Wednesday, August 13, 2014

వేపాకు - కరివేపాకు

నేను వంటలు చాలా బాగా చేస్తాను.నా చుట్టుపక్కల ఉన్న వాళ్లందరు నా వంటలకి అభిమానులవుతూ ఉంటారు. ఎలాంటి వంట అయినా చిటికెలో చేసేస్తా..ఇలా ఎడమ చేత్తో ఉప్పు కారం వేసినా రుచిగా వస్తుంది. వంటల్లో నా టాలెంటును చూసి T.V వాళ్ళు "మంట మీద వంట" లాంటి ప్రోగ్రాములకి ఆహ్వానించారు కాని, బిజీగా ఉండటం వల్ల చెయ్యలేకపోయా.
(హమ్మయ్య..పైన చెప్పినవన్నీ నమ్మేసారు కదా...లేకపోతే  మళ్ళీ నా వంట టాలెంట్ మీద అనుమానం రావొచ్చు)..
పోయిన వారం ఎప్పుడూ వెళ్ళే మా ఇంటి దగ్గరి  indian grocerry shopకి కాకుండా వేరేదానికి వెళ్ళాం. ఇది కాస్త పెద్దగా ఉంది,ఐటంస్ కూడా అన్నీ ఉన్నాయి.కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికొచ్చేసాం. ఆ తర్వాత రోజు బెండకాయ పులుసు చేద్దామని మొదలు పెట్టా. ఇంతలో దగ్గర్లోనే ఉంటున్న మా ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. వచ్చిన వాళ్లు కాసేపు కూర్చుని వెళ్తుంటే, అప్పుడే ఏం వెళ్తారు, ఎలాగూ వంట మొదలు పెట్టా, డిన్నర్ చేసి వెళ్లండి అని చెప్పాం.
వంటింట్లోకి వెళ్ళి పులుసు మొదలు పెట్టి పోపేసా, కరివేపాకేసా, ఉల్లి గడ్డలు వేసా..ఛ..ఈ కరివేపాకేంటి అసలు వాసనే రాట్లేదు అని తీసి ఇంకొంచెం ఆకు మళ్ళీ వేసా..అయినా పోపులో కరివేపాకేసిన ఘుమ ఘుమే రావట్లేదు. తీరా పులుసు మొత్తం అయ్యాక టేస్ట్ చూద్దును కదా చేదు తగుల్తుంది, ఎందుకా అని ఆలోచిస్తుంటే, ఆయన వచ్చి కరివేపాకు తీసి చూపించాడు.. నువ్వు వేసింది కరివేపాకు కాదు అది వేపాకు అని.



నేనెప్పుడూ చూల్లేదు, వేపాకు కూడ అంత నీట్ గా నాలుగు ఆకులు కవర్లో పెట్టి అమ్మడం. 
ఇంకో కూర చేసే టైం కూడ లేదు. అదే కూర పెట్టేసి రెండు ఆమ్లెట్స్ వేసిచ్చా ఇంక. పాపం ఆ చేదు పులుసుతోనే   డిన్నర్ పెట్టా. మొదటి సారి ఇంటికొచ్చి అలా నా వంటకు బలి అయ్యారు పాపం. వెళ్ళే అప్పుడు మా ఆయన వంక జాలిగా చూసినట్టనిపించింది..నిజంగానే జాలిగా చూసారా, లేక నేనే అలా ఊహించుకున్నానా అని ఆలోచిస్తున్నా ;) ..   

