Wednesday, May 21, 2014

దుబాయ్ ట్రిప్ - Day 3 contd..

ఆ తర్వాత రయ్యిమని బండిని ఇసుకలోకి తీస్కెళ్లాడు.అలా తీస్కెళ్లడం తీస్కెళ్లడం గంట వరకు ఆపకుండా గాల్లో నడిపినట్టు డ్రైవ్ చేసాడు. నాకైతే సగం సేపు బండి  పడిపోతుందేమో, ఆ ఎగుడు దిగుడుగా ఉన్న ఇసుకలో జారిపోతుందేమో అనిపించింది. ఒక్కోసారి పక్కకి తిప్పినప్పుడు ఇసుక బండి కన్నా పైకి లేచి, కార్ అద్దాలన్నీ మూసుకుపోయి ఇసుకలో మునిగిపోతున్నామేమో అనిపించింది.అలా గంట సేపు తిప్పి తిప్పి  ఎడారి మధ్యలో ఒకచోట ఆపాడు. ఈలోపు ఇంకో 3,4 ఇలాంటి వెహికిల్స్ కూడా వచ్చి ఆగాయి. అక్కడ ఒక 10 నిమిషాలు దిగి ఫొటోస్ తీసుకున్నారు అందరు. ఈలోపు ఒక షేక్ falcon ని పట్టుకొని అక్కడికొచ్చాడు.  అతని దగ్గరికెళ్లి దాన్ని పట్టుకొని ఒక ఫొటో తీసుకున్నాం.

అక్కడి నుండి తీసుకెళ్ళి మమ్మల్ని ఎదారి మధ్యలో ఉన్న ఒక క్యాంప్‌లో దింపాడు. అప్పటికే అక్కడ చాలా వాహనాలున్నాయి.ఒక్కొక్క బండిలో వచ్చిన వాళ్లందరికి కలిపి ఒక table ఉంటుదనీ, మా table నంబర్ చెప్పి, అక్కడికెళ్ళి మేం ఐదుగురం కూర్చోవచ్చనీ చెప్పాడు. camel ride, టీ, రాత్రి భోజనం టూర్ ప్యాకేజిలో ఫ్రీ అని, ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి కావల్సినవి కొనుక్కొవచ్చనీ, రాత్రి మళ్ళీ ఇక్కడికే వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పాడు.  అక్కడ ATV రైడ్ ఉంది, దాని గురించి అడిగితే వెళ్ళి ఇప్పుడే టికెట్ తీసుకోండి, తర్వాత చాలా మంది వస్తారు దొరకడం కష్టం అవుతుంది అంటే, ఫస్ట్ అక్కడికెళ్లాం. అప్పటికి పెద్దగా క్యూ లేదు కాబట్టి త్వరగానే దొరికింది.

అదైపోయాక camel ride. అంటే ఓ... రైడ్ కాదు. జస్ట్ దాని మీద ఎక్కించి పదంటే పదే అడుగులు అటూ ఇటూ తిప్పి దింపేస్తారు.కాకపోతే ఫొటోస్ తీస్తారు, అవి కొనుక్కోవచ్చు మనకి నచ్చితే. ఇవి రెండూ క్యాంప్ బయట ఉన్నాయి. తర్వాత క్యాంప్ లోపలికి వెళ్ళి మా table ఎక్కడుందో చూసుకొని స్టాల్స్ ఏమున్నాయో చూద్దామని వెళ్లాం. మెహెందీ, హుక్కా, జ్యూస్, స్వీట్ కార్న్ ఇలాంటి స్టాల్స్ ఉన్నాయి కొన్ని. వాటి మధ్యలో అప్పుడు కనిపించింది అస్సలు ఊహించని స్టాల్. వాళ్ళ దగ్గర కొన్ని బుర్ఖాలు, షేక్ డ్రెస్సులూ ఉన్నాయి. వాటిలో మనల్ని ఫొటొస్ తీస్తారు. వచ్చినప్పుడే అనుకున్నా అని చెప్పాగా బుర్ఖాతో ఫొటో తీసుకుంటే బావుండు అని. యాహూ... అనుకొని వెళ్ళి టక్కున బుర్ఖా వేసుకొని నిల్చున్నా. వేరే వాళ్ళని తీస్తున్నారు అప్పుడు, వాళ్లదవగానే    మేం వెళ్లాం. కత్తి పట్టుకొని, ఇంక కొన్ని అరబిక్ వస్తువులు పట్టుకొమ్మని ఫొటోస్ తీసారు.ఇవీ, ఇందాక camel దగ్గర దిగినవి అన్ని కలిపి రాత్రి వెల్లిపోయే ముందు కలెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు.  తర్వాత కొంచెం టీ, కొన్ని స్నాక్స్ ఇచ్చారు. అవి తెచ్చుకొని మా table దగ్గర కూర్చున్నాం. table అంటే table కాదు. ఒక పరుపు లాంటిది  కొంచెం ఎత్తులో వేసి, దాని చుట్టు దిండుల్లాంటివి వేసారు. వాటన్నిటినీ   ఒక స్టేజ్ చుట్టూ వేసారు.

