Monday, September 30, 2013

ఆంధ్ర-తెలంగాణ భాష

ఇప్పుడంతా ఆంధ్ర-తెలంగాణానే హాట్ టాపిక్ కదా. కాని నేనేం తెలంగాణానో, సమైక్యాంధ్ర ఉద్యమం గురించో చెప్పట్లేదులెండి.
ఆంధ్ర-తెలంగాణ వాళ్ళు వాడే భాష వల్ల జరిగిన కొన్ని చిన్న విషయాలు.
మనం ఎవరన్నా వేరే భాష వాళ్ళతో, కొత్త భాషలో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అర్థం కాకపోతే ఆ భాష మనకి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి అడిగి confirm చేసుకుంటాం. కాని తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే మాట్లాడుకుంటే ఎలాగూ మనకి తెల్సిన భాషే అని, మనకు వచ్చినట్టూ అర్థం చేసుకుంటామేమో.
ఇదంతా ఇప్పుడెందుకంటే,
మా ఫ్రెండ్స్ ఇద్దరి వల్ల ఒకసారి జరిగిన కామెడి గుర్తొచ్చింది. మా ఫ్రెండ్స్ లో ఒకతను ఏదో పని చేసుకుంటూ ఇది కాస్త చిల్లు పెట్టరా అని చేతిలో ఉన్న కొత్త ointment పక్కనున్నతనికి ఇచ్చాడట.
ఎంతసేపటికి తిరిగి తెచ్చివ్వకపోతే, చిల్లు పెట్టడానికి ఇంతసేపేంటా అని, అతన్ని పిలిచి ఏదిరా ointment అంటే, fridgeలో ఉంది అన్నాడు. అదేంటి ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టావంటే, నువ్వే కదా chill పెట్టమన్నావ్, అందుకే తీసుకెల్లి fridgeలో పెట్టా అన్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే అతనికి చిల్లు అంటే hole చెయ్యాలని తెలియదు. అసలు అలా ఎలా అనుకున్నావ్ చిల్లు అంటే తెలియకపోయినా fridgeలో పెట్టాలన్నఆలోచన ఎలా వచ్చింది అంటే, దాని మీద keep in cool place అని రాసి ఉంది అందుకే chill గా పెట్టమన్నావేమో అనుకున్నా అన్నాడు :).


ఇలాంటిదే ఇంకోటి, నేను ఇంటర్ కి హాస్టల్‌లో చేరాను. ఒకరోజు ప్రొద్దున్నే లేచి రెడీ అయ్యిstudy hours కి వెళ్తున్నాము. త్వరత్వరగా బుక్స్ తీస్కొని పరిగెడుతున్నా.  లాస్ట్‌లో నేనే ఉన్నాను. ఇంతలోకి మా వార్డెన్ నా ముందు నుండి కోపంగా అరుస్తుంది. "ట్యాప్ కట్టేసి రా" అని. నకు అర్థం కాలేదు, ఎవర్నో ఏదో కట్టెసి రమ్మంటుంది, నాకెందుకు అని నేను అలానే ముందుకి వెల్తున్నా. మళ్ళీ నన్నే పిలుస్తూ అమ్మాయ్, ఆ ట్యాప్ కట్టెసి రా అంది.
అసలు ఏం కట్టెయ్యాలి, ఎక్కడ కట్టెయ్యాలి, అక్కడ వెనక చూస్తే తాడు లాంటిది ఏమి కనిపించట్లేదు నాకు. ఎవరైనా ఏదన్నా కట్టు విప్పేసారా తెలీకుండా, నన్ను అంటుంది వార్డెన్ అనుకుంటూ అయోమయంగా చుస్తూ నిల్చున్నా. ఈలొపు తనే వచ్చి, ట్యాప్ ఆపేసి, ఏమ్మా వాటర్ పోతున్నాయ్ ట్యాప్ లోంచి ఆపెయ్యమంటే వినపదట్లేదా అని వెళ్ళిపోయింది. అప్పుడర్థం అయ్యింది కట్టెయ్యమంటే అర్థం ఆపెయ్యడం అని.
ఇప్పుడు తెల్సిన/వాడుతున్న చాలా తెలుగు పదాలు స్కూలింగ్ తర్వాత నేర్చుకున్నవే. అప్పుడు చాలా పదాలకి అర్థమే తెలియకపోయేది.

Thursday, September 26, 2013

నేను - నా సినిమా కష్టాలు

సినిమా కష్టాలు అంటే నాకు సినిమాలో లాంటి కష్టాలు ఉన్నాయని కాదు, సినిమా వల్ల కష్టాలు లేదా సినిమా కోసం కష్టాలు.
సంతోషం ప్లస్ బాధ
ఆహ్లాదం ప్లన్ చిరాకు
రెండు కలిపి ఎప్పుడన్నా వస్తాయా..
వస్తాయి ఎప్పుడైనా tasty food తింటున్నప్పుడు పక్కనుండి nasty smell  వస్తేనో..
మనం చేసిన వంట బావుందని మనకే మిగల్చకుండా వేరేవాళ్ళు తినేస్తేనో..
కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఎవరూ చూడకపోతేనో..(కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజు నాకు ఎలా ఉన్నా హాపీగా ఉన్నట్టనిపిస్తుంది మరి)
ఇలాంటప్పుడు ఈ ఇద్దరు ఫీలింగ్స్ కలిసి వస్తారు కదా...

