Showing posts with label పాత ముచ్చట్లు. Show all posts
Showing posts with label పాత ముచ్చట్లు. Show all posts

Friday, October 18, 2013

చిన్నప్పుడు బతుకమ్మ

దసరా, బతుకమ్మ అయిపోయి వారం అవుతుంది ఇప్పుడేం బతుకమ్మ పోస్ట్ అనుకుంటున్నరు కదా.. ఏం చేద్దాం ఇదంతా అప్పుడే రాసి పెట్టుకొని బతుకమ్మ రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను.. కాని కుదర్లేదు. better late than never అని ఇప్పుడు పోస్టింగ్.
ఇప్పుడంటే ఎక్కువ excitement లేదు కాని చిన్నప్పుడు దసరా వస్తుందంటే ఎన్ని రోజుల ముందు నుండి ఎదురుచూసే వాళ్ళమో.
దసరా, సంక్రాంతికే కదా ఎక్కువ రోజులు హాలిడేస్ ఇచ్చేది.
మా దగ్గర(పోని at least మా ఇంట్లో) దసరా నే పెద్ద పండగ. ఇంకా చెప్పాలంటే దసరా కూడా కాదు మా పిల్లలకైతే(అంటే మా పిల్లలు అని కాదు, మాలాంటి పిల్లలు అని) బతుకమ్మ రోజే పెద్ద పండగ అన్నమాట.  
సంక్రాంతికైతే 3 రోజులే హడావిడి, కాని దసరాకైతే 9 రోజులు పండగే కదా పిల్లలకి, మరి రోజు బతుకమ్మ చేయ్యాలి కదా.
 దసరా టైంలోనే కదా స్కూల్‌లో Quarterly exams అయిపోయేవి. లాస్ట్ ఎగ్జాం అవడం ఆలస్యం, ఇంట్లో నాన్నని ఒక్కరినే వదిలేసి అందరం అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళేవాల్లం.ఏ పండగకైనా మా ఇంట్లో ఉండేవాళ్ళమేమో కాని దసరా కి మాత్రం అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాల్సిందే. బతుకమ్మ ఫస్ట్ డే కల్లా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ డే బతుకమ్మ మరీ పెద్దగా  చేయ్యకపోయేది కాని, కొంచెం చిన్నదిగానే చేసి వీధికొక చోట ఒక గుంట తీసి, దాని చుట్టూ పెట్టేవాళ్ళం. ఫస్ట్ డే కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఆడేవాళ్ళు.
కాసేపు ఆడుకొని ఆ పూలన్ని గుంటలో పడేసి ఇంటికొచ్చేవాళ్ళం.
ఇంక ఆ తర్వాత రోజు నుండి తొమ్మిదో రోజు వరకు పెద్దవాళ్ళెవరు participate చెయ్యకపోయేవాళ్ళు. రోజు ప్రొద్దున్నే లేచి గుమ్మడి పూల కొసం ఇంటి చుట్టూ, పక్కనే ఉన్న తోటలోకాని వెతికి తెంపి పెట్టేది. మళ్ళీ లేట్ గా లేస్తే ఎవరో ఒకరు ఆ పూలు కోసుకెళ్తారు.
ఏ పూలు ఉన్నా లేకపోయినా బతుకమ్మ పైన ఒక్క గుమ్మడి పువ్వైనా ఉండాల్సిందే. అలా తొమ్మిదో రోజు వరకి మా మా టాలెంట్ ప్రదర్షించేవాళ్లం.
ఇంక అప్పటినుండే పెద్ద బతుకమ్మ రోజు కి కావాల్సిన పూలు సేకరించడం మొదలయ్యేది. కొన్ని పూలు వారమైనా పాడయ్యేవి కాదు. అలంటి పూలు రోజు తెచ్చి, జాగ్రత్తగా ఒకే సైజులో కత్తిరించి, కట్టలుగా చేసి పెట్టెవాళ్ళు.
ఇది పెద్ద వళ్ళ్ళ సెక్షన్. ఇందులో పిల్లలని చేతులు పెట్టనియ్యకపొయేది, ఎందుకంటే అలా కట్టలు సరిగ్గా రాకపోతే బతుకమ్మ చేయ్యడం కష్టం అట.
ఇంక పెద్ద బతుకమ్మ రోజు ఇంకా త్వరగా లేచేవాళ్ళం. ఎన్ని ఎక్కువ పూలు దొరికితే అంత మంచి బతుకమ్మ చెయ్యొచ్చు కదా మరి. ఆ రోజైతే పిన్ని, అమ్మ వాళ్ళు కుడా పూలు తెంపడంలో పోటి పడేవాళ్ళు. మరి పక్కింటి వాళ్ల కన్నా బావుండాలి కదా ;).
నా దృష్టిలో అయితే బతుకమ్మ చేయ్యడం కష్టమైన పనే. అంత ఎత్తుగా కేవలం పూలతోనే  పెట్టడం అంటే కష్టమేగా మరి. కనీసం అవి ఆగడానికి గాని, సపోర్ట్ కోసం కాని దారం లాంటివేమి ఉపయోగించరు.
మధ్యహ్నం నుండే చెయ్యడం మొదలు పెట్టేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళింట్లో అయితే ఎప్పుడూ బతుకమ్మ చేసేది అమ్మమ్మే. ఇక్కడ అమ్మ, పిన్ని వాళ్ళు కూడా inexperienced  కిందే లెక్క. మరి పడిపోకుండా, వంగిపోకుండా చక్కగా చెయ్యాలి కదా.
పిల్లలమేమో కాసేపు పూలు అందించడమో అలంటి చిన్న పనులు చేసి మేం కూడా involve అయ్యాం అనిపించుకునేది. చేస్తున్నంతసేపు మా ఇంట్లోకి, వీధిలో ఉన్న అందరి ఇంట్లోకి తిరిగొచ్చి ఎవరిది ఎలా వస్తుంది, ఎవరిది పెద్దగా ఉంది అని చూసి వచ్చేవాళ్ళం.
మా దాని కన్నా ఎవరిదన్న పెద్దగా ఉంటే వచ్చి గొడవ చేసేది, మనది ఇంక పెద్దగా చెయ్యండి అని.
తర్వత బాగా తయారయ్యి, బతుకమ్మ తీసుకొని ఇంట్లో అందరం వెళ్ళేవాళ్ళం. అమ్మ వాళ్ళేమో మమ్మల్ని ఆడమంటే మేము మాత్రం, అన్ని వీధులు తిరిగి ఎలా ఉన్నయ్ అని చూసొచ్చేవాళ్ళం.
ఆ రోజు చీకటి పడే వరకు ఆడి, ఊరి చివర ఉన్న చెరువులో అన్ని బతుకమ్మలు వేసి వస్తే, మా పే....ద్ద పండగ అయిపోయినట్టే..మళ్ళీ సంవత్సరం వరకు.

