Wednesday, August 13, 2014

వేపాకు - కరివేపాకు

నేను వంటలు చాలా బాగా చేస్తాను.నా చుట్టుపక్కల ఉన్న వాళ్లందరు నా వంటలకి అభిమానులవుతూ ఉంటారు. ఎలాంటి వంట అయినా చిటికెలో చేసేస్తా..ఇలా ఎడమ చేత్తో ఉప్పు కారం వేసినా రుచిగా వస్తుంది. వంటల్లో నా టాలెంటును చూసి T.V వాళ్ళు "మంట మీద వంట" లాంటి ప్రోగ్రాములకి ఆహ్వానించారు కాని, బిజీగా ఉండటం వల్ల చెయ్యలేకపోయా.
(హమ్మయ్య..పైన చెప్పినవన్నీ నమ్మేసారు కదా...లేకపోతే  మళ్ళీ నా వంట టాలెంట్ మీద అనుమానం రావొచ్చు)..
పోయిన వారం ఎప్పుడూ వెళ్ళే మా ఇంటి దగ్గరి  indian grocerry shopకి కాకుండా వేరేదానికి వెళ్ళాం. ఇది కాస్త పెద్దగా ఉంది,ఐటంస్ కూడా అన్నీ ఉన్నాయి.కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికొచ్చేసాం. ఆ తర్వాత రోజు బెండకాయ పులుసు చేద్దామని మొదలు పెట్టా. ఇంతలో దగ్గర్లోనే ఉంటున్న మా ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. వచ్చిన వాళ్లు కాసేపు కూర్చుని వెళ్తుంటే, అప్పుడే ఏం వెళ్తారు, ఎలాగూ వంట మొదలు పెట్టా, డిన్నర్ చేసి వెళ్లండి అని చెప్పాం.
వంటింట్లోకి వెళ్ళి పులుసు మొదలు పెట్టి పోపేసా, కరివేపాకేసా, ఉల్లి గడ్డలు వేసా..ఛ..ఈ కరివేపాకేంటి అసలు వాసనే రాట్లేదు అని తీసి ఇంకొంచెం ఆకు మళ్ళీ వేసా..అయినా పోపులో కరివేపాకేసిన ఘుమ ఘుమే రావట్లేదు. తీరా పులుసు మొత్తం అయ్యాక టేస్ట్ చూద్దును కదా చేదు తగుల్తుంది, ఎందుకా అని ఆలోచిస్తుంటే, ఆయన వచ్చి కరివేపాకు తీసి చూపించాడు.. నువ్వు వేసింది కరివేపాకు కాదు అది వేపాకు అని.



నేనెప్పుడూ చూల్లేదు, వేపాకు కూడ అంత నీట్ గా నాలుగు ఆకులు కవర్లో పెట్టి అమ్మడం. 
ఇంకో కూర చేసే టైం కూడ లేదు. అదే కూర పెట్టేసి రెండు ఆమ్లెట్స్ వేసిచ్చా ఇంక. పాపం ఆ చేదు పులుసుతోనే   డిన్నర్ పెట్టా. మొదటి సారి ఇంటికొచ్చి అలా నా వంటకు బలి అయ్యారు పాపం. వెళ్ళే అప్పుడు మా ఆయన వంక జాలిగా చూసినట్టనిపించింది..నిజంగానే జాలిగా చూసారా, లేక నేనే అలా ఊహించుకున్నానా అని ఆలోచిస్తున్నా ;) ..