Friday, September 6, 2013

చిన్న ర్యాగింగ్ - కొన్ని నవ్వులు

ఎప్పుడు తలచుకున్నా పెదవుల పైన చిరునవ్వులు పూయించే చిన్న చిన్న సంఘటనలు కొన్ని ఉంటాయి. అలాగే ఆ సంఘటనకి కారణమైన వాళ్ళని ఆట పట్టించడానికి అవి ఎప్పుడు సహాయపడతాయి.
అప్పుడు మేము ఇంజనీరింగ్‌లో చేరిన మొదటి రోజులు. కాలేజ్ పక్కనే క్యాంపస్ హాస్టల్ ఉందని ఏరి కోరి చేర్పించారు నన్ను అక్కడ. కాలేజ్ హాస్టల్ కావడం వల్ల ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఉండేవాళ్ళు. అన్ని కాలేజ్‌లోలాగే మా దగ్గర్ కూడా కొంచెం ర్యాగింగ్ ఉండేది. ఒక్కో ఇయర్ స్టుండెంట్స్ ఒక్కో ఫ్లోర్‌లో ఉండేవాళ్ళు. ఇంక హాస్టల్ లో కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉండేవి. సీనియర్స్ ఎక్కడ కనిపించినా గుడ్ మార్నింగ్,గుడ్ ఈవినింగ్  అని    విష్ చెయ్యడం అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది. విష్ చెయ్యకపోతే respect ఇవ్వనట్టన్నమాట. మెస్ లో వాళ్ళ టేబుల్స్ పైన కూర్చోకూడదు, పెట్టుకునే అప్పుడు వాళ్ళొస్తే వాళ్ళు పెట్టుకునేందుకు జరిగి చోటివ్వాలి, అక్కడ ఉన్న  డొక్కు T.V రిమోట్ సీనియర్స్ ఎవరూ లేనప్పుడు మాత్రమే మేము తీసుకోవచ్చు ఇలాంటి undefined రూల్స్ చాలానే ఉండేవి.
అలా ఆ రూల్స్ లో మాకు గుర్తున్నవి పాటిస్తూ,కొన్ని గుర్తు లేనట్టు నటిస్తూ, ఎక్కువగా మా ఫ్లోర్ నుండి బయటికి వెళ్ళకుండా గడుపుతూ ఉండగా, సడెన్‌గా ఒకరోజు "మీ జూనియర్స్ డిసిప్లిన్  తప్పుతున్నారు, వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ పైనే ఉందని మర్చిపోయారా" అని మా సెకండ్ ఇయర్ వాళ్ళ అందరికి మూకుమ్మడిగా కలొచ్చినట్టుంది.
ఇంకేముంది ఒక రోజు రాత్రి డిన్నర్ చేసాక వాళ్ళ ఫ్లోర్ కి రమ్మని మా అందరికి పిలుపొచ్చింది. మేం 20-23 మందిమి ఉండేవాళ్ళం.మేం వెళ్ళే సరికి వాళ్ళందరు కుర్చోవడానికి సెట్ చేసుకొని మమ్మల్ని అలా నిల్చోపెట్టి ఇంక స్టార్ట్  చేసారు. మాకు సరిగ్గా respect ఇవ్వట్లేదు, కనిపిస్తే విష్ చెయ్యట్లేదు. పొగరు పెరిగింది, మొన్న మెస్‌లో ఇలా చేసారు అలా చేసారు అని చేసినవీ, చెయ్యనివీ కలిపి చెప్పి ఓ గంట క్లాస్ తీసుకొని మా కళ్ళు తెరిపించారు. తర్వాత ఒక్కొక్కరిని పట్టుకొని ఇంటర్యూ   ఇంటర్వ్యూ చెయ్యడం మొదలుపెట్టారు.అందరికీ ఒకటే ప్రశ్న. అదే సింపుల్ అండ్ కాంప్లికేటెడ్ question, ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళినా సమాధానం  చెప్పక తప్పని ప్రశ్న  మన గురించి మనం చెప్పుకోవాలట. ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నారు. చెప్తుంటే మధ్యలో ఆపి తప్పులు తీసి ఎదో ఒకటి అని మళ్ళీ  మొదటి నుండి చెప్పిస్తున్నారు.
మొత్తం తెలుగులోనే చెప్పాలి, మధ్యలో ఒక్క ఇంగ్లీష్ పదం వచ్చినా మళ్ళీ మొదటి నుండి చెప్పాలి.
నా పేరు గీత..
మా నాన్న పేరు రంగా రావు.
ఆగు మీ నాన్న పేరుని  అలాగేనా చెప్పేది   గౌరవం లేకుండా, మళ్ళీ చెప్పు
నా పేరు గీత..
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ పేరు జానకి.
అంటే నాన్నకి గౌరవం ఇస్తావు కాని అమ్మ కి ఇవ్వవాడా, మళ్ళీ చెప్పు
నా పేరు గీత..
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.

ఇలా చెప్తున్నారు ఒక్కొక్కరు.
అప్పటికే మేం వచ్చి 3,4 గంటలు అయ్యింది,వాళ్ళు అనే మాటలకి, ఆ సీరియస్ మొహాలని చూసి మాలో సగం మంది ఏడుస్తున్నారు. ఇంకా రాత్రి చాలా లేట్ అవడం,ఏడ్చిన్న వాళ్ళని చూసి పాపం  అనిపించిందో అప్పటికే చెప్పిన వాళ్లని వెళ్ళిపొమ్మన్నారు. తర్వాత ఒక్కొక్కరితో చెప్పించేసి పంపిస్తున్నారు.ఇంకా లాస్ట్‌లో  నేను, అమ్ము మిగిలాం.  నాది కూడా చెప్పడం అయిపోయింది. నన్ను కూడా పంపించేస్తే తనొక్కతే ఉండాలి అని టెన్షన్ పడుతూ బిక్క మొహం వేసుకొని నిల్చుంది తను.ఇంకాసేపుంటే ఏడుపు తన్నుకొని బయటికి వచ్చేలాగ ఉంది తన ఫేస్.
మనసులో తర్వాత తను ఎలా చెప్పాలో రిపీట్ చేసుకుంటూ ఉంది.
నా పేరు అమల
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.
నా పేరు అమల.
....
....
తనది కూడా అయిపోయాక ఇద్దరు కలిసి వెళ్దురు కాని అని నన్ను ఉండమన్నారు అక్కడే.
నెక్స్ట్ అమల..చెప్పు
నా పేరు అమల గారు 
మా నాన్న రంగా రావు గారు .
ఏంటి మళ్ళీ చెప్పు
నా పేరు అమల గారు 
మళ్ళీ ...
నా పేరు అమల గారు 
అప్పటి దాకా సీరియస్ గా ఉన్న వాళ్ళు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాక కాని అర్థం కాలేదు తనకి ఏం చెప్పిందో..
Google Image

నాకు లోపలి నుండి నవ్వొస్తుంది, ఇప్పుడు నవ్వితే మళ్ళీ ఇంకో అరగంట క్లాస్ పడుతుందని   అలానే బిగపట్టుకొని నిల్చున్న. తర్వాత ఏదో కానిచ్చేసి వచ్చెసాం.
ఆ సీన్‌లో తన టెన్షన్ మొహం, సిన్సియర్‌గా తన పేరు వెనక గారు అని అన్ని సార్లు చెప్పడం కొన్ని రోజుల వరకి తనని ఏడిపించడానికి మంచి టాపిక్ మాకు.
ఆ తర్వాత ఎప్పుడు తను కనిపించినా అమల అని ఎవరు పిలవలేదు , అప్పటినుండి తనపేరు ఇంక అమల గారు.
తర్వాత తర్వాత  ఆ సీనియర్సే మాకు మంచి  ఫ్రెండ్స్ అయ్యారు, తనని అమల గారు అని పిలవడం మాత్రం మానలేదు ఎవ్వరు.   

9 comments:

  1. mee amala gaarini ippudu kuda edipistunnaru meeru.....hahahahaha

    ReplyDelete
  2. అసలు ర్యాగింగ్ లేకుండా ఇంజనీరింగ్ బోర్ కదా!!! మనం జూనియర్స్ గా ఉన్నప్పుడు సీనియర్స్ నుంచి తప్పించుకుని తిరగడం, కనిపిస్తే wish చేసి తల వంచుకుని వెళ్లిపోవడం, భలే సరదాగా ఉండేది...

    ReplyDelete
    Replies
    1. మనకి ఎక్కువ ఇబ్బంది కలగనంతవరకి బావుంటుంది బాల గారు..

      Delete
  3. Naa peru amala garuu..lol :D

    ReplyDelete
  4. హహహ బాగుందండీ 'అమలగారు' గారు ఎపుడైనా కనిపిస్తే నేనడిగానని చెప్పండి :-))

    ReplyDelete
    Replies
    1. తనని నేను కలవలేనంత దూరంలో ఉన్నాను, అందుకే మీ కామెంట్‌ని మెస్సేజ్ చేసా తనకి :)

      Delete