ఈ సంవత్సరం మా ఇంట్లో బతుకమ్మ... ఇప్పుడు మా అమ్మ  హయాం కొచ్చింది కాబట్టి సైజ్ చిన్నగా అయ్యింది కొంచెం.

Monday, September 30, 2013

ఆంధ్ర-తెలంగాణ భాష

ఇప్పుడంతా ఆంధ్ర-తెలంగాణానే హాట్ టాపిక్ కదా. కాని నేనేం తెలంగాణానో, సమైక్యాంధ్ర ఉద్యమం గురించో చెప్పట్లేదులెండి.
ఆంధ్ర-తెలంగాణ వాళ్ళు వాడే భాష వల్ల జరిగిన కొన్ని చిన్న విషయాలు.
మనం ఎవరన్నా వేరే భాష వాళ్ళతో, కొత్త భాషలో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అర్థం కాకపోతే ఆ భాష మనకి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి అడిగి confirm చేసుకుంటాం. కాని తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే మాట్లాడుకుంటే ఎలాగూ మనకి తెల్సిన భాషే అని, మనకు వచ్చినట్టూ అర్థం చేసుకుంటామేమో.
ఇదంతా ఇప్పుడెందుకంటే,
మా ఫ్రెండ్స్ ఇద్దరి వల్ల ఒకసారి జరిగిన కామెడి గుర్తొచ్చింది. మా ఫ్రెండ్స్ లో ఒకతను ఏదో పని చేసుకుంటూ ఇది కాస్త చిల్లు పెట్టరా అని చేతిలో ఉన్న కొత్త ointment పక్కనున్నతనికి ఇచ్చాడట.
ఎంతసేపటికి తిరిగి తెచ్చివ్వకపోతే, చిల్లు పెట్టడానికి ఇంతసేపేంటా అని, అతన్ని పిలిచి ఏదిరా ointment అంటే, fridgeలో ఉంది అన్నాడు. అదేంటి ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టావంటే, నువ్వే కదా chill పెట్టమన్నావ్, అందుకే తీసుకెల్లి fridgeలో పెట్టా అన్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే అతనికి చిల్లు అంటే hole చెయ్యాలని తెలియదు. అసలు అలా ఎలా అనుకున్నావ్ చిల్లు అంటే తెలియకపోయినా fridgeలో పెట్టాలన్నఆలోచన ఎలా వచ్చింది అంటే, దాని మీద keep in cool place అని రాసి ఉంది అందుకే chill గా పెట్టమన్నావేమో అనుకున్నా అన్నాడు :).