Google Image


ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వస్తారట. ఎందుకో తెల్సా..
ఎందుకంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసా.ఇంక దేనికి అత్తారింటికి దారేదికే.  అంత వరకు బానే ఉంది. ఇది హ్యపీ పార్ట్(hopefully). నాకు సమంత ok, పవన్ కళ్యాణ్ ఇంకా ok, త్రివిక్రం ఇంకా ఎక్కువ ok. సో హ్యపీగానే ఉంటుందనుకుంటున్నా..
ఇంక sad పార్ట్‌కొస్తే ఫస్ట్, theater లో స్క్రీన్ గురించి చెప్పాలి, తర్వాత అందులో సీట్స్ గురించి చెప్పాలి.
నాకేమో ఎంచక్కా పెద్ద స్క్రీన్‌లో సినిమా చూస్తే సంతోషంగా, కంటికి హాయిగా, కడుపు  నిండిపోయినట్టుగా అనిపిస్తుంది.
ఇప్పుడు మేము వెళ్ళే theater లో స్క్రీన్ ఎంత ఉంటుందంటే ఇంట్లో ఉండే home theater కి 4 ఇంచులు అటూ ఇటూ ఉంటుందంతే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లోపలికి అడుగు పెట్టగానే షాక్ అయ్యా ఒక రెండు నిమిషాలు. అప్పటివరకు అలాంటి డొక్కు, పిచ్చి, గలీజ్ theater ఎప్పుడు చూడలేదు. ఇండియాలో చిన్న టౌన్‌లో నేను చూసిన theaters కూడా ఇంతకన్నా బానే ఉంటాయి.ఇందులో అసలు నాకు theaterలో సినిమా చూసిన ఫీలింగే రాదు. ఏదో DVD ప్రింట్ పెద్ద T.Vలో పెట్టుకొని చూసినట్టనిపిస్తది.
మామూలుగా అయితే నాకు స్క్రీన్ open చెయ్యకముందు వెళ్ళి, adsతో సహా చూస్తేనే తృప్తిగా అనిపిస్తుంది. ఒకవేళ రీల్ పడ్డాకో, టైటిల్స్ పడుతున్నప్పుడో వెళితే ఏదో మిస్ అయిపోయినట్టనిపిస్తుంది. ఇంక సినిమా మొదలయ్యాక వెళ్తే అంతే సంగతి, మళ్ళీ ఆ మిస్ అయిన సీన్స్ చూసేవరకు( అందులో ఏమి స్టోరీ జరగకపోయినా).  అలాంటి  ఫీలింగ్ ఏది రాదు ఈ theater లో.
సరే పోని చిన్న స్క్రీన్ అయినా హాయిగా కూర్చొని చూద్దాం అంటే అదీ లేదు. కాస్త త్వరగా వెళ్ళి వెనక సీట్స్‌లో కూర్చుంటేనే సరి, లేకపోతే కొంగలా మెడ పైకెత్తి చూడాలి. సినిమా అయ్యేలొపు మెడ పట్టెయ్యడం ఖాయం. పైగా అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
పోయినసారి ఒక సినిమాకెళ్ళినప్పుడు కాస్త లేట్ అయ్యింది. వెళ్ళే అప్పటికి టైటిల్స్ పడుతున్నాయి. అందరు కూర్చున్నారు. theater  మధ్యలో వరకు నిండిపోయింది. మధ్యలో ఒక 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. వెళ్ళింది ముగ్గురం కాబట్టి అక్కడ సరిపోతాయ్  అని వెళ్ళి కూర్చున్నాం.
కూర్చుంటూ అనుకున్నాం, మధ్యలో ఏ వరస ఒక్కటి మనకొసమే అన్నట్టు వదిలేసారు, లేకపొతే ఇంకా ముందుకెళ్ళి కష్టపడాల్సొచ్చేది అని నవ్వుకుంటూ కూర్చున్నాం. వాళ్ళిద్దరు బానే కూర్చున్నారు. నేను కూర్చున్న సీట్ ఒక సైడ్ కాస్త విరిగిపోయి వంగిపోయి ఉంది.
ఈ సీట్ కొంచెం విరిగిపోయింది, అటు పక్క దాంట్లోకి వెళ్ళి కూర్చుంటా అని పక్కనున్న దానితో చెప్పి, ఆ సీట్‌లోంచి లేచి పక్కకెళ్ళి కూర్చున్నా. అన్యాయంగా ఆ సీట్ ఇంకా ఎక్కువ విరిగి ఉంది, అసలు కూర్చోడానికే రాట్లేదు. మళ్ళీ లేచి పాత సీట్లొకే వచ్చా. అసలే నాకు సినిమా మొదలయ్యాక మధ్యలో లేచి అటు ఇటూ తిరిగితే మొహమాటం, వెనక వాళ్ళు తిట్టుకుంటారేమో అని.
 సరే అని పాత సీట్లో ఒక వైపు వంగి కూర్చొని, మా వాళ్ళకి చెప్పా ఇక్కడ కష్టంగా ఉంది, ముందుకెల్దామా అని. అప్పుడే అసలు కథ మొదలవుతుందేమో మా వాళ్ళు కళ్ళప్పగించి చూస్తున్నారు, నా మాటకు సరిగ్గా రిప్లై కూడా ఇవ్వకుండా. పోని ఒక్కదాన్ని వెళ్దామా అంటే పక్కన వాళ్ళతో డిస్కస్ చెయ్యకుండా ఉండలేను సినిమా మధ్య మధ్యలో.
పైగా మెడ నొప్పి ఉంటది అక్కడ. సో మెడ నొప్పి, నడుము నొప్పిలో రెండో దానికే ఓటేసి ఇక్కడే కూర్చుని సినిమా చూసా.
హ్మ్మ్.. ఆ theaterకే ఇంకాసేపట్లో వెళ్ళబోయేది.
మరి అంత ఇష్టం లేకుండా దానికే ఎందుకు వెళ్ళాలి అంటే ఇంకా ఎక్కడ తెలుగు సినిమాలు రావు కాబట్టి. ఇదేమైనా దగ్గరా అంటే అదీ కాదు, ఈ మాత్రం మహాభాగ్యానికి గంట డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలి. మేమే గంట డ్రైవ్ వేస్ట్ అనుకుంటే, ఇక్కడికి 2,3 గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
సో.. నాకు ఈ రోజు కొంచెం వెనకాల సీట్, విరిగిపోయింది కాకుండా రావాలని ఆశిస్తూ.. 

Tuesday, September 24, 2013

Mr.మిరియం

Mr.మిరియం అమెరికా వెళ్దామని వీసా కి అప్ప్లై చేసుకొని, ఇంటర్వ్యూకి వెళ్లాడు.
ఇంటర్వ్యూలో ఆఫీసర్ ప్రశ్నలు అడుగుతున్నాడు.
ఏ సిటీకి వెళ్తున్నావు.
సాన్‌జోసె (San Jose)
అది సాన్‌జోసె కాదు సాన్ హోసె అనాలి.
ok, sir
ఏ నెలలో వెళ్ళాలనుకుంటున్నావు?  అడిగాడు ఆఫీసర్
మిరియం చెప్పాడు
హూన్, హులై లో...
---------------------
అలా మిరియం US వచ్చి ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నాడు. ఆ ఫ్రెండ్ కారు కొన్నాడని తెలిసి చూపించమని అడిగాడు. అతను బయటికి తీసుకెళ్ళి "ఆ కనిపిస్తుందే ఆడి కారు " అని చూపించాడు.
అప్పుడు మిరియం అన్నాడు
నీ కార్ చూపించమంటే ఆడి కార్, వీడి కార్ అని ఎవరిదో చూపిస్తావేంటి అని.

ఏంటి ఇంతేనా జోక్..అయిపోయిందా.
ఆ... తర్వాత..
ఓ... ఇది జోక్ ఆ...ముందే చెప్తే నవ్వేవాళ్ళంగా..

ఇలాంటి డైలాగ్స్ ఏమన్నా అనుకుంటే మనసులోనే అనుకోండి. నాకు చెప్పొద్దు.

-----Thanks to creator of Mr. Miriyam 

Sunday, September 22, 2013

ఇలా కూడా మర్చిపోతారా!!

మతిమరుపు అందరికి ఉండేదే. చిన్నదో పెద్దదో రోజు ఏదో ఒక విషయం మర్చిపోవడమో లేదా తప్పుగా గుర్తుంచుకోవడమో చేస్తునే ఉంటాము.అసలు తెలివైన వాళ్ళే చిన్న చిన్న విషయాలు ఎక్కువ మర్చిపోతుంటారట.
ఊరికెల్లే అప్పుడు అన్ని పెట్టుకున్నామనుకొని ముఖ్యమైన వస్తువేదో మర్చిపోవడం,ఏదో తీసుకోవాలనుకొని పక్క రూం లోకి వెళ్ళడం దేనికోసం వచ్చామో మర్చిపోవడం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది.
ఎన్ని సార్లు నా తల పైనే కళ్ళద్దాలు పెట్టుకొని, ఎక్కడున్నాయా అని వెతుక్కున్నా.
ఒకసారి ఒక ముఖ్యమైన అప్లికేషన్ పంపించాల్సి ఉండె.కావాల్సిన అన్ని documents, ఫొటోస్, amount రాసిన చెక్ పెట్టుకున్నా, అన్ని ఉన్నాయా లేవా,పేరు,డీటైల్స్ అన్ని కరెక్ట్ రాసానా లేదా అని ఒకటికి నాలుగు సార్లు వెరిఫై చేసా.
నా రూమ్మేట్ కూడ అప్ప్లై చేస్తుంటే ఇద్దరం కూర్చుని అన్ని పేపర్స్ మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకుని పోస్ట్ చేసాము.
వాటికి రిప్లై రావడానికి కనీసం 10 నుండి 15 రోజులు పడుతుంది. పోస్ట్ చేసాక ఇద్దరం రోజూ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉన్నాం.
4 రోజులయ్యాక నాకు రిప్లై వచ్చింది. అదేంటి అంత తొందరగా వచ్చింది అని ఆశ్చర్యపడుతూ తెరిచి చూస్తే, నేను పంపిన documents అన్ని అలాగే పంపారు.అందులో ఏదో నోటీస్ పంపారు, ఏంటా అని చూస్తే నేను అన్ని documents బానే నింపా కాని, చివర్లో సంతకం పెట్టలేదట.
హ్మ్మ్. సంతకం పెట్టి మళ్ళీ పోస్ట్ చేసా.
ఇంకోసారి ఆఫీస్ laptop ఇంట్లోనే పెట్టి చేతులు ఊపుకుంటు వెళ్ళా. అక్కడికి వెళ్ళి డెస్క్ లో చూస్తే అప్పుడు గుర్తొచ్చింది laptop ముందు రోజు ఇంటికి తీస్కెళ్ళానని. అసలే అప్పటికే లేట్ అయింది, ఇంక హడవిడిగా ఇంటికి తిరిగొచ్చి laptop తీస్కెళ్ళా. ఇల్లు దగ్గరే కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆరోజుకింకా off పెట్టాల్సొచ్చేది.
Google Photo

