Tuesday, June 13, 2017

మాల్దీవ్స్ - 1

Heaven on earth - నిజంగా ఈ మాట సరిపోతుంది ఆ ప్లేస్ కి అనిపించింది మాల్దీవ్స్ లో ఉన్నప్పుడు. ఆ ప్లేస్ లో ఉన్న జ్ఞాపకాల వల్ల కాకుండా, చూడగానే ఒక ప్లేస్ తో ప్రేమలో పడటం అంటే ఏంటో తెలిసింది.
మొన్న ఏప్రిల్‌లో ఇండియా వెళదాం అని ప్లన్ చేసినప్పుడు,ఒక 2,3 రోజులు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. కొన్ని ఆప్షన్స్ చూసుకున్నాక మా ఇద్దరి ఓటు మాల్దీవ్స్ కే వేసాం. న్యూయార్క్ నుండి డైరెక్ట్ హైదరాబాద్ ఫ్లైట్ కాకుండా, న్యూయార్క్ టు మాల్దీవ్స్ , అక్కడ నుండి హైదరాబాద్ కి బుక్ చేసాం.
దిగేసరికి ఉదయం 9 అవుతుంది, అప్పటికే అక్కడ ఎంత వేడిగా ఉందంటే AC నుంది బయటికి వచ్చాక ఒక్క నిమిషం కూడా ఫ్యాన్ కింద ఉండలేకపోయాం.ఆ ఎయిర్‌పోర్ట్ కొంచెం పాత పాతగా, చాలా చిన్నగా ఒక బస్టాండ్ అంత ఉంది. మాల్దీవ్స్  కి వెళ్ళడానికి ప్రపంచంలో ఏ దేశం వాళ్లకైనా వీసా అవసరం లేదు, పాస్‌పోర్ట్ ఉంటే చాలు. అక్కడ ఇమిగ్రేషన్‌లో on arrival వీసా ఇస్తారు visitorsకి. బయటి దేశాల నుండి ఆల్కహాల్ అనుమతించరు. ఒకవేళ visitors ఎవరన్నా తెలియక తమతో తీసుకొస్తే, పాస్‌పోర్ట్ చూపించి అక్కడ కస్టంస్ ఆఫీస్‌లో వదిలి, తిరిగి వెళ్ళే అప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. మాల్దీవ్స్ కొన్ని వందల చిన్న చిన్న ఐలాండ్స్ సముదాయం. కాని అందులో కొన్ని మాత్రమే మనుషులు ఉందటానికి వీలైనవి. ఎయిర్‌పోర్ట్ కూడా ఒక చిన్న దీవి పైనే ఉంది, అందుకే విమానం దిగే అప్పుడు నీళ్లలొనే దిగుతున్నామా అనిపించే అంత దగ్గరగా ఉంది రన్‌వే.
Airport