సాయంత్రం కావడంతో ఎడారి లో ఉన్నా హాయిగా చల్లగా మంచి వాతావరణం ఉంది. స్నాక్స్ అయ్యాక ఒక బెల్లీ డ్యాన్స్, ఒక షో ఉండె(డ్యాన్స్ ప్లస్ జిమ్నాస్టిక్స్ టైపులో), మంచి మ్యూజిక్‌లో.

తర్వాత భోజనం వచ్చి తీస్కెళ్లమని అనౌన్స్ చేసారు.భోజనం కూడా పర్లేదు బానే ఉంది.తినే సరికి రాత్రి 9 అయింది. అందరితో పాటే బయటికి వెళ్ళి మా డ్రైవర్‌ని వెతికి పట్టుకొని రిటర్న్ బయల్దేరాం. వెళ్ళే అప్పుడు అంత భయం అవలేదు కాని, ఇప్పుడు చీకట్లో అంత వేగంగా నడిపిస్తుంటే కాస్త భయం వేసింది. అంత చీకట్లొ, రోడ్ మీద కన్నా వేగంగా తీసుకొచ్చాడు. అసలే అక్కడ దారి లాగ కూడా   లేదు అనుకుంటే ఎదురుగా కూడా వాహనాలొస్తున్నాయి. బస్సుల్లో వచ్చిన వాళ్లని రోడ్ వరకు తీస్కెళ్ళి దింపాలట అందుకోసం. ఇసుక దాటేసి కొంచెం దూరం వచ్చాక మధ్యాహ్నం టైర్లలోంచి గాలి తీసేసారు  కదా, అక్కడే ఆపి గాలి నింపారు మళ్ళీ రోడ్ మీద డ్రైవ్ చెయ్యడానికి వీలుగా. వచ్చే అప్పుడే చూసాం, తిరిగి వెళ్ళే దార్లోనేGlobal village అని మేం వెల్దాం అనుకున్న ఇంకో ప్లేస్ ఉందని. రాత్రి ఎప్పటి వరకు ట్యాక్సీలు ఉంటాయని డ్రైవర్ ని    అడిగితే ఏం ప్రాబ్లం ఉండదు,అసలు అది రాత్రే తెరుస్తారని అప్పటి వరకు ఉంటాయని చెప్పటంతో, మమ్మల్ని మధ్యలొ అక్కడ దింపెయ్యమని అడిగాం. మాతో పాటు ఆ ఫ్రెంచ్ జంట కూడా దిగేసరు అక్కడే. వెళ్ళి టికెట్ కౌంటర్ లో అడిగితే రాత్రి 1 వరకు తెరిచే ఉంటుందని చెప్పారు. అది చాలా పెద్ద ఎగ్జిబిషన్ లాగ ఉంది. అన్ని దేశాలకి ఒక్కొక్క సెట్ లాగా వేసి లోపల ఆ దేశానికి సంభందించిన వస్తువులు అమ్ముతున్నారు. అన్నిట్లోకి మహల్ లాగ వేసిన మన దేశందే చాలా బావుంది.

 అక్కడ ఒక గంట సేపు తిరిగి, ఇంకా చూడ్డానికి  పెద్దగా ఏమి అనిపించకపొయేసరికి  బయటికి వచ్చేసాం. ట్యాక్సి తీసుకొని హోటల్‌కి వచ్చేసాం. ఇంకా ఒక్కరోజే మిగిలింది,ఒక్కరోజు కూడా కాదు రేపు రాత్రి ఫ్లైట్.ఇంకో రోజులో మళ్ళీ వెళ్లి రొటీన్‌లో పడిపోవాలి.. :(

2 comments:

  1. meeru rastunna saili chalaa baagundi. hayigaa chadivettu raastaaru. mee pata posts anni kuda chadivanu. Keep writing :)

    Jyothi.

    ReplyDelete