ఇలాంటిదే ఇంకోటి, నేను ఇంటర్ కి హాస్టల్‌లో చేరాను. ఒకరోజు ప్రొద్దున్నే లేచి రెడీ అయ్యిstudy hours కి వెళ్తున్నాము. త్వరత్వరగా బుక్స్ తీస్కొని పరిగెడుతున్నా.  లాస్ట్‌లో నేనే ఉన్నాను. ఇంతలోకి మా వార్డెన్ నా ముందు నుండి కోపంగా అరుస్తుంది. "ట్యాప్ కట్టేసి రా" అని. నకు అర్థం కాలేదు, ఎవర్నో ఏదో కట్టెసి రమ్మంటుంది, నాకెందుకు అని నేను అలానే ముందుకి వెల్తున్నా. మళ్ళీ నన్నే పిలుస్తూ అమ్మాయ్, ఆ ట్యాప్ కట్టెసి రా అంది.
అసలు ఏం కట్టెయ్యాలి, ఎక్కడ కట్టెయ్యాలి, అక్కడ వెనక చూస్తే తాడు లాంటిది ఏమి కనిపించట్లేదు నాకు. ఎవరైనా ఏదన్నా కట్టు విప్పేసారా తెలీకుండా, నన్ను అంటుంది వార్డెన్ అనుకుంటూ అయోమయంగా చుస్తూ నిల్చున్నా. ఈలొపు తనే వచ్చి, ట్యాప్ ఆపేసి, ఏమ్మా వాటర్ పోతున్నాయ్ ట్యాప్ లోంచి ఆపెయ్యమంటే వినపదట్లేదా అని వెళ్ళిపోయింది. అప్పుడర్థం అయ్యింది కట్టెయ్యమంటే అర్థం ఆపెయ్యడం అని.
ఇప్పుడు తెల్సిన/వాడుతున్న చాలా తెలుగు పదాలు స్కూలింగ్ తర్వాత నేర్చుకున్నవే. అప్పుడు చాలా పదాలకి అర్థమే తెలియకపోయేది.