ఇలాంటిదే ఇంకోటి కాకపోతే నా గురించి కాదు.
పోయిన సంవత్సరం జనవరిలో మా ఫ్రెండ్ ఒకతను ఇండియా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు, తన వీసా ఇంకో 3,4 నెలల్లో expire అవబోతుంది, ఈలోపు వెళ్ళొచ్చేస్తే తర్వాత వీసా మెల్లగా extend చేసుకోవచ్చు అనుకొని ప్లాన్ చేసాడు. తన మాస్టర్స్ అయిపోయి అప్పుడే జాబ్ చేస్తున్నాడు.
అనుకున్నట్టుగానే ఒక 3 వీక్స్ లీవ్ పెట్టి ఇండియా వెళ్లి, హ్యాపీగా ఫ్యామిలీతో enjoy చేసాడు. ఇంకా తిరిగి వచ్చేరోజు వచ్చేసింది. లగ్గేజ్ అంతా సర్దుకొని, immigration కి కావాల్సిన documents అన్ని రెడీగా పెట్టుకొని ఏర్‌పోర్ట్‌కెళ్ళాడు. అందరికి బై చెప్పి లోపలొకి వెళ్ళాక, పాస్‌పోర్ట్ వెరిఫై చెయ్యడానికి ఆఫీసర్‌కి ఇచ్చాడు. అతను పాస్‌పోర్ట్ చూసి "బాబూ నీకు అసలు ఏ దేశం వీసా లేదు, ఎక్కడికి వెళ్ళేది!!!" అన్నాడు. ఇతను షాక్ అయ్యి పాస్‌పోర్ట్ చూస్తే వీసా మే వరకు ఉంది, కాని 2012 కాదు, మే 2011 !! :((

అంటే వీసా expire అయిపోయి చాలా నెలలైంది. (వీసా expire అయినా US లో ఉండొచ్చు, valid status ఉంటే. కాని ఒకసారి US బయటికి వెల్తే మాత్రం తిరిగి రావాలంటే వీసా ఉండాలి).
తను అప్పుడెప్పుడో పాస్‌పోర్ట్ చూసుకొని, మే 2012 అని గుర్తు పెట్టుకున్నాడు, 2011 బదులు. తనేం అజాగ్రత్త మనిషి కూడా కాదు, ఇంకా చెప్పాలంటే చాలా జాగ్రత్త మనిషి. వెళ్ళేముందు job verification letter అదీ, ఇదీ అన్ని చూసుకున్నాడు కాని వీసా విషయం చూసుకోలేదు. 
తనేమో తప్పనిసరిగా US రావాలి, అప్పుడే MS అయిపోయి జాబ్ జాయిన్ అయ్యాడు, ఇంకా MS లోన్ అంతా అలానే ఉంది. 
చేసేది లేక ఇంటికెళ్ళి, మళ్ళీ వీసా కి అప్ప్లై చేసుకొని కొన్ని రోజులకి వచ్చాడు. వీసా వచ్చేలోపు చూడాలి తన టెన్షన్. అప్పుడు టెన్షన్ పడి అందర్ని టెన్షన్ పెట్టాడు కాని , తర్వాత ఎన్ని సార్లు నవ్వుకున్నామో అసలు అంత పెద్ద విషయం అలా ఎలా మర్చిపోయాడా అని. 


Wednesday, September 18, 2013

చల్లని మధ్యాహ్నం

చల్లని సాయంత్రాలు, వెచ్చని మధ్యాహ్నాలు మాములే. కాని ఒక చల్లని మధ్యాహ్నం enjoy చెయ్యడం ఆనందమేగా..
ఒక్కోసారి పక్కనే ఉన్న వాటి గురించి పట్టించుకోము, కాని మళ్ళీ అలాంటి వాటి కోసమే ఎక్కడికో వెళ్తాం.
వీకెండ్ పని ఉండి బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నాము.
ఇప్పుడిప్పుడే చలి కాలం మొదలవుతోంది, కాని ఇంకా పూర్తిగా చల్లగా అవలేదు. ఆరోజు ఎండ కూడా లేకపోవడంతో చాలా బావుంది.
కొంచెం పని ఉండి బయటికి వెళ్ళి ఇంటికొస్తున్నాము,అది ఎప్పుడూ వెళ్ళని దారేం కాదు, అప్పుడప్పుడు అటు నుండి వెళ్తునే ఉంటాము, కాని ఎప్పుడు ఆగి చూడలేదు.
మొన్న మాత్రం కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనిపించి ఆగాము.
 పచ్చటి లాన్, దాటుకొని వెళ్తే కాస్త పెద్ద చెట్లు, ఇంకా ముందుకు వెళ్తే చిన్న చెరువు లాంటిది ఉంది.

చుట్టూ చెట్లు, మధ్యలో నీళ్ళు కనుచూపుమేరలో మనుషులెవరూ లేకుండా ప్రశాంతంగా,నిశ్శబ్దంగా...
చెట్ల మీద పక్షులు పాడుతున్న పాటలు, గాలికి కదులుతున్న నీళ్ళు గట్టుని తాకి చేస్తున్నచిన్న శబ్దం కూడా స్పష్టంగా వినిపించేలా...

సముద్రంలోని నీళ్ళకి, చెరువులోని నీళ్లకి ఎంత తేడా..
సముద్రంలో ఎగిసే అలలు జీవితంలో ముందుకు వెళ్తూ నీ గమ్యాన్ని చేరుకోమన్నట్టుంటే..
చెరువులో నిశ్చలంగా ఉన్న నీళ్ళు క్షణం ఆగి ,ఉరుకులు పరుగులు ఆపి ఈ నిమిషాన్ని జీవించు అన్నట్టుంటాయి. 

 ఈ ఫొటో panorama లో తీసా కాని క్లియర్ గా రాలేదు.





