని tea house లలో (అప్పట్లో మగవారు రిలాక్స్ అవడానికి tea house కి వచ్చేవారంట) , పార్టీలు,  ఫంక్షన్‌లకి వచ్చిన అతిథులని వీరికి వచ్చిన వివిధ కళలతో అలరించడమే వారి పని.అందుకు గాను వాళ్ల నైపుణ్యాన్ని బట్టి జీతం తీసుకుంటారు. 
ఒక మామూలు అమ్మాయి geish కావడం చాలా కష్టమైన పని.చాలా చిన్నతనం నుండే, అంటే దాదాపు 4,5 సంవత్సరాల వయసు నుండే శిక్షణ మొదలుపెట్టేవారు.  geisha కి కావల్సిన విద్యలు నేర్పడానికి ప్రత్యేకంగా స్కూళ్ళు ఉండేవి. అక్కడ చిన్నతనం నుండే డ్యాన్స్, పాటలు పాడటం ఇంకా ఏవైనా సంగీత పరికరాలు వాయించటం నేర్పిస్తారు. 15-16 సంవత్సరాలు వచ్చాక  అధికారికంగా geisha అయ్యింది అని ప్రకటించిన తర్వాత పని మొదలు పెడతారు.  

ఇంక కథలోకి వెళ్తే  'చియో' అనే ఎనిమిదేళ్ళ అమ్మాయి అమ్మా, నాన్న , అక్కతో కలిసి ఒక చిన్న ఊరిలో, చాల పేదరికం లో  జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండ ఒక వ్యక్తి ,చియో ని చూసి తన కళ్ళకి ఆకర్షితుడవుతాడు.చియో కుటుంబం గురించి తెలుసుకొని,  వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒకరోజు అక్కచెళ్ళెల్లిద్దర్నిసిటీ లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తాడు. 
ఈలోపు ఆ పిల్ల్లల అమ్మకి ఆరోగ్యం పాడైపొతుంది, ఇంకా ఎక్కువ రోజులు బ్రతకదు అని చెప్తాడు. ఇంకో వైపు వాళ్ల  నాన్న కూడా ముసలితనంతో ఏ పని చెయ్యలేకపోతాడు.
తర్వాత ఒకరోజు వీళ్ళని సిటీ కి తీస్కెళ్ళిన వ్యక్తి వచ్చి పిలల్లిద్దర్ని తనతో తీస్కెళ్ళిపోతాడు.  తమ మీద చూపిస్తున్న ప్రేమ చూసి పాపం ఆ పిల్లలు వాళ్ళని పెంచుకోవడానికి తీస్కెళ్తాడేమో అనుకుంటారు. కాని ఆ పెద్దమనిషి వాళ్ళని వేరే కొత్త వ్యక్తికి అప్పగిస్తాడు. అతను వీళ్ళని తనతో పాటు ట్రైన్లో తీస్కెళ్ళి వాళ్ళు ఎప్పుడూ చూడనటువంటి ఒక పెద్ద సిటీకి తీస్కెళ్తాడు. అదే Kyoto సిటీ. ఆ పిల్లలు ఎప్పుడూ ఊహించనంత పెద్ద పట్టణం. 
ఎక్కడికి తీస్కెళ్తున్నామనేదానికి ఆ వ్యక్తి జవాబు చెప్పడు. వాళ్ళలో కొంచెం కొంచెంగా ఉన్న భయం ఎక్కువవుతుంది. ఇది కచ్చితంగా మంచి జరగబోవడం లేదని అర్థమవుతుంది. ఆ వ్యక్తి చియోని ఒక ఇంట్లో దింపి, అక్కని మాత్రం తనతో తీస్కెళ్తాడు. చియోకి అది geisha house అని తెలుస్తుంది. అక్క గురించి మాత్రం ఎవరికి అడిగినా తెలుసుకోలేకపోతుంది. 
ఆ ఇంట్లో కొందరు పెద్దవాళ్ళు, పని వాళ్ళు తన వయసులోనే ఉన్న ఇంకో అమ్మాయి, (pumpkin అని పిలుస్తుంది చియో తనని) ఉంటారు. వీళ్లందరికీ ఆధారం ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క geisha. చియో ఆ ఇంటి యజమానురాలికి నచ్చుతుంది, తను పెద్దయ్యక చాల అందంగా  ఉంటుంది, తను geisha గా ఎంత సంపాదిస్తే ఆ ఇంటికే కదా లాభం అనుకుంటుంది. కాని చియో అక్కడ సర్దుకోలేకపోతుంది. తన చిన్న ఇళ్ళు, ఆ పల్లెటూరి సముద్ర తీరం, జబ్బుతో మంచంలో ఉన్న తన తల్లి పదే పదే గుర్తొస్తారు. 
ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకోవాలి, కనీసం అక్కనైనా కలుసుకోవాలి అనుకుంటుంది. తనకి ఆ ఇంట్లో కొన్ని పనులు అప్పగిస్తారు, ఒక రోజు ఇంట్లో ఏదో పని కోసం బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి తెలియకుండా   అక్కని వెతుక్కుంటూ వెళుతుంది. చివరికి తను ఒక prostitute house లో ఉంది అని తెలుసుకొని వెళ్ళి కలుస్తుంది.ఇద్దరు కలిసి ఆ రాత్రి పారిపోవడానికి ప్లాన్ చేసుకుంటారు. చియో తనుండే ఇంటికి వచ్చి చీకటి పడ్డాక వాళ్ళు కలుసుకోవాలనుకున్న చోటికి వెళ్దాం అనుకుంటుంది. ఆ ప్రయత్నం లో ఇంట్లోంచి తప్పించుకుంటూ వాళ్ళకి దొరికిపోతుంది.
 geisha housesలో కొత్తగా చేరిన వాళ్లని కొన్ని రోజులు చిన్న చిన్న పనులు   చేపించి నమ్మకం కుదిరాకనే geisha training కి పంపుతారు, ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని, కొంతకాలం ఖర్చు పెట్టాక పారిపోతే నష్టం కదా.. అందుకని.  పారిపోతూ దొరికిపోయేసరికి తనని ట్రైనింగ్ కి పంపకుండా పని మనిషి లాగే ఉంచాలని నిర్ణయిస్తారు. తనని ఇంట్లోంచి తీసుకొచ్చిన వ్యక్తి ఉత్తరం రాస్తాడు .  
తన తల్లి మరణించిందని, ఈ పరిస్థితుల్లో తను ఇక్కడ ఉండటమే మంచిదని ఇక్కడికి పంపాననీ రాస్తాడు.  
అదే సమయంలో pumpkin ని geisha స్కూల్ లో  చేర్పిస్తారు అందువల్ల తన పరిస్థితి మెరుగవుతుంది ఇంట్లో. చియోకి తను ఇంక ఇక్కడ ఉండటం తప్పదు అని అర్థం అవుతుంది. కాని జీవితాంతం అలా పని మనిషిగా ఉండిపోదల్చుకోలేదు. ఎలాగైనా తను  geisha అయి తీరాలి అని నిర్ణయించుకుంటుంది, కాని ఏ దారి కనిపించదు, మళ్ళీ తనని నమ్మి స్కూల్‌కి పంపడానికి ఆ ఇంట్లో వాళ్ళు సిధ్ధంగా లేరు.  ఈ పరిస్థితుల్లో తనేం చేసిందో తర్వాత చెప్తాను..... 