Friday, September 6, 2013

చిన్న ర్యాగింగ్ - కొన్ని నవ్వులు

ఎప్పుడు తలచుకున్నా పెదవుల పైన చిరునవ్వులు పూయించే చిన్న చిన్న సంఘటనలు కొన్ని ఉంటాయి. అలాగే ఆ సంఘటనకి కారణమైన వాళ్ళని ఆట పట్టించడానికి అవి ఎప్పుడు సహాయపడతాయి.
అప్పుడు మేము ఇంజనీరింగ్‌లో చేరిన మొదటి రోజులు. కాలేజ్ పక్కనే క్యాంపస్ హాస్టల్ ఉందని ఏరి కోరి చేర్పించారు నన్ను అక్కడ. కాలేజ్ హాస్టల్ కావడం వల్ల ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఉండేవాళ్ళు. అన్ని కాలేజ్‌లోలాగే మా దగ్గర్ కూడా కొంచెం ర్యాగింగ్ ఉండేది. ఒక్కో ఇయర్ స్టుండెంట్స్ ఒక్కో ఫ్లోర్‌లో ఉండేవాళ్ళు. ఇంక హాస్టల్ లో కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉండేవి. సీనియర్స్ ఎక్కడ కనిపించినా గుడ్ మార్నింగ్,గుడ్ ఈవినింగ్  అని    విష్ చెయ్యడం అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది. విష్ చెయ్యకపోతే respect ఇవ్వనట్టన్నమాట. మెస్ లో వాళ్ళ టేబుల్స్ పైన కూర్చోకూడదు, పెట్టుకునే అప్పుడు వాళ్ళొస్తే వాళ్ళు పెట్టుకునేందుకు జరిగి చోటివ్వాలి, అక్కడ ఉన్న  డొక్కు T.V రిమోట్ సీనియర్స్ ఎవరూ లేనప్పుడు మాత్రమే మేము తీసుకోవచ్చు ఇలాంటి undefined రూల్స్ చాలానే ఉండేవి.
అలా ఆ రూల్స్ లో మాకు గుర్తున్నవి పాటిస్తూ,కొన్ని గుర్తు లేనట్టు నటిస్తూ, ఎక్కువగా మా ఫ్లోర్ నుండి బయటికి వెళ్ళకుండా గడుపుతూ ఉండగా, సడెన్‌గా ఒకరోజు "మీ జూనియర్స్ డిసిప్లిన్  తప్పుతున్నారు, వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ పైనే ఉందని మర్చిపోయారా" అని మా సెకండ్ ఇయర్ వాళ్ళ అందరికి మూకుమ్మడిగా కలొచ్చినట్టుంది.
ఇంకేముంది ఒక రోజు రాత్రి డిన్నర్ చేసాక వాళ్ళ ఫ్లోర్ కి రమ్మని మా అందరికి పిలుపొచ్చింది. మేం 20-23 మందిమి ఉండేవాళ్ళం.మేం వెళ్ళే సరికి వాళ్ళందరు కుర్చోవడానికి సెట్ చేసుకొని మమ్మల్ని అలా నిల్చోపెట్టి ఇంక స్టార్ట్  చేసారు. మాకు సరిగ్గా respect ఇవ్వట్లేదు, కనిపిస్తే విష్ చెయ్యట్లేదు. పొగరు పెరిగింది, మొన్న మెస్‌లో ఇలా చేసారు అలా చేసారు అని చేసినవీ, చెయ్యనివీ కలిపి చెప్పి ఓ గంట క్లాస్ తీసుకొని మా కళ్ళు తెరిపించారు. తర్వాత ఒక్కొక్కరిని పట్టుకొని ఇంటర్యూ   ఇంటర్వ్యూ చెయ్యడం మొదలుపెట్టారు.అందరికీ ఒకటే ప్రశ్న. అదే సింపుల్ అండ్ కాంప్లికేటెడ్ question, ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళినా సమాధానం  చెప్పక తప్పని ప్రశ్న  మన గురించి మనం చెప్పుకోవాలట. ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నారు. చెప్తుంటే మధ్యలో ఆపి తప్పులు తీసి ఎదో ఒకటి అని మళ్ళీ  మొదటి నుండి చెప్పిస్తున్నారు.
మొత్తం తెలుగులోనే చెప్పాలి, మధ్యలో ఒక్క ఇంగ్లీష్ పదం వచ్చినా మళ్ళీ మొదటి నుండి చెప్పాలి.
నా పేరు గీత..
మా నాన్న పేరు రంగా రావు.
ఆగు మీ నాన్న పేరుని  అలాగేనా చెప్పేది   గౌరవం లేకుండా, మళ్ళీ చెప్పు
నా పేరు గీత..
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ పేరు జానకి.
అంటే నాన్నకి గౌరవం ఇస్తావు కాని అమ్మ కి ఇవ్వవాడా, మళ్ళీ చెప్పు
నా పేరు గీత..
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.

ఇలా చెప్తున్నారు ఒక్కొక్కరు.
అప్పటికే మేం వచ్చి 3,4 గంటలు అయ్యింది,వాళ్ళు అనే మాటలకి, ఆ సీరియస్ మొహాలని చూసి మాలో సగం మంది ఏడుస్తున్నారు. ఇంకా రాత్రి చాలా లేట్ అవడం,ఏడ్చిన్న వాళ్ళని చూసి పాపం  అనిపించిందో అప్పటికే చెప్పిన వాళ్లని వెళ్ళిపొమ్మన్నారు. తర్వాత ఒక్కొక్కరితో చెప్పించేసి పంపిస్తున్నారు.ఇంకా లాస్ట్‌లో  నేను, అమ్ము మిగిలాం.  నాది కూడా చెప్పడం అయిపోయింది. నన్ను కూడా పంపించేస్తే తనొక్కతే ఉండాలి అని టెన్షన్ పడుతూ బిక్క మొహం వేసుకొని నిల్చుంది తను.ఇంకాసేపుంటే ఏడుపు తన్నుకొని బయటికి వచ్చేలాగ ఉంది తన ఫేస్.
మనసులో తర్వాత తను ఎలా చెప్పాలో రిపీట్ చేసుకుంటూ ఉంది.
నా పేరు అమల
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.
మా నాన్న రంగా రావు గారు .
మా అమ్మ జానకి గారు.
నా పేరు అమల.
....
....
తనది కూడా అయిపోయాక ఇద్దరు కలిసి వెళ్దురు కాని అని నన్ను ఉండమన్నారు అక్కడే.
నెక్స్ట్ అమల..చెప్పు
నా పేరు అమల గారు 
మా నాన్న రంగా రావు గారు .
ఏంటి మళ్ళీ చెప్పు
నా పేరు అమల గారు 
మళ్ళీ ...
నా పేరు అమల గారు 
అప్పటి దాకా సీరియస్ గా ఉన్న వాళ్ళు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాక కాని అర్థం కాలేదు తనకి ఏం చెప్పిందో..
Google Image