ఒక్కొక్క ఐలాండ్ మొత్తం ఒక రిసార్ట్. మేము బుక్ చేసిన రిసార్ట్ వాళ్ళు ఎయిర్‌పోర్ట్ బయటికి వచ్చి ఒక కౌంటర్ నంబర్ దగ్గరికి వెళ్లమన్నారు. బయటికి రాగానే వరుసగా ఒక 40,50 చిన్న చిన్న కౌంటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిపైన అది ఏ రిసార్ట్‌కి సంభందించినదో రాసి ఉంది. మేము మాకు చెప్పిన కౌంటర్ దగ్గరికి వెళ్లి మా వివరాలు ఇస్తే, అతను వెరిఫై చేసుకొని, ఇంకా వచ్చేవాళ్లు ఉన్నారు అని చెప్పి వెయిట్ చెయ్యమన్నాడు.అలా కాసేపు వెయిట్ చేసాక, అందరు వచ్చేసారని మమ్మల్నందర్ని బోట్ దగ్గరికి తీసుకెళ్ళాడు.ఎయిర్‌పోర్ట్ నుండి బయటికొచ్చి రోడ్ దాటగానే సముద్రం. అది కూడా చాలా క్లియర్ బ్లూ వాటర్. మొత్తం ఒక 20 మంది వరకు ఉన్నాము.  
అక్కడి నుండి ఆ బోట్‌లో 45 నిమిషాలు ప్రయాణం చేసి మా రిసార్ట్ ఐలాండ్‌కి చేరుకున్నాం.ఆ దారంతా చుట్టూ ఎటు చూసినా బ్లూ వాటర్, మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్..అద్భుతం తప్ప ఇంకో మాట లేదు వర్ణించడానికి.
అక్కడ ఒడ్డున దిగి లోపలికి నడుస్తుండగానే, పనిచేసే స్టాఫ్ అంతా డ్రంస్, చిన్న music instruments వాయిస్తూ, సంగీతం తో స్వాగతం చెప్పారు.రెసెప్షన్ హాల్లో రెస్టారెంట్‌లాగా చాలా కుర్చీలు వేసి ఉన్నాయి. వచ్చిన వాళ్లందర్నీ అక్కడ కూర్చోమని, ఆ వేడిలో చల్ల చల్లగా జ్యూస్ ఇచ్చారు. హాల్లో కింద ఫ్లోరింగ్ లేదు, ఇసుక పైన అలాగే చుట్టూ గోడలు కట్టేసారు. చెప్పులు తీసేసి హాయిగా ఆ మెత్తటి ఇసుక పైన కాళ్లు పెట్టి, చల్లటి డ్రింక్ తాగుతుంటే దాదాపు 24 గంటలు ప్రయాణం చేసిన అలసట పోయినట్టనిపించింది.
ఈలోపు వాళ్లొచ్చి రూం కీస్, ఐలాండ్ మ్యాప్ అక్కడ ఉన్న వసతుల గురించి చెప్పారు. తర్వాత చిన్న మోటార్ వెహికిల్‌లో ఎవరి రూం దగ్గర వాళ్లని దింపేసారు. ఆ ఐలాండ్ ఎంత చిన్నదంటే చుట్టూ నడుస్తూ తిరిగిరావడానికి గంట కన్నా ఎక్కువ పట్టదు. అందులోనే ఫుడ్ కోర్ట్‌లు, రెస్టారెంట్స్ అక్కడక్కడ చిన్న బార్స్, స్పా అన్ని ఉన్నాయి.
మమ్మల్ని బీచ్ ఒడ్డున దింపి, నీళ్లలోకి కట్టిన చెక్క వంతెన వైపు చూపించాడు, అటువైపు మా రూం అని.

ఇందులోనే మేము తీసుకున్న overwater bungalow. ఇంత అందమైన ప్రదేశం గురించి రాయాలంటే నాకు ఇంకో పోస్ట్ కావల్సిందే  మరి..