Thursday, August 22, 2013

నీలు - అమ్ము

ట్రింగ్ ట్రింగ్..
నేను:  "హలో నీలు.."
హాయ్
"నీలూ..నీకో విషయం చెప్పాలి"
చెప్పవే.
"అది చెప్దామనే చేసా.."
చెప్పు బేబీ త్వరగా
"నువ్వు మన ఫ్రెండ్స్ ఎవ్వరికీ చెప్పొద్దు మరి"
చెప్పను..
"నిజ్జంగా!! అస్సలు చెప్పొద్దు"
 ఎహె చెప్పను అని చెప్పాగా
"జోక్ కాదు, నువ్వు నిజ్జంగా చెప్పను అంటేనే చెప్తాను నీకు"
నిజంగా చెప్పను అను..
"నీ మీద నమ్మకంతో నీకొక్కదానికే  చెప్తున్నా"
చెప్పాను కదా, ఎవ్వరికీ చెప్పను మనవాళ్ళకి, సరేనా ఇప్పుడు చెప్పు.
"ఎవరికన్నా చెప్పావో నేను చాలా ఫీల్ అవుతా, మన ఫ్రెండ్స్ ఏడిపిస్తారు చెప్తే నన్ను. నువ్వు కూడా నవ్వొద్దు "
అబ్బా చెప్పవే ఇంక, చెప్పను అని అన్నాగా
"అది.. మరి.."
ఆ..
"నేను ఒకటి చూపిస్తా నీకు, చూసి ఎలా ఉందో చెప్పు "
ఏంటది
"నేను ఒక బ్లాగ్ రాస్తున్నా ఈ మధ్య"
బ్లాగా?? దేనికి
"దేనికి అంటే ఊరికినే"
అంటే ఏం రాస్తావ్, ఎందుకు రాస్తున్నావే
"ఏం అంటే ఏదో ఒకటి,నాకు అనిపించిన సోది అంతా"
ఏం చేస్తావ్ రా..సి ఏమొస్తుంది
"అంటే FB లానే ఇక్కడ కూడా రాసి పోస్ట్ చేయొచ్చు, లింక్ పంపిస్తా నువ్వు కూడా చూడు, మళ్ళీ చెప్తున్నా ఎవ్వరికి చెప్పకు"
అబ్బ చెప్పన్లే.పంపించు చూస్తా
....................
................................................
హహహ.. ఒక 5 మినట్స్ నవ్వింది
"సరే చదువు ఇప్పుడు, ఎలా ఉందో చెప్పు"
సరే చదివి ఫోన్ చేస్తా మళ్ళీ
...
....
ఇదంతా నువ్వే రాసావా.. బావుందే బాగా రాసావ్  నిజ్జంగా. అమ్ముకి కూడా చెప్దాం. అది ఎంజాయ్ చేస్తుంది తప్పకుండా.  ..