Wednesday, June 11, 2014

అబ్బాయి పెళ్ళి - అమ్మాయి చదువు

అతనికి జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయాయి.అమ్మాయి చదువు పూర్తి చేసుకొని మంచి కంపనీలో ఉద్యోగం చేస్తుంది.అబ్బాయి పెళ్ళి చేసుకొని భార్యా పిల్లలతో హాయిగా ఉన్నాడు.
******
తన ఉద్యోగం పోయింది, వేరే ఆదాయం ఏమి లేదు.ఇప్పుడేం చెయ్యాలో పాలు పోవట్లేదు.ఇంట్లో కాలేజీకెళ్తున్న కూతురు, పెళ్ళి కావల్సిన ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూతురు చదువు ఎలా పూర్తవ్వాలి, అబ్బాయిలిద్దరికి పెళ్ళిళ్లు ఎలా చెయాలి!!
*****
ఆ భార్యా భర్తలు చాలా పధ్ధతిగా జీవితం గడుపుతారు. అందుకనే కూతురి పెద్ద చదువులకి, కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యడానికి సరిపడినంత డబ్బు కూడబెట్టగలిగారు.  
*******
ఈరోజే మా బ్యాంకు వారు ప్రవేశ పెట్టిన పథకంలో చేరండి.మీ కూతురి చదువుకి, కొడుకు పెళ్ళికి ఏ ఆటంకం రాకుండా కావల్సినంత డబ్బు ఆదా చెయ్యండి.
*********  
టైటిల్ తో సహా ఈ వ్యాక్యాలన్ని ఏదో తేడా గా అనిపిస్తున్నాయా(అనిపించకపోతే చాలా సంతోషం). మనం రోజూ చదివే కథల్లో, చూసే సినిమాల్లో, టివిలో ఇవే మాటల్ని వింటున్నాంగా రోజూ, కాకపోతే అబ్బాయి స్థానంలో అమ్మాయి,  అమ్మాయి స్థానంలో అబ్బాయి .అవేవో పాతకాలం కథలు/సినిమాలు, పాత ప్రకటనలు కాదు. పోనీ బయట కూడా సమాజం అలానే ఉంది అందుకే అలాంటివే రాస్తున్నారు/తీస్తున్నారు అనుకుందాం అంటే, మిగతా కథ అంతా దీనికి విరుద్దంగానే ఉంటుంది.ఒక పెద్ద అతను పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, ఒంటరిగా ఉండలేక తోడు కోసం ఇంకో పెద్దావిడని పెళ్ళి చేసుకుంటాడు. ఈ విషయంలో అంత విశాలంగా ఆలోచించి, అబ్బాయి, అమ్మాయి విషయంలో మళ్ళీ same dilouge.
ఒకవేళ అబ్బాయి పెళ్ళి గురించి ఏవన్నా కథలు/సినిమాలో సీన్స్ ఉన్నా కేవలం కామెడి కోసమే అయ్యుంటాయి.
మొన్న ఏదో సినిమాలో చూస్తే, ఇది బాబు కాన్వెంట్ ఫీజుకి, ఇది పాప ఫిక్స్‌డ్ డిపాజిట్ కి అట.
తల్లి తండ్రులు అమ్మాయి పెళ్ళి విషయంలో అబ్బాయి కన్నా ఎక్కువ ఆలోచిస్తారు అన్నది నిజమే కావచ్చు, కాని అమ్మాయి చదువు, ఉద్యోగం విషయాల్లో కూడా అంతే ఆలోచిస్తున్నారేమో atleast ఈ మద్య కాలంలో.
నాకు తెల్సిన చాలా మంది(కూతుర్ని మంచిగా చదివించిన వాళ్ళు), కూతురి చదువైపోగానే కొడుకు ఉద్యోగం కోసం ఎంత ఆరాటపడ్డారో కూతురికి జాబ్ రావాలని అంతే అనుకున్నారు. ఇంకొకరు కూతురు పెళ్ళై  అత్తారింటికి వెళ్ళిపోయినా తను చదివిన చదువుకు న్యాయం చేసేలా జాబ్ రావాలని కోరుకున్నారు, కోరుకోవడం కాదు పెళ్లైంది కదా అని relax అవకుండా, ఇంక జాబ్ రాలేదని బాధ పడుతుండేవాళ్ళు.(తర్వాత తను మంచి జాబ్ లో చేరింది)    అమంచి ఉద్యోగం ఉన్నా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్న అబ్బాయిలూ, బాధపడుతున్న తల్లితండ్రులూ ఉన్నారు.
Google Image

ఏదేమైనా చదువైనా, పెళ్ళైనా అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికీ ముఖ్యమైనవే. కనీసం మీడియాలో అయినా అలా చూపించకపోతే బావుండు.