Friday, September 13, 2013

క్షణం ఆలస్యమైతే - థ్రిల్లర్ స్టోరీ

అధ్యాయం - 1

వాతావరణం ప్రశాంతంగా ఉంది, కాని అది తుఫాన్ ముందు ఉండే ప్రశాంతత.
దూరంగా తీతువు పిట్ట అరుస్తుంది ఎందుకో.
ఆ అరుపు విద్యుల్లత  మిక్సీ లో పిండి రుబ్బుతున్న శబ్దం లో కలిసిపోయి వినిపించట్లేదు.
విద్యుల్లత అప్పుడే పిల్లల్ని స్కూల్‌కి పంపి, పిండి రుబ్బడం పూర్తి చేసి తర్వాత చెయ్యాల్సిన ముఖ్యమైన పనులేమున్నాయో గుర్తు చేసుకుంది. ఈరొజు ఆఫీస్ కి లీవ్ కాబట్టి తీరిగ్గా పనులు చేసుకోవచ్చు అనుకుంటూ, పాలు తీసి స్టౌ పైన పెట్టింది. 
స్వతహాగ తేలివైనది కాబట్టి స్టౌ హైలో పెడితే త్వరగా పొంగిపోతాయి, మర్చిపోతే కష్టం అని మీడియంలో పెట్టింది. కిచెన్‌లో మిగతా పనులు చూసుకుంటూ ఉండగా హాల్లో ఉన్న ఫోన్ మోగింది. 
ఆ ఫోన్ అందుకోవడానికి కదిలింది విద్యుల్లత, ఆ కాల్ తన తలరాతనే మర్చడానికి కారణం అవుతుందని తెలిస్తే, బహుశా ఎప్పటికి ఆన్సర్ చెయ్యకపోయేదేమో. 

అధ్యాయం - 2

చిరాగ్గా ఉంది బృహస్పత్ కి. రాత్రంతా నిద్ర లేదు. production రిలీజ్ ఉన్నప్పుడల్లా ఇంతే. బాధ్యతంతా తన పైనే ఉంటుంది. ఏ సమస్య వచ్చిన అందరు తననే సంప్రదిస్తారు. 
కిటికీలోంచి వెలుతురు పడుతుంది. పక్కనే ఉన్న వాచ్‌లో టైం చూసాడు.చాలా లేట్ అయ్యింది. ఈపాటికి విద్యుల్లత లేచే ఉంటుంది అనుకొని, తను లేచి ఏమైనా తాగడానికి ఉందేమో చూద్దాం అని కిచెన్‌లోకి దారి తీసాడు. 
***********************
విద్యుల్లత ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. స్టౌ పైన పాలు పెట్టిన విషయం గుర్తురావట్లేదామెకిప్పుడు. 
తన ధ్యాస అంతా ఫోన్‌లో  స్నేహితురాలు చెప్తున్న విషయం పైనే ఉంది. 

పాలు వేడయ్యాయి. ఇంకో అర నిమిషమో, నిమిషమో అంతే గట్టు తెగిన  గోదారిలా పొంగడానికి సిధ్ధంగా ఉన్నాయి.
పాల ఉపరితలానికి, గిన్నె అంచుకి మధ్య దూరం  ఒక ఇంచు కూడా లేదు.
ఆ పాలు పొంగితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మానవ మాత్రుల ఊహకందని విషయం. దాని వల్ల జరగబోయే నష్టాన్ని పూడ్చడం ఈ భూమ్మీద ఉన్న ఏ ఒక్కరికైనా కష్టమైన పని. పాలు పొంగిన స్టౌ క్లీన్ చెయ్యడం చిన్న విషయమేం కాదు కదా.
అదే కాకుండా ఇంకా చాలా నష్టాలున్నయి, అన్నిటికన్నా ముఖ్యమైనది.....
Google Image

అధ్యాయం - 3

కిచెన్‌లోకి వెళ్ళిన బృహస్పత్   మనసెందుకో కీడు శంకిస్తోంది. ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే ఉండే పెరుగు గిన్నె బయట కిచెన్ గట్టు పైన ఉంది. 
అలా ఉండడం అరుదైతే కాదు, కాని.. కాని సాధారణం కూడా కాదు.విద్యుల్లత ఎంతో తెలివైంది, ఆమె మీద తనకా నమ్మకం ఉంది. ఏదో కారణం లేనిదే అలా బయట పెట్టదు పెరుగుని. 
పైగా భోజనం సమయం కూడా అవలేదు. 
కాని అది కాదు తనకి చెడు సంకేతాలిస్తుంది. 
కొన్ని క్షణాల్లో ఇక్కడ ఇంకేదో జరగబోతుంది అనిపిస్తోంది. 

ఆలోచిస్తునే నీళ్ళు తాగడానికి ఫ్రిజ్‌లొంచి బాటిల్ తీసాడు.ఫ్రిజ్ డోర్ వేస్తుండగా అప్పుడు వినిపించింది 
స్స్ స్స్
స్స్.. మని ఏదో చప్పుడు, టక్కున తల తిప్పి స్టౌ వైపు చూసాడు. 
పాలు పొంగడానికి సిధ్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పాలకి గిన్నె అంచుకి మధ్య అర ఇంచు కూడా లేదు. మహా అయితే అయిదో, ఆరో మిల్లీమీటర్లుంటుందంతే*. 
ఇంక ఆలస్యం చెయ్యదల్చుకోలేదు బృహస్పత్. ఈ పరిస్థితుల్లో విద్యుల్లత కోసం ఎదురు చూడటం అర్థం లేని పని.అతని మెదడు వేగంగా పని చేస్తుంది. అరక్షణంలో తను స్టౌ ని చేరుకోగలడు.
ఇప్పుడు వెళ్ళి స్టౌ ఆర్పినా జరిగే ఉపద్రవాన్ని అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే అది గ్యాస్  స్టౌ కాదు, మంట ఆర్పడానికి, ఎలక్ట్రిక్ స్టౌ. ఆపేసిన వెంటనే దాని వేడి తగ్గిపోదు. సరిగ్గా చెప్పాలంటే పొంగక ముందు ఆపేసినా ఆ వేడికి ఇంకా 1,2 నిమిషాలు ఉండి పొంగే ప్రమాదం కూడా ఉంది అప్పుడప్పుడు. 
ఇంకొక పరిష్కారం గిన్నెను స్టౌ పైనుండి తీసెయ్యడం. అది చాలా కష్టమైన పని ఎందుకంటే దగ్గర్లో ఆ వేడిగిన్నెను దించడానికి ఉపయోగపడే వస్తువులేం లేవు. 
_______________________________________
*మిల్లీమీటరు- ఇది దూరాన్ని కొలిచే చిన్న యూనిట్. మనకి కిలోమీటరు బానే తెల్సు కదా.ఒక సెంటిమీటరు కి 10 మిల్లీమీటర్లు. ఒక మీటరుకి 100 సెంటిమీటర్లు.ఒక కిలోమీటరుకి 1000 మీటర్లు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఒక మిల్లీమీటరు అంటే ఎంత తక్కువ దూరమో.

అధ్యాయం - 4
ఇంక క్షణం ఆలస్యమైనా, తర్వాత ఎవరు ఏమీ చెయ్యలేరు.
రేపటికి పెరుగు ఉండదు. సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక తన ప్రాణపదమైన పిల్లలు హార్లిక్స్ వేసుకొని తాగడానికి పాలు ఉండవు.వాళ్ళు పాలు తాగకపోతే తను ఎలాగైన తట్టుకోగలడు. కాని విద్యుల్లత తట్టుకోలేదు. 
ఆ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఈ పాటికి ఆ ఒత్తిడి తట్టుకోలేక పడిపోయేవారు. కాని అక్కడ ఉంది సంవత్సరానికి 20 production రిలీజ్‌లలో పాల్గొనే వ్యక్తి. ఎన్నో రిలీజ్‌లకి గంట ముందు కూడా ఒత్తిడిని తట్టుకొని ఇంకా ప్యాచ్ వర్క్‌లు, defect ఫిక్స్‌లు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. 
ఆ చివరి నిమిషంలో వచ్చింది మెరుపులాంటి ఆలోచన, ఇంక ఆలస్యం చెయ్యలేదు, క్షణంలో వెయ్యోవంతులో, తను నీళ్ళు తాగడానికి తీసిన వాటర్ బాటిల్ మూత తీసి, చేతిలో కొన్ని నీళ్ళు పట్టుకొని పొంగబోతున్న పాలపై చల్లాడు. 
స్స్..స్.. అంటూ పాలు కిందికి వెళ్లిపోయాయి. వెంటనే స్టౌ ఆపేసాడు. 