పాపం నాకొసం తెలుగు సరిగ్గా చదవటం రాకపోయినా గంట సేపు కూర్చుని ఒక్కొక్క పోస్ట్ చదివి, రోజు నన్ను నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడు రాస్తావ్   అని అడిగే నీలు కి 100 times థాంక్యూ..
అమ్ము గురించైతే చెప్పక్కర్లేదు, ఏమి చేసినా చెయ్యకపోయినా  నన్ను తెగ మెచ్చుకొని ఎంకరేజ్ చేసే తనకి 1000 థాంక్యూ లు.....



Tuesday, August 20, 2013

కిటికీ అవతల ప్రపంచం

కిటికీ పక్కన కూర్చుని బయటికి చూస్తూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు అంటాడు ఒక పుస్తకం లో రచయిత. అది అందరికీ వర్తించదనుకోండి. అందులో ఒక పాత్ర కిటికీ  పక్కన కూర్చుని వచ్చీ పోయే   వాళ్ళని చూస్తూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళు ఏ పరిస్తితుల్లో అక్కడి నుండి వెళ్తున్నారో, ఎం ఆలోచిస్తూ ఉంటారో విశ్లేషిస్తూ ఉంటాడు. ఏమీ తోచనప్పుడు నిజంగా అది మంచి టైంపాస్‌లే .
ఎప్పుడో చదివిన కొన్ని వ్యాక్యాలు నా మాటల్లో..
ఒక హాస్పిటల్లో బెడ్‌కే పరిమితమైపోయిన ఒక గుడ్డివాడు ఉంటాడు. అతని బెడ్ పక్కనే గుండె జబ్బుతో   బాధ పడుతూ హాస్పిటల్లో చేరిన వ్యక్తి ఉంటాడు. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. కళ్ళు లేని వ్యక్తి బెడ్ పక్కన కిటికీ ఉంటుంది, తను రోజు పక్క అతన్ని కిటికీ బయట ఏం జరుగుతుందో చెప్పమంటాడు. ఆ వ్యక్తి తనకి కిటికీ నుండి కనిపించేవి అందంగా తనదైన మాటల్లో గుడ్డివానికి చెప్తూ ఉంటాడు.
ఇప్పుడు కిటికీ అవతల ఉన్న రోడ్ మీద ఒక చిన్న పాప  తన తల్లితో కలిసి వెళ్తోంది. బహుశా స్కూల్ నుండి పాపని ఇంటికి తీసుకెళ్తుందేమో. ప్రొద్దున్నుండి విడిచి ఉన్న కూతుర్ని చూసిన  ఆనందంలో తల్లి మొహం వెలిగిపోతుంది. రోజంతా తను చేసిన పనులు, స్కూల్లో జరిగిన విషయాలు అమాయకమైన నవ్వుతో తల్లికి చెప్తుంది ఆ చిట్టి కూతురు. అమాయకత్వం, కల్మషం లేని బంధం ఇదేనేమో...
ఇంకో రోజు చెప్తాడు
ఒక జంట నడుచుకుంటూ వెళ్తున్నారు, చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా ఉంది. పెళ్ళి నాటి సిగ్గు ఇంకా అమ్మాయి మొహంలో తొలగిపోలేదు. తన భర్త చెయ్యి విడవకుండా పట్టుకొని ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంది, ఈ చెయ్యి ఎప్పటికీ  విడిపెట్టను అన్నట్టు భర్త కూడా అంతే గట్టిగా పట్టుకొని   భరోసా ఇస్తున్నాడు. ప్రేమంటే ఇలా ఉంటుందేమో...
దగ్గర్లో ఉన్న కాలేజ్ నుండి కొందరు అమ్మాయిలు వెళ్తున్నారు. ఇప్పుడే కొత్తగా కాలేజ్‌లో చేరినట్టున్నారు. కొత్త కొత్త ఆశలు, రాబోయే కాలం లో సాధించాలనుకున్న ఆశయాలు కదులుతున్నాయి వాళ్ళ కళ్ళల్లో.
ఇంకో రోజు అప్పుడే పడిన వర్షంలో విచ్చుకొని తడిసిన చిరుమొగ్గ అందాన్ని వర్ణిస్తాడు.
ఇలా ప్రపంచంలోని అందాల్ని, బంధాలని తన మాటల్లో కళ్ళు లేని స్నేహితుడికి చూపిస్తాడు.
మంచంపై  నుండి కదలలేని కళ్ళు లేని వాడికి జీవితం పై కొత్త ఆశ కలిపిస్తాడు.  కొన్ని రోజులకి గుండె జబ్బు వ్యక్తి పరిస్తితి విషమించి చనిపోతాడు. తర్వాత ఆ బెడ్ పైకి ఇంకో వ్యక్తి వస్తాడు. సాయంత్రం కాగానే అతన్ని అడుగుతాడు ఈ గుడ్డివాడు  బయట స్కూల్ పిల్లలు వెళ్తున్నారా అని, అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు అసలు కిటికీ అవతల బయటి ప్రపంచమే కనిపించట్లేదు, అక్కడ గోడ తప్ప ఇంకేమి లేదు అని.
ఇన్నాళ్ళు ఏమీ కనిపించని దాన్ని, అందంగా వివరించి తనలో కొత్త ఉత్సాహన్ని నింపిన తన మరనించిన స్నేహితుడికి మనసులో కృతజ్ఞత చెప్పుకొని, మిగిలిన జీవితాన్ని అదే ఉత్సహంతో కొనసాగించడం తప్ప ఎమి చేయగలడు.
పనిలో పనిగా మా బిల్డింగ్ నుండి కనిపించే వ్యూ చూడండి.
My photo

