Friday, May 8, 2020

అబ్బాయి పెళ్ళి - అమ్మాయి చదువు

ఇంతకుముందొకసారి ఇదే పేరుతో ఒక పోస్ట్ రాసాను అబ్బాయి పెళ్ళి - అమ్మాయి చదువు అని. ఆ తర్వాత కూడా అదే మ్యాటర్ ఎన్ని సార్లు  అనుకున్నానో. ఏదైనా ఒక్క సంఘటన ఒక సినిమాలో కాని, షార్ట్ మూవీ లో కాని లేదా ఒక ప్రకటనలో కానీ అమ్మాయిని, అబ్బాయిని సమానులుగా చూపిస్తే మనసులో చిన్న సంతోషం.  నిజమైన ప్రపంచం అలా ఉండనీ ఉండకపోనీ, కాని అలా ఊహించుకోవడం సంతోషమేగా.
ఈ మధ్య సమ్మోహనం సినిమా చూసాను.అందులో హీరో తండ్రి పాత్ర ఒక సన్నివేశం లో తన బాధ్యతలు నెరవేర్చాను అని చెప్పడానికి కుటుంబంతో ఇలా అంటాడు, "కొడుకుని చదువించాను, కూతుర్ని చదివిస్తున్నాను, ఇల్లు కట్టించాను, మంచి సేవింగ్స్ ఉన్నాయి" అని.
 ఈ ఒక్క డైలాగ్ కి ఈ సినిమాని మెచ్చుకోవచ్చు కొడుకుని చదువించాను, కూతురి పెళ్లికి డబ్బు దాచాను అననందుకు.
శ్రీమంతుడు సినిమాలో హీరో తన కంపనీలో పనిచేస్తున్న ఉద్యోగికి సహాయం చేస్తున్నాడు అని చూపించడానికి రాసుకున్న సీన్, అతని కూతురి పెళ్లిచూపులకి వెళ్లి దగ్గరుండి మరీ కట్నంగా పెళ్లికొడుకు చదువుకి 20 లక్షలు ఇప్పిస్తాడు. అదే కూతురు చదువు కోసం అని చూపిస్తే ఎంత బావుండేది అనిపించింది నాకు.
జులాయి సినిమాలో కూడా హీరో తండ్రి కొడుకుతో "ఎంతో మంది తమ కొడుకుల చదువుల కోసం, కూతుర్ల పెళ్లి కోసం డబ్బులు దాచుకున్నారు" అంటాడు.
ఇలాంటివి చిన్న చిన్న సన్నివేశాలే కావచ్చు, కాని ఇండైరెక్ట్ గా ఐనా అందరి మనసుల్లో అబ్బాయిలకి చదువు చాలా ముఖ్యం, అమ్మాయిలని ఎంత చదివించినా పెళ్లికి ఖర్చు చెయ్యాల్సిందే అనుకునేలా చేస్తుంది అనిపిస్తుంది.
ఐనా ఈ విషయంలో తెలుగు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లడుకుంటే అంత మంచిదేమో.
కాని నేను ఇప్పుడు మళ్లీ ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే, నిండా నాలుగేళ్లు లేని మా వాడు నిన్న ఏదో సినిమా చూస్తుంటే హీరోయిన్ నీళ్లలో పడిపోగానే "ఇప్పుడు హీరో అంకుల్ వచ్చి రెస్క్యూ చేస్తాడు ఆంటీని" అన్నాడు. ఇంకొన్ని సినిమాల్లో ఐనా ధైర్యంగా ఉండే అమ్మాయిలు, చదువు కు ప్రాముఖ్యం ఇచ్చే అమ్మాయిలు, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే అమ్మాయిలని చూపిస్తే బావుండు.

1 comment:

  1. Nice writeup..!Missing your posts madam..!

    ReplyDelete