Friday, February 3, 2017

కోర్ట్‌కెందుకెళ్లాల్సి వచ్చిందంటే.. 1

నాకు ఫైన్ ఎలా పడిందో మొన్న చెప్పా కదా..ఎప్పుడైనా కాప్ ఫైన్ ఇచ్చాక దాని పైన ఫైన్ కట్టాలనుకుంటే ఎలా కట్టొచ్చు, ఒకవేళ అది పే చెయ్యడానికి మనం ఒప్పుకోకపోతే ఆ విషయం తెలియజెయ్యడానికి వివరాలు ఉంటాయి.  ఫైన్ కట్టము అనుకుంటే కోర్ట్ కి రమ్మని ఒక డేట్ ఇస్తారు, ఆరోజు వెలితే వాళ్ల నిర్ణయం చెప్తారు, మొత్తం ఫైన్ కట్టాలా లేక ఏమన్నా తగ్గిస్తారా అన్నది.
సరే నేను కోర్ట్‌కి రావాలనుకుంటున్నాను అని టిక్ చేసాను ఆ వెబ్‌సైట్ లో.
ఒక 2 వారాలకి, ఫలానా రోజు కోర్ట్‌కి రమ్మని మెయిల్ వచ్చింది.
ఆరోజు కోర్ట్ కి వెళ్లాల్సింది మధ్యాహ్నం టైం కాబట్టి, ప్రొద్దున ఇంట్లోంచి పని చేసి, మధ్యాహ్నం లీవ్ పెట్టా, అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా.ఒక్కదాన్నే వెళ్తున్నా కదా అని ఇచ్చిన టైం కన్నా కొంచెం ముందు వెళ్లా, అక్కడ ఎలా ఉంటదో, కరెక్ట్‌గా ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొవడానికి టైం పడుతుందేమో అని. లోపలికి వెళ్లగానే రెసెప్షన్ ప్లేస్ లో బోర్డ్ పెట్టి ఉంది. ఆరోజు ఎవరెవరికి టైం ఇచ్చారు, ఏ టైం కి అని. నా పేరు అందులో ఉంది అని చూసుకొని అక్కడ ఉన్న అతన్ని అడిగా ఎటు వైపు వెళ్లాలి, వెళ్లాక ఏం చేయాలి, ఇలా ఈ టైం కి నాకు హియరింగ్ ఉంది అని. అతను ఎటువైపు వెళ్లాలో చూపించి, లోపల కోర్ట్ హాల్లో వెళ్లి కూర్చుంటే టైం ప్రకారం నా పేరు పిలుస్తారు అని చెప్పాడు. కోర్ట్ హాల్లో చిన్న స్టేజ్ లాంటి పైన్ జడ్జ్ కూర్చున్నాడు. అతని పక్కనే ఏవో పేపర్స్ చూపిస్తూ ఒకామె  ఉంది అసిస్టంట్ లాగ.
స్టేజ్ కింద హాల్ కి అటు పక్క ఇటు పక్క ఒక్కో టేబుల్, దాని దగ్గర ఒకరు కూర్చుని ఉన్నారు.
మిగతా హాల్ అంతా ఒకదాని వెనక ఒకటి బెంచ్ లాగా సీట్స్ ఉన్నాయి.
అమ్మో...ఇప్పుడు నా పేరు పిలిచి అక్కడ నిల్చోబెట్టి, ఏం చేసాను, ఎందుకు not guilty అని అప్లై చేసాను అని అందరి ముందు చెప్పమంటారేమో...ఏం చెప్పాలి..ఎలా చెప్పాలి బాబోయ్..అనుకుంటూ వెళ్లి ఒక బెంచ్ లో కూర్చున్నా. ఎక్కువ జనం ఏం లేరు. ఒక 15, 20 మంది ఉన్నారేమో. ఈ లోపు ఆ సైడ్ టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్లు ఒక్కొక్క పేరు పిలుస్తున్నారు.తమ పేరు పిలిచిన వాళ్లు వెళ్లి అక్కడ నిల్చుని వాళ్లతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. so మొత్తానికి అందరికి వినబడేలాగా మాట్లాడే పని లేదన్నమాట. అక్కడే సగం టెన్షన్ పోయింది నాకు. పోన్లే మనం ఏం మాట్లాడినా ఎవరికి తెలియదు :). ఇలా అలోచిస్తుండగానే నా పేరు పిలిచాడు ఒక సైడ్ టేబుల్ అతను.
అతని దగ్గరికి వెళ్లగానే నా కేస్ పేపర్స్ తీసి చదివి, సో నువ్వు ట్రైన్ ఆగినప్పుడు వెనకనుండి ట్రాక్స్ దాటావన్న మాట, అలా చెయ్యడం చాలా డేంజర్ కదా, ఇంకోసారి అలా చెయ్యకు, నీ ఫైన్ క్యాన్సల్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ పేపర్ లో అది రాసుకొని, నువ్వెళ్లొచ్చు అన్నాడు.సరే ఇంకెప్పుడు అలా చెయ్యను అని చెప్పి,  అంతే అయిపోయిందా..అనుకొని బయటికి వచ్చేసా. నిజంగానే మళ్లీ అలా ఎప్పుడూ దాటలేదు కూడా..

Wednesday, February 1, 2017

కోర్ట్‌కెందుకెళ్లాల్సి వచ్చిందంటే..