బావుంది కదా... అక్కడ కూర్చుని కనిపించే రోడ్, వచ్చి పోయే కార్స్ ని చూడ్డం నాకైతే భలే ఇష్టం. అన్నిటికన్నా అలా బొమ్మల్లా వరుసగా పార్క్ చేసిన కార్స్ భలే అనిపిస్తుంది ఎన్ని రోజుల నుండి చూస్తున్నా.. 


Wednesday, August 7, 2013

జీవితం చిన్నదా పెద్దదా?

జీవితం చిన్నదా పెద్దదా?

ఒక్కోసారి అనిపిస్తుంది ఈ జీవితం చాలా పెద్దది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరం ఎంత ఎక్కువ సమయమో కదా,ఎంత మందిని కలిసాం, ఎన్ని పనులు చేసామో కదా..  అని..
        ఇంకోసారి అనిపిస్తుంది  ఈ జీవితం ఎంత చిన్నది గడిచిన సంవత్సరం,కాలం ఎంత త్వరగా అయిపోయింది,మొన్ననే కదా అక్షరాలు నేర్చుకుంటూ తొలి అడుగులు వేస్తూ స్కూల్‌కి వెళ్ళింది, నిన్ననే కదా ఏదో సాధించేద్దాం అని కలలు కంటూ కాలేజ్ లో అడుగుపెట్టింది,  అదేంటి అప్పుడే ఇంత పెద్దగా అయిపోయాను అని..

ఒక్కోసారి అనిపిస్తుంది ఏదో సాధించాలి, అనుకున్నవన్నీ జరగాలి, కావాలనుకున్నవన్నీ దొరకాలి అని. ఇది లేకపొతే బ్రతకలేము, అది లేకపొతే సంతోషంగా ఉండలేము అని..ఉన్నది ఒక్కటే జీవితం, చాలా పెద్ద జీవితం అందులో అన్ని సమకూర్చుకోవాలి అని...
           ఇంకోసారి అనిపిస్తుంది ఉన్నవాటితోనె సంతోషంగా ఉండాలి, లేని వాటిని కావాలి అనుకోకూడదు. ఉన్నది చాలా చిన్న జీవితం, లేని వాటి కోసం తాపత్రయపడి ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు.  ఏది ఉన్నా లేకపోయినా ఈ నిమిషం మన చేతిలో ఉంది కదా అని..
Google Photo

