Friday, September 13, 2013

క్షణం ఆలస్యమైతే - థ్రిల్లర్ స్టోరీ

అధ్యాయం - 1

వాతావరణం ప్రశాంతంగా ఉంది, కాని అది తుఫాన్ ముందు ఉండే ప్రశాంతత.
దూరంగా తీతువు పిట్ట అరుస్తుంది ఎందుకో.
ఆ అరుపు విద్యుల్లత  మిక్సీ లో పిండి రుబ్బుతున్న శబ్దం లో కలిసిపోయి వినిపించట్లేదు.
విద్యుల్లత అప్పుడే పిల్లల్ని స్కూల్‌కి పంపి, పిండి రుబ్బడం పూర్తి చేసి తర్వాత చెయ్యాల్సిన ముఖ్యమైన పనులేమున్నాయో గుర్తు చేసుకుంది. ఈరొజు ఆఫీస్ కి లీవ్ కాబట్టి తీరిగ్గా పనులు చేసుకోవచ్చు అనుకుంటూ, పాలు తీసి స్టౌ పైన పెట్టింది. 
స్వతహాగ తేలివైనది కాబట్టి స్టౌ హైలో పెడితే త్వరగా పొంగిపోతాయి, మర్చిపోతే కష్టం అని మీడియంలో పెట్టింది. కిచెన్‌లో మిగతా పనులు చూసుకుంటూ ఉండగా హాల్లో ఉన్న ఫోన్ మోగింది. 
ఆ ఫోన్ అందుకోవడానికి కదిలింది విద్యుల్లత, ఆ కాల్ తన తలరాతనే మర్చడానికి కారణం అవుతుందని తెలిస్తే, బహుశా ఎప్పటికి ఆన్సర్ చెయ్యకపోయేదేమో. 

అధ్యాయం - 2

చిరాగ్గా ఉంది బృహస్పత్ కి. రాత్రంతా నిద్ర లేదు. production రిలీజ్ ఉన్నప్పుడల్లా ఇంతే. బాధ్యతంతా తన పైనే ఉంటుంది. ఏ సమస్య వచ్చిన అందరు తననే సంప్రదిస్తారు. 
కిటికీలోంచి వెలుతురు పడుతుంది. పక్కనే ఉన్న వాచ్‌లో టైం చూసాడు.చాలా లేట్ అయ్యింది. ఈపాటికి విద్యుల్లత లేచే ఉంటుంది అనుకొని, తను లేచి ఏమైనా తాగడానికి ఉందేమో చూద్దాం అని కిచెన్‌లోకి దారి తీసాడు. 
***********************
విద్యుల్లత ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. స్టౌ పైన పాలు పెట్టిన విషయం గుర్తురావట్లేదామెకిప్పుడు. 
తన ధ్యాస అంతా ఫోన్‌లో  స్నేహితురాలు చెప్తున్న విషయం పైనే ఉంది. 

పాలు వేడయ్యాయి. ఇంకో అర నిమిషమో, నిమిషమో అంతే గట్టు తెగిన  గోదారిలా పొంగడానికి సిధ్ధంగా ఉన్నాయి.
పాల ఉపరితలానికి, గిన్నె అంచుకి మధ్య దూరం  ఒక ఇంచు కూడా లేదు.
ఆ పాలు పొంగితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మానవ మాత్రుల ఊహకందని విషయం. దాని వల్ల జరగబోయే నష్టాన్ని పూడ్చడం ఈ భూమ్మీద ఉన్న ఏ ఒక్కరికైనా కష్టమైన పని. పాలు పొంగిన స్టౌ క్లీన్ చెయ్యడం చిన్న విషయమేం కాదు కదా.
అదే కాకుండా ఇంకా చాలా నష్టాలున్నయి, అన్నిటికన్నా ముఖ్యమైనది.....
Google Image

అధ్యాయం - 3

కిచెన్‌లోకి వెళ్ళిన బృహస్పత్   మనసెందుకో కీడు శంకిస్తోంది. ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే ఉండే పెరుగు గిన్నె బయట కిచెన్ గట్టు పైన ఉంది. 
అలా ఉండడం అరుదైతే కాదు, కాని.. కాని సాధారణం కూడా కాదు.విద్యుల్లత ఎంతో తెలివైంది, ఆమె మీద తనకా నమ్మకం ఉంది. ఏదో కారణం లేనిదే అలా బయట పెట్టదు పెరుగుని. 
పైగా భోజనం సమయం కూడా అవలేదు. 
కాని అది కాదు తనకి చెడు సంకేతాలిస్తుంది. 
కొన్ని క్షణాల్లో ఇక్కడ ఇంకేదో జరగబోతుంది అనిపిస్తోంది. 

