Thursday, June 21, 2018

మాల్దీవ్స్ - 2

ఆ బంగ్లా లో ఒక రూమ్ నుండి బయటికి బాల్కనీ, అందులోంచి నీళ్ళలోకి మెట్లు ఉన్నాయి. ఇంకా నీళ్లు ఎంత క్లియర్ గా ఉన్నాయంటే, పైనుండి చూస్తుంటే కింద భూమి అడుగు, ఇంకా చాలా చాలా చేపలు తిరుగుతూ కనిపిస్తున్నాయి.గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ఐలాండ్స్ అన్ని ఒకప్పటికి కనిపించకుండా పోయే ముప్పు ఉందట. అందుకేనేమో కొన్ని చోట్ల వారి పర్యావరణ స్పృహ కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ చెత్తబుట్టలు కానీ కనిపించలేదు. అన్ని మట్టితో చేసినవే ఉన్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లేముందు బయట కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఒక మట్టికుండ లో నీళ్లు, ఒక కొబ్బరి చిప్పని కర్ర కి కట్టి కుండలో ముంచుకొని పోసుకోవడానికి పెట్టారు :).
లంచ్ టైం అవడంతో ఫ్రెష్ అప్ అయి డైనింగ్ ఏరియా కి వెళ్ళాం. ఇది కూడా ఇసుక లోనే టేబుల్స్, చైర్స్ వేసి పైన గుడిసె లాగా కప్పేశారు. చుట్టూ ఫ్యాన్స్ పెట్టారు. అయినా ఆ వేడి ని తట్టుకోవడం కష్టమే అనిపించింది. భోజనం మాత్రం ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ ఒకటేమిటి అన్ని రకాలు ఉన్నాయి, అన్నీ బావున్నాయి కూడా.

సాయంత్రం వరకు బీచ్ పక్కన గడిపేసి, చీకటి పడే సమయానికి sunset cruise బుక్ చేసాం. ఒక 50, 60 మందివరకు ఉన్నారు. సాయంత్రం నుండి సూర్యాస్తమయం అయేవరకు అలా సముద్రం  లోపలికి తీసుకెళ్లారు. చాలా whales నీళ్ల లోంచి పైకి లేచి దూకుతూ పలకరించాయి. ఆలా whale watching  కూడా అయిపోయింది. చీకటి పడుతుండగానే వచ్చి ఫుడ్ కోర్ట్ లో భోజనం చేసి త్వరగా పడుకున్నాం. jetlag వల్ల మర్నాడు ఉదయం  త్వరగా 6 అవకముందే  మెలకువ వచ్చింది. బాల్కనీ లోంచి చూస్తే అప్పటికే సూర్యుడు నీళ్ల లోంచి పైకొస్తూ కనిపించాడు. కాసేపు అక్కడే కూర్చుని సూర్యోదయాన్ని ఆస్వాదించి బయటికి వచ్చాము. వచ్చిన దగ్గర్నుండి డే టైం లో ఎంత వేడి గా ఉందో చూస్తే,అప్పటికే బాగా వెలుతురు వచ్చేసింది కాబట్టి  ఇప్పుడే మంచి టైం ఐలాండ్ అంతా తిరిగి రావడానికి అనిపించింది.
బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ముందే బుక్ చేసుకున్న స్పా కి వెళ్ళాం. దాన్ని మొత్తం నీళ్ల పెయిన్ కట్టి,  స్పా రూమ్ లో మాత్రం కింద గ్లాస్ వేశారు. బోర్లా పడుకొని కింద నీళ్లలో తిరుగుతున్న రకరకాల చేపలు చూస్తూ అసలు టైం ఎలా గడిచిందో తెలియలేదు.

మధ్యాహ్నం snorkeling కి టూర్ కి బుక్ చేసుకున్నాం. అక్కడే snorkel సెట్ రెంట్ కి తీసుకొని వాళ్ళు చెప్పిన చోటికి వెళ్లాం. ఒక చిన్న షిప్ లో మమ్మల్ని సముద్రం పైన కొంత దూరం  తీసుకెళ్లి ఆపారు. ఎవరి కిట్ వాళ్ళు తీసుకొని ఈత కొడుతూ వెళ్లిపోయారు. పాపం ఒకే ఒక అమ్మాయి నీళ్లలోకి వెళ్లకుండా అక్కడే  ఉండి పోయింది స్విమ్మింగ్ రాదని.ఇంకెవరు నేనే. అప్పటికీ మెల్లగా దిగి, షిప్ కి ఉన్న రాడ్స్ పట్టుకొని కొంచెం సేపు అక్కడక్కడే ట్రై చేశాను. ప్రతి ఒక్కరూ రావడం , చాలాబావుంది అంటూ చెప్పడమే. ఎప్పుడూ స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ లేని నేను తిరిగి రాగానే క్లాసెస్ జాయిన్ అయ్యాను. ఎప్పటికైనా కొంచెమైనా స్విమ్మింగ్ నేర్చుకొని మళ్ళీ మాల్దీవ్స్ వెళ్ళాలి అని. తర్వాతి రోజు మధ్యాహ్నం హైదరాబాద్ కి ఫ్లైట్. ఆరోజు రిటర్న్ ఫ్లైట్ ఉన్నవాళ్ళందర్నీ షెడ్యూల్ ని బట్టి ఉదయమే షిప్ లో మెయిన్ ల్యాండ్ కి తీసుకొచ్చి దింపారు. అక్కడినుండి కొచ్చిన్ లో ఫ్లైట్ మారి రాత్రి కల్లా హైదరాబాద్ చేరుకున్నాం.