ఉపసంహారం:
సాయంత్రం 5 గం.
ఇంటి వెనక పెరట్లో 4 కుర్చీలు వేసి ఉన్నాయి.
స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయి, మల్లెపూవుల్లా మెరిసిపోతూ కూర్చున్నారు పిల్లలు దృశ్యకాంతి, ద్రవపుత్రి. వారి చేతుల్లో కప్స్ ఉన్నాయి. అందులో చక్కెర వేసి, హార్లిక్స్ కలిపిన పాలు రుచికరంగా ఉన్నాయి.
2 టీ కప్పుల్తో వచ్చి విద్యుల్లతకి ఒకటి ఇచ్చి , తనొకటి తీసుకొని కూర్చున్నాడు బృహస్పత్. 
వాళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం పడమటి దిక్కున సూర్యునిలా మెరుస్తుంది. 
ఆ రోజు పాలు తోడేసారని వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

Wednesday, September 11, 2013

కారులో షికారు -2

So అలా మాస్టర్స్ అయ్యేవరకి కార్ లేకుండా ఎలా గడిపామో ఇక్కడ చెప్పా కదా..చూస్తుండగానే MS అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్‌తో ఉంటూ ట్రైనింగ్ తీసుకొని,జాబ్స్ కి ట్రై చేస్తుండేదాన్ని. ఆ ట్రయల్స్ కథ ఇంకోసారి చెప్తా, ఇప్పుడు ఒన్లీ కార్ గురించి. ఇప్పుడు ఉండేది కాస్త పెద్ద సిటీ కాబట్టి, బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా లోకల్ ట్రైన్స్,బస్సులు ఉండేవి అందుకని ఎక్కువ ప్రాబ్లం ఏమి అవలేదు.
అలా జాబ్స్ ట్రై చేస్తూ ఏమైనా ఫోన్ ఇంటర్వ్యూ ఉంటే ఇంట్లోనుండే అటెండ్ అవుతూ, దగ్గర్లో ఏవైనా F2F(ఫేస్ to ఫేస్) ఉంటే వెళ్ళివచ్చేదాన్ని.
ఒకసారి 3-4 గంటల్లో ఉండే ఊరిలో ఇంటర్వ్యూ  సెట్ అయ్యింది. అప్పటికే దానికి ఫోన్ రౌండ్ clear అయింది కాబట్టి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువే ఉంది.అప్పటికి చాలా రోజుల నుండి జాబ్ కి ట్రై చేస్తున్నా దీనికి కాబట్టి వెళ్తే బావుంటదని అనుకున్నా.
అక్కడ మాకు తెల్సిన వాళ్ళు ఎవరూ లేరు తీస్కెళ్ళడానికి. ఇంక ఫ్రెండ్స్‌ని కనుక్కుంటూ ఉన్న ఎవరైనా తెల్సిన వాళ్ళు ఉన్నారేమో తీస్కెళ్లడానికి అని. ఆ టైమింగ్స్ కి, ఆ ప్లేస్ కి బస్సులో వెళ్ళడం కుదరదు. ఈలోపు మా ఫ్రెండ్ తన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అక్కడ, మనలాగే స్టుడెంట్, కావాలంటే తీసుకెళ్ళి, తీసుకొస్తాడు.కాని కార్ రెంట్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు కాకుండా, అతనికి కూడా కొంచెం మనీ ఇవ్వాలి అని చెప్తే, OK అనుకున్నా ఇంక. అదేంటి సాటి తెలుగువాడు అయ్యుండి, మనీ ఎందుకు తీసుకుంటున్నడు అంటే, పాపం అతను మరి తన చేసే జాబ్ off పెట్టి వస్తున్నాడు కదా అందుకని. ఇంక అతనితో మాట్లాడి ఎలాగోలా సెట్ చేసుకొని ఇంటర్వ్యూకెళ్ళొచ్చా. ఆ జాబ్ రాలేదనుకోండి అది వేరే విషయం. అప్పుడొచ్చింది నాకు చిరాకు, అసలు నాకు లైసెన్స్ ఉంటే ఇంత కష్టం అవకపోయేది కదా అని. పోని అప్పుడైనా తీసుకోవచ్చు కదా అంటే ఆ జాబ్ లేని టైంలో అది వెతుక్కొవడానికే సరిపోయెది, ఇంక అంత ఖర్చు పెట్టి క్లాసులకేం వెళ్తాం.
ఆ తర్వాత కొన్ని రోజులకి ఫస్ట్ జాబ్ వచ్చింది.  అక్కడికి వెళ్ళాక వెంటనే అయితే కార్ ఏం అవసరం పడలేదు. అది కూడా కాస్త చిన్న సిటీనే, ఇంటి దగ్గర నుండి ఆఫీస్ కి కరెక్ట్‌గా ఆఫీస్ టైంలో ఒక బస్ ఉండేది. అందులో వెళ్ళొచ్చేదాన్ని. ఆ ఆఫీస్ మొత్తం మీద బస్‌లో వచ్చేదాన్ని నేనొక్కదాన్నే.
ఆఫీస్ కి మార్నింగ్ 9 కి లాస్ట్ బస్ ఉండేది, అది మిస్ అయ్యామో మళ్ళి సాయంత్రం వరకు ఉండదు. మిస్ అయితే అంతే సంగతులు అన్నమాట. ఒక 2,3 సార్లు అలా మిస్ అయితే చచ్చినట్టు క్యాబ్ తీసుకొని వెళ్ళాల్సొచ్చింది మరి. ఎండా కాలం అయితే ఏం ప్రాబ్లం అనిపించకపోయేది కాని చలి కాలం మంచులో బస్ వచ్చేవరకు వేచి ఉండాలంటే మాత్రం కష్టం అయ్యేది,అది కూడా రోడ్ పైన్నే,జస్ట్ షెడ్ లాగా ఉండేది.బస్టాప్ ఏమీ ఉండదు. చాలమటుకు టైంకే వచ్చేది కాని, ఒక్కోసారి లేట్ అయ్యేది.
అప్పుడైతే గట్టిగా డిసైడ్ చేసుకున్నా ఇంక లైసెన్స్ తీసుకోవడమే నా తర్వాతి అర్జెంట్ పని అని.
అప్పుడింకా ఒక ఫ్యామిలీ తో paying guestగా ఉండేదాన్ని. ఫెండ్స్‌తో ఉన్నా బోర్ కొట్టకపోయేది. బయటికి వెళ్దాం అన్నా కొత్త ప్లేస్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. కార్ ఉన్నా నాది నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి ఉండేది. అప్పుడైతే కార్ లేకపోవడాన్ని బాగా మిస్ అయ్యా.
గంటకి 50 కాదు 60 $ అయినా సరే అని డ్రైవింగ్ వచ్చేవరకి క్లాస్సెస్ తీసుకొన్నా.ఇది వేరే రాష్ట్రం కాబట్టి మళ్ళీ learners తీసుకొని, క్లాస్సెస్ తీసుకొని ఫైనల్ గా లైసెన్స్ తీసుకున్నా. చిన్న చిన్న అవసరాలుంటే అప్పుడప్పుడు కార్ రెంట్ తీసుకొని నడిపేదాన్ని.