నాకు లోపలి నుండి నవ్వొస్తుంది, ఇప్పుడు నవ్వితే మళ్ళీ ఇంకో అరగంట క్లాస్ పడుతుందని   అలానే బిగపట్టుకొని నిల్చున్న. తర్వాత ఏదో కానిచ్చేసి వచ్చెసాం.
ఆ సీన్‌లో తన టెన్షన్ మొహం, సిన్సియర్‌గా తన పేరు వెనక గారు అని అన్ని సార్లు చెప్పడం కొన్ని రోజుల వరకి తనని ఏడిపించడానికి మంచి టాపిక్ మాకు.
ఆ తర్వాత ఎప్పుడు తను కనిపించినా అమల అని ఎవరు పిలవలేదు , అప్పటినుండి తనపేరు ఇంక అమల గారు.
తర్వాత తర్వాత  ఆ సీనియర్సే మాకు మంచి  ఫ్రెండ్స్ అయ్యారు, తనని అమల గారు అని పిలవడం మాత్రం మానలేదు ఎవ్వరు.   

Thursday, August 22, 2013

నీలు - అమ్ము

ట్రింగ్ ట్రింగ్..
నేను:  "హలో నీలు.."
హాయ్
"నీలూ..నీకో విషయం చెప్పాలి"
చెప్పవే.
"అది చెప్దామనే చేసా.."
చెప్పు బేబీ త్వరగా
"నువ్వు మన ఫ్రెండ్స్ ఎవ్వరికీ చెప్పొద్దు మరి"
చెప్పను..
"నిజ్జంగా!! అస్సలు చెప్పొద్దు"
 ఎహె చెప్పను అని చెప్పాగా
"జోక్ కాదు, నువ్వు నిజ్జంగా చెప్పను అంటేనే చెప్తాను నీకు"
నిజంగా చెప్పను అను..
"నీ మీద నమ్మకంతో నీకొక్కదానికే  చెప్తున్నా"
చెప్పాను కదా, ఎవ్వరికీ చెప్పను మనవాళ్ళకి, సరేనా ఇప్పుడు చెప్పు.
"ఎవరికన్నా చెప్పావో నేను చాలా ఫీల్ అవుతా, మన ఫ్రెండ్స్ ఏడిపిస్తారు చెప్తే నన్ను. నువ్వు కూడా నవ్వొద్దు "
అబ్బా చెప్పవే ఇంక, చెప్పను అని అన్నాగా
"అది.. మరి.."
ఆ..
"నేను ఒకటి చూపిస్తా నీకు, చూసి ఎలా ఉందో చెప్పు "
ఏంటది
"నేను ఒక బ్లాగ్ రాస్తున్నా ఈ మధ్య"
బ్లాగా?? దేనికి
"దేనికి అంటే ఊరికినే"
అంటే ఏం రాస్తావ్, ఎందుకు రాస్తున్నావే
"ఏం అంటే ఏదో ఒకటి,నాకు అనిపించిన సోది అంతా"
ఏం చేస్తావ్ రా..సి ఏమొస్తుంది
"అంటే FB లానే ఇక్కడ కూడా రాసి పోస్ట్ చేయొచ్చు, లింక్ పంపిస్తా నువ్వు కూడా చూడు, మళ్ళీ చెప్తున్నా ఎవ్వరికి చెప్పకు"
అబ్బ చెప్పన్లే.పంపించు చూస్తా
....................
................................................
హహహ.. ఒక 5 మినట్స్ నవ్వింది
"సరే చదువు ఇప్పుడు, ఎలా ఉందో చెప్పు"
సరే చదివి ఫోన్ చేస్తా మళ్ళీ
...
....
ఇదంతా నువ్వే రాసావా.. బావుందే బాగా రాసావ్  నిజ్జంగా. అమ్ముకి కూడా చెప్దాం. అది ఎంజాయ్ చేస్తుంది తప్పకుండా.  ..

పాపం నాకొసం తెలుగు సరిగ్గా చదవటం రాకపోయినా గంట సేపు కూర్చుని ఒక్కొక్క పోస్ట్ చదివి, రోజు నన్ను నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడు రాస్తావ్   అని అడిగే నీలు కి 100 times థాంక్యూ..
అమ్ము గురించైతే చెప్పక్కర్లేదు, ఏమి చేసినా చెయ్యకపోయినా  నన్ను తెగ మెచ్చుకొని ఎంకరేజ్ చేసే తనకి 1000 థాంక్యూ లు.....