ఏది ఎమైనా మనం ఆనందంగా ఉన్న సమయం చాల త్వరగా గడుస్తుంది, బాధల్లో ఉన్నప్పుడు ఎప్పుడు గడుస్తుందా అనిపిస్తుంది...
ఈ జీవితం చిన్నదైనా పెద్దదైనా, సంతోషంగా ఉన్నా విషాదంగా ఉన్నా,నీటి పైన రాత అంత క్షణికమైనా, రాతి మీద చెక్కిన శాసనమంత దీర్ఘమైనదైనా ఏదైనా ఈ జీవితం మనది....

Thursday, August 1, 2013

అతివృష్టి - అనావృష్టి

అతివృష్టి - అనావృష్టి వర్షాల గురించి కాదు, ఎండ- వేడి, మంచు- చలి. ఇండియా లో హయిగా వర్షాలు పడుతూ ఉంటే ఇక్కడేమో ఎండలతో కష్టపడుతున్నాం. ఈసారి సమ్మర్ లో ఐతే 102,103 వరకు చేరింది టెంపరేచర్. చూడండి
ఇది నిన్న సాయంత్రం 6 గంటలకు తీసింది.సాయంత్రమే  అలా ఉంటే మధ్యాహ్నం  ఎలా ఉండి ఉంటుందో.
మొన్నొకరోజు బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ కార్లో మర్చిపోయి ఒక గంట తర్వాత తీస్కెళ్దామని వచ్చాను. చూసేసరికి స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోయి warning symbol తో  మెస్సేజ్ dislpay అవుతుంది, ఏమనో తెల్సా  ఫోన్ ఓవర్ హీట్ అయ్యింది,మళ్ళీ వాడేముందు కాసేపు చల్లని ప్లేస్ లో ఉంచమని. ఇలాంటిది ఐతే ఇంతకుముందెప్పుడు చూళ్ళేదు. ఒక గంటకే అలా అయిపోతే అలానే సాయంత్రం వరకు వదిలేస్తే ఇంక పనికి రాకుండా అయిపోయేదేమో.
అలా అని పోన్లే ఎండాకాలం లో కొన్ని రోజులు కష్టపడితే పడ్డారు, చలికాలం లో వేరే చోట్లలో మంచు పడుతుంటే ఇక్కడ హాయిగా ఉండొచ్చు అనుకోవడానికి లేదు. చలికాలం  ఇక్కడ ఎలా ఉంటుందంటే
మీరే చూడండి


ఇది ఈ సంవత్సరం వింటర్ మా ఇంటి ముందు. అక్కడ రెడ్ కలర్ లో రౌండ్ చేసానే అదే నా కార్.బంపర్ తప్ప అంతా మునిగిపోయింది కదా మంచులో.ఈ ఫిబ్రవరిలో ఐతే దాదాపు ప్రతిరోజు స్నో పడింది.
మంచు పడడం ఆగిపోగానే నడవడానికి, డ్రైవ్ చెయ్యడానికి వీలుగా ఉండేలా   అపార్ట్‌మెంట్ వాళ్ళు అంతా క్లీన్ చేపిస్తారు, మంచు అంతా తీసెయ్యడానికి వీలుగా ఎవరి కార్ వాళ్ళు అక్కడి నుండి తీసి పక్కకి పెట్టాలి. ఆ క్లీన్ చేసేవాళ్ళూ మధ్యలో  అంతా చేస్తారు కాని మన కార్స్ ని ఎందుకు చేస్తారు. అందుకే అదంతా కార్ మీద నుండి తీసి క్లీన్ చెయ్యక తప్పదు.
 ఆరోజు అదంతా తీసెయ్యడానికి నాకు ఒక 2 గంటలు పట్టింది. ఆ చల్ల గాలికి కాళ్ళకి, చేతులకి ఎంత కప్పుకున్నా, స్నో లో అంతసేపు ఉండే సరికి ప్రాణం పోయినట్టైంది.
ఈ ఎండలో ఆ మంచు ని చుస్తుంటే హయిగా అనిపిస్తుంది ఒకవైపు, మరోవైపు అమ్మో!!! మళ్ళీ చలికాలం వస్తే ఆ చలిని ఎలా భరించాలి అనిపిస్తుంది.
హ్మ్... అందుకే అన్నది ఐతే అతివృష్టి లేకపోతే అనావృష్టి.