Google Image


ఈలోపు ఈ జాబ్ అయిపోయింది, మళ్ళీ కొత్త జాబ్స్ కి ట్రై చెయ్యడం స్టార్ట్ చేసా. ఈసారి మళ్ళీ ఇంటర్యూకి వెళ్ళాల్సొచ్చినప్పుడు ఫస్ట్ టైం కార్ తీసుకొని 3 గంటలు అటూ, 3 గంటలు ఇటూ డ్రైవ్ చేసినప్పుడు I was so excited.......
వెళ్లొచ్చాక ఆ రోజు నైట్ ఏదో సాధించానన్నంత ఫీల్ అయ్యా :( అప్పటికి మా ఫ్రెండ్స్ చాలా మందికి ఇంకా డ్రైవింగ్ రాదు మరి.
తర్వాత జాబ్ వచ్చాక ఇక్కదా ఆ మాత్రం బస్ కూడా లేదు. కొన్ని రోజులు colleague తో కార్‌లో వెళ్ళాక, కొంచెం కుదురుకున్నాక అప్పుడు నా సొంతగా, మొదటగా కారు కొన్నాను. నాకిష్టమైన కారు.
ఇప్పుడు ఝాం ఝాం అని హాయిగా నా కార్లో షికారు చేస్తున్నా రోజూ...

అసలు కొంటే కొసరు ఫ్రీ అన్నట్టు ఈ పోస్ట్ చదివినందుకు కొసరు
 Don't think about past which is lost
 Think about present which is pleasant
 Don't worry about future, which may be brighter

Tuesday, September 10, 2013

కారులో షికారు

నువ్వు రాకముందు నా చుట్టూ ఎంత ఒంటరితనం
నువ్వు లేకముందు ఏది ఇప్పుడున్న ఆనందం

ఎన్ని ఉదయాలు వేచాను నీకోసం
నువ్వొచ్చాకే కదా వచ్చింది వసంతం..
హహ బావుందా దేనికోసం అనుకుంటున్నారు ఇదంతా..చెప్తా.చెప్తా..

నేను US వచ్చి కాలేజ్ లో ఎలా జాయిన్ అయ్యనో ఇక్కడ చెప్పా కదా.అలా కాలేజ్ లో చేరడమూ, రూం అదీ సెట్ చేసుకొవడమూ, ఖాళీగా ఉన్నప్పుడు క్లాసులకి వెళ్ళిరావడమూ మిగతా టైం అంతా సినిమాలు చూస్తూ గడిపేయడం తో సరిపోయేది. మా ఇల్లు ఎదురుగా రోడ్, రోడ్డుకి అవతల మా కాలేజ్, కొంచెం దూరం లోgrocery షాప్ అంతే మాకు తెలిసింది అప్పుడు. ఎక్కడికి వెళ్ళాలన్నా,  బయట చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా నడుచుకుంటూ వెళ్ళడమే. కాలేజ్‌లో ఇండియన్స్ చాలా మంది ఉన్నా ఎవరి దగ్గరా కార్ ఉండేది కాదు. ఒకరి దగ్గరో ఇద్దరి దగ్గరో ఉండేది కాని వాళ్ళెవరు తెలీదు. ఇంట్లోకి కాస్త ఎక్కువ సామాను కావల్సి వస్తే రూంలో ఉన్న నలుగురం కలిసి వెళ్ళి మోసుకుంటూ తెచ్చుకునే వాళ్ళం.
ఎండా కాలం అయితే ఎక్కువ కష్టం అవకపోయేది కాని,చలికాలం లో ఐతే పూర్తిగా కవర్ చేసుకొని, చేతులకి గ్లవుస్ వేసుకొని 2 చేతుల్లో 2 క్యారీ బాగ్స్ పట్టుకొని వచ్చేవాళ్ళం.
కారు ఉన్నవాళ్ళకి కుదిరినప్పుడో, ఎవరైనా కార్ రెంట్ చేసినప్పుడో మాకు పండగ అన్నమాట. మేము 2 పక్క పక్క అపార్ట్‌మెంట్స్ లో అందరం అమ్మాయిలమే ఉండేవాళ్ళం. కార్ దొరకగానే ఒక్కో ఇంట్లోంచి ఒక్కరో ఇద్దరో కాస్త దూరంలో ఉన్న పెద్దది, అన్ని దొరికే షాప్ కి వెళ్ళి నెలకి సరిపడా,కార్ ట్రంక్‌లో పట్టనన్ని తెచ్చుకునేవాళ్ళం. ఆ తర్వాత కొన్ని రోజుల వరకి ఇంట్లో తినడానికి వెతుక్కోకుండా ఉండేది. అమ్మాయిలెవరికి కార్ రాదు కాబట్టి అక్కడ ఉన్నన్ని రోజులు ఈ బాధలు తప్పేవి కాదు.
మాస్టర్స్ లో ఉన్నన్ని రోజులు ఇండియన్ స్టోర్ అనేదే తెలీదు మాకు. ఒక చిన్న పాకిస్తాని స్టోర్ ఉండేది, పప్పులు అవీ కావాలంటే అక్కడ దొరికేవి, కాని ఇంకే దేశి కూరగాయలు ఏవి దొరికేవి కాదు.ఇప్పుడైతే వారానికి ఒకసారి ఇండియన్ స్టోర్ వెళ్ళకుండా  గడవనే గడవదు.
స్టూండెంట్స్ off campus జాబ్స్ చేసుకునే placesలో ఐతే రోజు ప్రయాణం చెయ్యాలి కాబట్టి కొందరికి అయినా కార్స్ ఉండేవి కాని, చెప్పాగా నేను ఉండేది చిన్న ఊరు కాబట్టి బయట జాబ్స్ ఎవరూ చేసేవాళ్ళు కాదు.
ఇంక మా కాలేజ్ నుండి లోకల్‌లో తిరగడానికి ఒక బస్ ఉండేది. కాని అది ఒకే రూట్‌లో తిరిగేది. ఆ రూట్లో మాకు కావల్సినవేవి ఉండేవి కాదు. సో దాని వల్ల ఏమి ఉపయోగం లేదు.