Google Image

నేను రోజు ట్రైన్‌లో వెళ్తాను కదా న్యూయార్క్ లో ఉన్నమా ఆఫీస్ కి, ట్రైన్ ఎక్కాలంటే ఇంటి దగ్గర నుండి ఒక 10 నిమిషాలు నడవాలి స్టేషన్‌కి. మా ఇంటి దగ్గరిది చాలా చిన్న స్టేషన్, అంటే ఒకటే ప్లాట్‌ఫాం. అది కూడా మొత్తం ట్రైన్ పొడవు కన్నా చిన్నగా ఉంటది.నేను ట్రైన్ ఎక్కాలంటే రోడ్ దాటి అవతలి పక్క ఉన్న ప్లాట్‌ఫాం కి వెళ్ళి ఎక్కాలి. ట్రైన్ వచ్చే ముందు రోడ్ మీద ఉన్న గేట్ పడిపోతుంది. గేట్ పడ్డాక కార్స్ మాత్రమే కాకుండా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా ఆగిపోవాలి. నేను రోజు టైం చూసుకొని హడావిడి పడుతూ ఐనా సరే ఒక్క నిమిషం అన్నా గేట్ పడేముందు అక్కడికి చేరుకుంటా. అప్పుడప్పుడు కొందరు గేట్ పడ్డాక ట్రైన్ ముందు నుండి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు.
ఇలాగే ఒకరోజు నాకుకొంచెం లేట్ అయింది. అప్పటికీ 10 నిమిషాల నడకే అయినా మా ఆయన డ్రాప్ చేస్తా అని వచ్చాడు. కాని కరెక్ట్‌గా అక్కడికి చేరుకునే సరికే గేట్ పడుతూ ఉంది. ట్రైన్ వచ్చింది. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే అయితే మళ్ళీ ఇంకో 40 నిమిషాల వరకు ఇక్కడ నుండి ట్రైన్ ఉండదు కాబట్టి దగ్గర్లో ఉన్న ఇంకో స్టేషన్ కి వెళ్ళి వెరే ట్రైన్ తీసుకున్నాను, కాని అక్కడికి డ్రాప్ చేసి రావడం తనకి లేట్ అయిపొతుంది.
ఈలోపు ఒకతను ఆగి ఉన్న ట్రైన్ వెనక నుండి గేట్ దాటి ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాడు, సరే నేను కూడా అలానే చేద్దాం, మళ్ళీ ఇది మిస్ ఐతే లేట్ అవుతది అనుకున్నా. మా ఆయన కూడా రోజూ చూస్తూనే ఉంటా, ఎవరో ఒకరు అలా క్రాస్ చేస్తారు అని ఎంకరేజ్ చేసే సరికి ఆ దాటుతున్న ఇంకొకతనితో పాటు నేను కూడా వెళ్లిపోయా. సరిగ్గా గేట్ క్రాస్ చేసి అటు వెళ్లే సరికి ఒక కాప్ నిల్చున్నాడు.
మా ఇద్దరి దగ్గరికి వచ్చి, ఈ ట్రైన్ మీరు అందుకోలేరు, ఆగండి అని ఆపేసి, మా ID కార్డ్స్ అడిగాడు. ID అంటే ఏముంది నా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసా. అతను అవి తీసుకొని, మాతో అలా గేట్ పడ్డాక దాటటం డేంజర్ కదా అని, మా ఇద్దరి  కార్డ్స్ తీసుకొని కార్లోకి వెళ్లి చెక్ చేస్తున్నాడు. చేస్తున్నాడు చేస్తున్నాడు..ఎంతకీ రాడు.
ఈలోపు అతను నేను మాటలు కలిపాం.నేను చెప్పా..ఈరోజే ఫస్ట్ టైం ఇలా గేట్ పడ్డాక ట్రాక్ దాటడం అని. అతను మాత్రం రోజూ అలాగే చేస్తాడట. తన వైఫ్ డ్రాప్ చేస్తుందట తనని. so ట్రైన్ వచ్చేవరకి బయట చలి లో ఎందుకని అలా కార్లోనే వెయిట్ చేసి అప్పుడు ఇలాగే ట్రైన్ ఆగాక వెనకనుండి క్రాస్ చేస్తాడట. ఒక్కరోజు కూడా ఎవరు ఆపలేదు, పాపం ఈరోజు నాతో ఉన్నందుకు అతనికి కూడా తగిలింది.
సరే 30 నిమిషాలు అయిపోయింది, ఇంకా రాడే ఆ కాప్.అంతసేపు ఏం చేస్తున్నాడో. 
ఇంక నెక్స్ట్ ట్రైన్ వచ్చే టైం కూడా అయింది. అది కూడా మిస్ అయితే ఇంక ఆఫీస్ కి వెళ్లి వేస్ట్, లంచ్ టైం కి చేరుకుంటా.
చూస్తుండగానే ఆ ట్రైన్ రానే వచ్చింది. అప్పుడు మెల్లగా వచ్చి అతను ట్రైన్ దగ్గరికి వెళ్లి TC తో ఒక 5 నిమిషాలు ఆపమని చెప్పి(అది చిన్న స్టేషన్ కాబట్టి ప్రాబ్లం ఎమి ఉండదు) మా దగ్గరికి వచ్చి చెరొక 200$ ఫైన్ టికెట్ చేతిలో పెట్టి ట్రైన్ ఎక్కించాడు :(.
ఇది అన్యాయం అనుకున్నాం.
ఆఫీస్‌కి వెళ్లి ట్రైన్ డిపార్ట్మెంట్  సైట్ లో చూస్తే పాదాచారులకి 50$ కన్నా ఎక్కువ ఫైన్ వెయ్యకూడదు అని ఉంది. అది కూడా ట్రైన్ వస్తున్నప్పుడు దాని ముందు నుండి దాటితే maximum of 50$ ఫైన్ అట.
తర్వాత....రేపు చెప్తా..