ఆలోచిస్తునే నీళ్ళు తాగడానికి ఫ్రిజ్‌లొంచి బాటిల్ తీసాడు.ఫ్రిజ్ డోర్ వేస్తుండగా అప్పుడు వినిపించింది 
స్స్ స్స్
స్స్.. మని ఏదో చప్పుడు, టక్కున తల తిప్పి స్టౌ వైపు చూసాడు. 
పాలు పొంగడానికి సిధ్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పాలకి గిన్నె అంచుకి మధ్య అర ఇంచు కూడా లేదు. మహా అయితే అయిదో, ఆరో మిల్లీమీటర్లుంటుందంతే*. 
ఇంక ఆలస్యం చెయ్యదల్చుకోలేదు బృహస్పత్. ఈ పరిస్థితుల్లో విద్యుల్లత కోసం ఎదురు చూడటం అర్థం లేని పని.అతని మెదడు వేగంగా పని చేస్తుంది. అరక్షణంలో తను స్టౌ ని చేరుకోగలడు.
ఇప్పుడు వెళ్ళి స్టౌ ఆర్పినా జరిగే ఉపద్రవాన్ని అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే అది గ్యాస్  స్టౌ కాదు, మంట ఆర్పడానికి, ఎలక్ట్రిక్ స్టౌ. ఆపేసిన వెంటనే దాని వేడి తగ్గిపోదు. సరిగ్గా చెప్పాలంటే పొంగక ముందు ఆపేసినా ఆ వేడికి ఇంకా 1,2 నిమిషాలు ఉండి పొంగే ప్రమాదం కూడా ఉంది అప్పుడప్పుడు. 
ఇంకొక పరిష్కారం గిన్నెను స్టౌ పైనుండి తీసెయ్యడం. అది చాలా కష్టమైన పని ఎందుకంటే దగ్గర్లో ఆ వేడిగిన్నెను దించడానికి ఉపయోగపడే వస్తువులేం లేవు. 
_______________________________________
*మిల్లీమీటరు- ఇది దూరాన్ని కొలిచే చిన్న యూనిట్. మనకి కిలోమీటరు బానే తెల్సు కదా.ఒక సెంటిమీటరు కి 10 మిల్లీమీటర్లు. ఒక మీటరుకి 100 సెంటిమీటర్లు.ఒక కిలోమీటరుకి 1000 మీటర్లు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఒక మిల్లీమీటరు అంటే ఎంత తక్కువ దూరమో.

అధ్యాయం - 4
ఇంక క్షణం ఆలస్యమైనా, తర్వాత ఎవరు ఏమీ చెయ్యలేరు.
రేపటికి పెరుగు ఉండదు. సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక తన ప్రాణపదమైన పిల్లలు హార్లిక్స్ వేసుకొని తాగడానికి పాలు ఉండవు.వాళ్ళు పాలు తాగకపోతే తను ఎలాగైన తట్టుకోగలడు. కాని విద్యుల్లత తట్టుకోలేదు. 
ఆ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఈ పాటికి ఆ ఒత్తిడి తట్టుకోలేక పడిపోయేవారు. కాని అక్కడ ఉంది సంవత్సరానికి 20 production రిలీజ్‌లలో పాల్గొనే వ్యక్తి. ఎన్నో రిలీజ్‌లకి గంట ముందు కూడా ఒత్తిడిని తట్టుకొని ఇంకా ప్యాచ్ వర్క్‌లు, defect ఫిక్స్‌లు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. 
ఆ చివరి నిమిషంలో వచ్చింది మెరుపులాంటి ఆలోచన, ఇంక ఆలస్యం చెయ్యలేదు, క్షణంలో వెయ్యోవంతులో, తను నీళ్ళు తాగడానికి తీసిన వాటర్ బాటిల్ మూత తీసి, చేతిలో కొన్ని నీళ్ళు పట్టుకొని పొంగబోతున్న పాలపై చల్లాడు. 
స్స్..స్.. అంటూ పాలు కిందికి వెళ్లిపోయాయి. వెంటనే స్టౌ ఆపేసాడు. 

ఉపసంహారం:
సాయంత్రం 5 గం.
ఇంటి వెనక పెరట్లో 4 కుర్చీలు వేసి ఉన్నాయి.
స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయి, మల్లెపూవుల్లా మెరిసిపోతూ కూర్చున్నారు పిల్లలు దృశ్యకాంతి, ద్రవపుత్రి. వారి చేతుల్లో కప్స్ ఉన్నాయి. అందులో చక్కెర వేసి, హార్లిక్స్ కలిపిన పాలు రుచికరంగా ఉన్నాయి.
2 టీ కప్పుల్తో వచ్చి విద్యుల్లతకి ఒకటి ఇచ్చి , తనొకటి తీసుకొని కూర్చున్నాడు బృహస్పత్. 
వాళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం పడమటి దిక్కున సూర్యునిలా మెరుస్తుంది. 
ఆ రోజు పాలు తోడేసారని వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

12 comments:

  1. Evarimeedakkayyaa ee satire?

    ReplyDelete
    Replies
    1. Ayo satire em kaadu.but yandamoori novels 3 chadiva ee weeklo.aa effect

      Delete
  2. oh my god suspence emaiddo anukunna chivariki neellu challaraa?
    :))

    ReplyDelete
  3. Very funny...last varaku manchi grip tho rasaru..gud 1

    ReplyDelete
  4. ఏంటండీ బాబూ, నేరాలూ ఘోరాలు ఎక్కువగా చూస్తుంటారా??? :P

    ReplyDelete
    Replies
    1. హహ నేరాలు ఘోరాలు కాదండి.. ఏవో కొన్ని బుక్స్ చదివా ఆ వారంలో.. ఆ ఎఫెక్ట్ ఇది..:)

      Delete
  5. mee age ki yandamuri navalalaki match katvatlede
    2013 lo MS ante 1985-90's lo mee brith date expect chestunna, ee age vallaki yandamuri navalalu teliyatame kastam :)

    ReplyDelete
    Replies
    1. హహ..బావుందండి మీ అనాలసిస్..ఇండియాలో ఉన్నప్పుడు నేను ఒక్క తెలుగు novel కూడా చదవలేదు, నాకు ఇంట్రస్ట్ ఉన్నా కూడా.US వచ్చాకే internet వల్లా.. బ్లాగ్స్ వల్లా తెలుగు చదవటం, ఆన్‌లైన్లో తెలుగు బుక్స్ దొరకటం వల్ల కొన్ని చదవగలిగాను.నిజం చెప్పాలంటే ఏ పని లేకుండా ఎక్కువ సేపు సిస్టం ముందు కుర్చోవడం వల్లా :)

      Delete
  6. మీ ఈ పేరడీ భలే వుంది - a refreshing read ! 👏

    ReplyDelete