ఇప్పుడొక ప్రశ్న మీకు.
అమ్మాయిలకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది.
A. చదువు
B. ఫ్యామిలీ
C. ఉద్యోగం
పోనీ ఇంకోటి
అమ్మాయిలు ఏ పని చెయ్యకుండా అయినా ఉంటారు కాని ఇది లేకుండా ఉండలేరు. ఏంటది..
ఇంకేంటది షాపింగే కదా..మొదట్లో కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళకపోయేవాళ్ళం. తర్వాత్తర్వాత ఎవరైనా తీసుకెళ్తే షాపింగ్ కి వెళ్ళేవాళ్ళం.ఇంక మాక్కొంచెం అలవాటు అయ్యాక షాపింగ్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు కాబ్ లో వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కాబ్ కాస్ట్లీ కదా, కాని మాకొక కాబ్ డ్రైవర్ ఉండేవాడు, కార్లో ఎంత మంది ఎక్కినా ఎక్కించుకునేవాడు. ఒకే ట్రిప్‌లో అయిదుగురం, ఆరుగురం వెళ్ళేవాళ్లం, ఇండియాలో ఆటోలో వెళ్ళినట్టుగా ఒకరి మీద ఒకరం కూర్చుని.
అప్పటికి మాలో అంతా కొత్తవాళ్ళు కాబట్టి ముగ్గురు కన్నా ఎక్కువ మంది కార్‌లో కూర్చోకూడదు,కాప్ చూస్తే ప్రాబ్లం అవుతుంది అని కూడా తెలీదు. ( ఆ తర్వాత మాస్టర్స్ అయిపోయాక ఒకసారి తప్పక కార్‌లో వెనకాల నలుగురం కూర్చుంటే కాప్ ఆపి టికెట్ వేసాడు).
ఆ డ్రైవరే ok చెప్తే మాకేం తెలుస్తది ఇంక. మాల్ మాకు ఎక్కువ దూరం కాదు కాబట్టి ఒక 20-25$ అయ్యేది అంటే మనిషికి 3,4 $ అన్న మాట. ఇదేదొ బావుందని ఎప్పుడూ అలానే వెళ్ళేవాళ్లం.
తర్వాత ఇంకా మాస్టర్స్ అయ్యేలోపు ఎలాగైనా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందాం అని అనుకున్నాం. దాని కోసం మొదట Learners టెస్ట్ రాసి, అది పాసయ్యక రోడ్ టెస్ట్ ఇవ్వాలి. ఎలాగొలా Learners అయితే తీసుకున్నాను. తర్వాత డ్రైవింగ్ నేర్చుకోవడానికి గంటకు 40-45$ ఖర్చు పెట్టి నేర్చుకోవాలి. అప్పట్లో అది పెద్ద మొత్తం కదా, అప్పటికి కొన్ని క్లాస్సెస్ తీసుకున్నాను కాని లైసెన్స్ అయితే తీసుకోలేదు. మా ఊరిలో లైసెన్స్ ఇవ్వలంటే ఎవరిదన్న సొంత కార్ ఉండాలి, ఆ టైంలో ఇంక లైసెన్స్ తీసుకోవడం అయితే కుదర్లేదు.
ఇంక మాస్టర్స్ అయిపోయేవరకి కార్ నేర్చుకోకుండా, బయటి ప్రపంచం తెలీకుండా బతికేసాం. మాస్టర్స్ అయిపోయి బయటికి వచ్చాక కాని అర్థం కాలేదు, లైసెన్స్ లేకుండా ఎంత కష్టమో. దాని వల్ల ఎన్ని కష్టాలు పడాల్సొచ్చిందో రేపు చెప్తా.

 

Monday, September 9, 2013

తలుచుకో.. మనసులో తలుచుకో..

కార్టూన్ సినిమాలు..బొమ్మల పుస్తకాలు..
బర్త్‌డే పార్టీలూ..సర్కస్‌లో జోకర్‌లూ
కొమ్మపై కోతులూ..గోడపై ఉడుతలూ..
తలుచుకో మనసులో తలుచుకో
బెంగ కలిగినా భయం వేసినా మనసులో తలుచుకో
తలుచుకొనీ కన్నీళ్ళనే  మరచిపో..

చందమామ కిందిపక్కలూ.. లెక్కపెట్టలేని చుక్కలూ..
ఐస్ క్రీం కోనులు.. ఐసింగ్ కేకులూ..
పండగ ముందు రోజు..పరీక్ష తర్వాతి రోజు
తలుచుకో మనసులో తలుచుకో
ఆకలేసినా జ్వరం వచ్చినా మనసులో తలుచుకో
తలుచుకొనీ కన్నీళ్ళనే మరచిపో.....

ఈ మధ్య టైంపాస్ కి ఎప్పుడో జెమినిలో వచ్చిన "నాన్న" సీరియల్ అన్ని ఎపిసోడ్స్ యూ ట్యూబ్‌లో దొరికితే చుస్తున్నా. అందులో చిన్న పిల్లవాడు నాన్న కోసం వెతుకుతూ ఉంటాడు.
వాడికి బాధ కలిగినప్పుడల్లా ఈ పాట పాడుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లలకోసం ఈ పాట బావుంది కదా.చిన్న చిన్న పదాలతోనే ఎంత సున్నితంగా చెప్పారో..వాడు పాడుతుంటే ఇంకా బావుంది. కాని ఎప్పుడూ చాలా బాధలో ఉన్నప్పుడు మాత్రమే పాడుకుంటూ ఉంటాడు అదే బాలేదు..

Friday, September 6, 2013

చిన్న ర్యాగింగ్ - కొన్ని నవ్వులు

ఎప్పుడు తలచుకున్నా పెదవుల పైన చిరునవ్వులు పూయించే చిన్న చిన్న సంఘటనలు కొన్ని ఉంటాయి. అలాగే ఆ సంఘటనకి కారణమైన వాళ్ళని ఆట పట్టించడానికి అవి ఎప్పుడు సహాయపడతాయి.
అప్పుడు మేము ఇంజనీరింగ్‌లో చేరిన మొదటి రోజులు. కాలేజ్ పక్కనే క్యాంపస్ హాస్టల్ ఉందని ఏరి కోరి చేర్పించారు నన్ను అక్కడ. కాలేజ్ హాస్టల్ కావడం వల్ల ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఉండేవాళ్ళు. అన్ని కాలేజ్‌లోలాగే మా దగ్గర్ కూడా కొంచెం ర్యాగింగ్ ఉండేది. ఒక్కో ఇయర్ స్టుండెంట్స్ ఒక్కో ఫ్లోర్‌లో ఉండేవాళ్ళు. ఇంక హాస్టల్ లో కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉండేవి. సీనియర్స్ ఎక్కడ కనిపించినా గుడ్ మార్నింగ్,గుడ్ ఈవినింగ్  అని    విష్ చెయ్యడం అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది. విష్ చెయ్యకపోతే respect ఇవ్వనట్టన్నమాట. మెస్ లో వాళ్ళ టేబుల్స్ పైన కూర్చోకూడదు, పెట్టుకునే అప్పుడు వాళ్ళొస్తే వాళ్ళు పెట్టుకునేందుకు జరిగి చోటివ్వాలి, అక్కడ ఉన్న  డొక్కు T.V రిమోట్ సీనియర్స్ ఎవరూ లేనప్పుడు మాత్రమే మేము తీసుకోవచ్చు ఇలాంటి undefined రూల్స్ చాలానే ఉండేవి.
అలా ఆ రూల్స్ లో మాకు గుర్తున్నవి పాటిస్తూ,కొన్ని గుర్తు లేనట్టు నటిస్తూ, ఎక్కువగా మా ఫ్లోర్ నుండి బయటికి వెళ్ళకుండా గడుపుతూ ఉండగా, సడెన్‌గా ఒకరోజు "మీ జూనియర్స్ డిసిప్లిన్  తప్పుతున్నారు, వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ పైనే ఉందని మర్చిపోయారా" అని మా సెకండ్ ఇయర్ వాళ్ళ అందరికి మూకుమ్మడిగా కలొచ్చినట్టుంది.
ఇంకేముంది ఒక రోజు రాత్రి డిన్నర్ చేసాక వాళ్ళ ఫ్లోర్ కి రమ్మని మా అందరికి పిలుపొచ్చింది. మేం 20-23 మందిమి ఉండేవాళ్ళం.మేం వెళ్ళే సరికి వాళ్ళందరు కుర్చోవడానికి సెట్ చేసుకొని మమ్మల్ని అలా నిల్చోపెట్టి ఇంక స్టార్ట్  చేసారు. మాకు సరిగ్గా respect ఇవ్వట్లేదు, కనిపిస్తే విష్ చెయ్యట్లేదు. పొగరు పెరిగింది, మొన్న మెస్‌లో ఇలా చేసారు అలా చేసారు అని చేసినవీ, చెయ్యనివీ కలిపి చెప్పి ఓ గంట క్లాస్ తీసుకొని మా కళ్ళు తెరిపించారు. తర్వాత ఒక్కొక్కరిని పట్టుకొని ఇంటర్యూ   ఇంటర్వ్యూ చెయ్యడం మొదలుపెట్టారు.అందరికీ ఒకటే ప్రశ్న. అదే సింపుల్ అండ్ కాంప్లికేటెడ్ question, ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళినా సమాధానం  చెప్పక తప్పని ప్రశ్న  మన గురించి మనం చెప్పుకోవాలట. ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నారు. చెప్తుంటే మధ్యలో ఆపి తప్పులు తీసి ఎదో ఒకటి అని మళ్ళీ  మొదటి నుండి చెప్పిస్తున్నారు.
మొత్తం తెలుగులోనే చెప్పాలి, మధ్యలో ఒక్క ఇంగ్లీష్ పదం వచ్చినా మళ్ళీ మొదటి నుండి చెప్పాలి.
నా పేరు గీత..
మా నాన్న పేరు రంగా రావు.
ఆగు మీ నాన్న పేరుని  అలాగేనా చెప్పేది   గౌరవం లేకుండా, మళ్ళీ చెప్పు
నా పేరు గీత..
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ పేరు జానకి.
అంటే నాన్నకి గౌరవం ఇస్తావు కాని అమ్మ కి ఇవ్వవాడా, మళ్ళీ చెప్పు
నా పేరు గీత..
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.

ఇలా చెప్తున్నారు ఒక్కొక్కరు.
అప్పటికే మేం వచ్చి 3,4 గంటలు అయ్యింది,వాళ్ళు అనే మాటలకి, ఆ సీరియస్ మొహాలని చూసి మాలో సగం మంది ఏడుస్తున్నారు. ఇంకా రాత్రి చాలా లేట్ అవడం,ఏడ్చిన్న వాళ్ళని చూసి పాపం  అనిపించిందో అప్పటికే చెప్పిన వాళ్లని వెళ్ళిపొమ్మన్నారు. తర్వాత ఒక్కొక్కరితో చెప్పించేసి పంపిస్తున్నారు.ఇంకా లాస్ట్‌లో  నేను, అమ్ము మిగిలాం.  నాది కూడా చెప్పడం అయిపోయింది. నన్ను కూడా పంపించేస్తే తనొక్కతే ఉండాలి అని టెన్షన్ పడుతూ బిక్క మొహం వేసుకొని నిల్చుంది తను.ఇంకాసేపుంటే ఏడుపు తన్నుకొని బయటికి వచ్చేలాగ ఉంది తన ఫేస్.
మనసులో తర్వాత తను ఎలా చెప్పాలో రిపీట్ చేసుకుంటూ ఉంది.
నా పేరు అమల
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.
నా పేరు అమల.
....
....
తనది కూడా అయిపోయాక ఇద్దరు కలిసి వెళ్దురు కాని అని నన్ను ఉండమన్నారు అక్కడే.
నెక్స్ట్ అమల..చెప్పు
నా పేరు అమల గారు 
మా నాన్న రంగా రావు గారు .
ఏంటి మళ్ళీ చెప్పు
నా పేరు అమల గారు 
మళ్ళీ ...
నా పేరు అమల గారు 
అప్పటి దాకా సీరియస్ గా ఉన్న వాళ్ళు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాక కాని అర్థం కాలేదు తనకి ఏం చెప్పిందో..
Google Image

నాకు లోపలి నుండి నవ్వొస్తుంది, ఇప్పుడు నవ్వితే మళ్ళీ ఇంకో అరగంట క్లాస్ పడుతుందని   అలానే బిగపట్టుకొని నిల్చున్న. తర్వాత ఏదో కానిచ్చేసి వచ్చెసాం.
ఆ సీన్‌లో తన టెన్షన్ మొహం, సిన్సియర్‌గా తన పేరు వెనక గారు అని అన్ని సార్లు చెప్పడం కొన్ని రోజుల వరకి తనని ఏడిపించడానికి మంచి టాపిక్ మాకు.
ఆ తర్వాత ఎప్పుడు తను కనిపించినా అమల అని ఎవరు పిలవలేదు , అప్పటినుండి తనపేరు ఇంక అమల గారు.
తర్వాత తర్వాత  ఆ సీనియర్సే మాకు మంచి  ఫ్రెండ్స్ అయ్యారు, తనని అమల గారు అని పిలవడం మాత్రం మానలేదు ఎవ్వరు.   

Wednesday, September 4, 2013

ఊ.. కొడతారా

సరే అప్పటినుండి అడుగుతున్నావు కాబట్టి ఒక్క కథ చెప్తాను, అదయ్యేలోపు నిద్రపోవాలి.
సరే..
Google Image

కాని నేను చెప్తుంటే ఊ.. అనాలి అప్పుడే చెప్తాను, ఊ.. అనడం ఆపేస్తే చెప్పను మరి..
అలాగే.
అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కి ఒక రాణి ఉంటుంది.
ఊ..
ఒక రోజు రాజు బయటికి వెళ్తాడు.
ఊ..
రాణి కి ఇంట్లో ఉండి ఏమి చెయ్యాలో తోచక, ఏదైనా కుట్టుకుందామని ఒక చీర, సూది దారం తీసుకొని.. అదిగో ఊ.. అనట్లేదు
ఊ..ఊ..
అలా తోటలోకి వెళ్ళి కూర్చుంటుంది.అక్కడ కూర్చుని కుట్టుకుంటూ ఉంటే..
ఊ..
కొంచెం గట్టిగా గాలి వచ్చి సూది ఎగిరి పక్కనే ఉన్న బావిలో పడుతుంది.
ఊ..
ఇప్పుడు రాణికేమో ఆ సూది కావాలి. అది ఎలా వస్తుంది
ఊ..
ఎలా వస్తుంది చెప్పు
ఊ..
ఊ.. అంటే వస్తుందా..
ఏమో, తెలీదు
ఏమో, తెలీదు అంటే వస్తుందా..
నువ్వే చెప్పు
నువ్వే చెప్పు అంటే వస్తుందా..
అబ్బా..
అబ్బా..అంటే వస్తుందా..
పో.. నాకీ కథ వద్దు 
పో.. నాకీ కథ వద్దు అంటే వస్తుందా..
ఇంకోటి చెప్పు
ఇంకోటి చెప్పు అంటే వస్తుందా..
.................
అలా ఏమి మాట్లాడకుంటే వస్తుందా..

చిన్నప్పుడు నన్ను ఎవరు చెప్పమన్నా ఇది నా స్టాండర్డ్ కథ. రోజు ఒకే కథ ఎలా చెప్తా అనా..
నేను మొదలుపెట్టగానే రాణి- సూది కథ వద్దు అనే వాళ్ళు. అప్పుడు రాణి ప్లేస్ లో ఒక ఇంట్లో ఒక అమ్మాయి  ఉండేది అనో, లేకపొతే ఒక బట్టలు కుట్టుకునే వాడో వచ్చేవాళ్ళు.
 మిమ్మల్ని కూడా ఎవరన్నా కథ చెప్పమంటే ఆలోచించుకోకండి, ఇప్పటి నుండి ఈ కథ గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది :)