Showing posts with label నా గురించి. Show all posts
Showing posts with label నా గురించి. Show all posts

Friday, February 3, 2017

కోర్ట్‌కెందుకెళ్లాల్సి వచ్చిందంటే.. 1

నాకు ఫైన్ ఎలా పడిందో మొన్న చెప్పా కదా..ఎప్పుడైనా కాప్ ఫైన్ ఇచ్చాక దాని పైన ఫైన్ కట్టాలనుకుంటే ఎలా కట్టొచ్చు, ఒకవేళ అది పే చెయ్యడానికి మనం ఒప్పుకోకపోతే ఆ విషయం తెలియజెయ్యడానికి వివరాలు ఉంటాయి.  ఫైన్ కట్టము అనుకుంటే కోర్ట్ కి రమ్మని ఒక డేట్ ఇస్తారు, ఆరోజు వెలితే వాళ్ల నిర్ణయం చెప్తారు, మొత్తం ఫైన్ కట్టాలా లేక ఏమన్నా తగ్గిస్తారా అన్నది.
సరే నేను కోర్ట్‌కి రావాలనుకుంటున్నాను అని టిక్ చేసాను ఆ వెబ్‌సైట్ లో.
ఒక 2 వారాలకి, ఫలానా రోజు కోర్ట్‌కి రమ్మని మెయిల్ వచ్చింది.
ఆరోజు కోర్ట్ కి వెళ్లాల్సింది మధ్యాహ్నం టైం కాబట్టి, ప్రొద్దున ఇంట్లోంచి పని చేసి, మధ్యాహ్నం లీవ్ పెట్టా, అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా.ఒక్కదాన్నే వెళ్తున్నా కదా అని ఇచ్చిన టైం కన్నా కొంచెం ముందు వెళ్లా, అక్కడ ఎలా ఉంటదో, కరెక్ట్‌గా ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొవడానికి టైం పడుతుందేమో అని. లోపలికి వెళ్లగానే రెసెప్షన్ ప్లేస్ లో బోర్డ్ పెట్టి ఉంది. ఆరోజు ఎవరెవరికి టైం ఇచ్చారు, ఏ టైం కి అని. నా పేరు అందులో ఉంది అని చూసుకొని అక్కడ ఉన్న అతన్ని అడిగా ఎటు వైపు వెళ్లాలి, వెళ్లాక ఏం చేయాలి, ఇలా ఈ టైం కి నాకు హియరింగ్ ఉంది అని. అతను ఎటువైపు వెళ్లాలో చూపించి, లోపల కోర్ట్ హాల్లో వెళ్లి కూర్చుంటే టైం ప్రకారం నా పేరు పిలుస్తారు అని చెప్పాడు. కోర్ట్ హాల్లో చిన్న స్టేజ్ లాంటి పైన్ జడ్జ్ కూర్చున్నాడు. అతని పక్కనే ఏవో పేపర్స్ చూపిస్తూ ఒకామె  ఉంది అసిస్టంట్ లాగ.
స్టేజ్ కింద హాల్ కి అటు పక్క ఇటు పక్క ఒక్కో టేబుల్, దాని దగ్గర ఒకరు కూర్చుని ఉన్నారు.
మిగతా హాల్ అంతా ఒకదాని వెనక ఒకటి బెంచ్ లాగా సీట్స్ ఉన్నాయి.
అమ్మో...ఇప్పుడు నా పేరు పిలిచి అక్కడ నిల్చోబెట్టి, ఏం చేసాను, ఎందుకు not guilty అని అప్లై చేసాను అని అందరి ముందు చెప్పమంటారేమో...ఏం చెప్పాలి..ఎలా చెప్పాలి బాబోయ్..అనుకుంటూ వెళ్లి ఒక బెంచ్ లో కూర్చున్నా. ఎక్కువ జనం ఏం లేరు. ఒక 15, 20 మంది ఉన్నారేమో. ఈ లోపు ఆ సైడ్ టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్లు ఒక్కొక్క పేరు పిలుస్తున్నారు.తమ పేరు పిలిచిన వాళ్లు వెళ్లి అక్కడ నిల్చుని వాళ్లతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. so మొత్తానికి అందరికి వినబడేలాగా మాట్లాడే పని లేదన్నమాట. అక్కడే సగం టెన్షన్ పోయింది నాకు. పోన్లే మనం ఏం మాట్లాడినా ఎవరికి తెలియదు :). ఇలా అలోచిస్తుండగానే నా పేరు పిలిచాడు ఒక సైడ్ టేబుల్ అతను.
అతని దగ్గరికి వెళ్లగానే నా కేస్ పేపర్స్ తీసి చదివి, సో నువ్వు ట్రైన్ ఆగినప్పుడు వెనకనుండి ట్రాక్స్ దాటావన్న మాట, అలా చెయ్యడం చాలా డేంజర్ కదా, ఇంకోసారి అలా చెయ్యకు, నీ ఫైన్ క్యాన్సల్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ పేపర్ లో అది రాసుకొని, నువ్వెళ్లొచ్చు అన్నాడు.సరే ఇంకెప్పుడు అలా చెయ్యను అని చెప్పి,  అంతే అయిపోయిందా..అనుకొని బయటికి వచ్చేసా. నిజంగానే మళ్లీ అలా ఎప్పుడూ దాటలేదు కూడా..

Wednesday, February 1, 2017

కోర్ట్‌కెందుకెళ్లాల్సి వచ్చిందంటే..

Google Image

నేను రోజు ట్రైన్‌లో వెళ్తాను కదా న్యూయార్క్ లో ఉన్నమా ఆఫీస్ కి, ట్రైన్ ఎక్కాలంటే ఇంటి దగ్గర నుండి ఒక 10 నిమిషాలు నడవాలి స్టేషన్‌కి. మా ఇంటి దగ్గరిది చాలా చిన్న స్టేషన్, అంటే ఒకటే ప్లాట్‌ఫాం. అది కూడా మొత్తం ట్రైన్ పొడవు కన్నా చిన్నగా ఉంటది.నేను ట్రైన్ ఎక్కాలంటే రోడ్ దాటి అవతలి పక్క ఉన్న ప్లాట్‌ఫాం కి వెళ్ళి ఎక్కాలి. ట్రైన్ వచ్చే ముందు రోడ్ మీద ఉన్న గేట్ పడిపోతుంది. గేట్ పడ్డాక కార్స్ మాత్రమే కాకుండా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా ఆగిపోవాలి. నేను రోజు టైం చూసుకొని హడావిడి పడుతూ ఐనా సరే ఒక్క నిమిషం అన్నా గేట్ పడేముందు అక్కడికి చేరుకుంటా. అప్పుడప్పుడు కొందరు గేట్ పడ్డాక ట్రైన్ ముందు నుండి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు.
ఇలాగే ఒకరోజు నాకుకొంచెం లేట్ అయింది. అప్పటికీ 10 నిమిషాల నడకే అయినా మా ఆయన డ్రాప్ చేస్తా అని వచ్చాడు. కాని కరెక్ట్‌గా అక్కడికి చేరుకునే సరికే గేట్ పడుతూ ఉంది. ట్రైన్ వచ్చింది. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే అయితే మళ్ళీ ఇంకో 40 నిమిషాల వరకు ఇక్కడ నుండి ట్రైన్ ఉండదు కాబట్టి దగ్గర్లో ఉన్న ఇంకో స్టేషన్ కి వెళ్ళి వెరే ట్రైన్ తీసుకున్నాను, కాని అక్కడికి డ్రాప్ చేసి రావడం తనకి లేట్ అయిపొతుంది.
ఈలోపు ఒకతను ఆగి ఉన్న ట్రైన్ వెనక నుండి గేట్ దాటి ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాడు, సరే నేను కూడా అలానే చేద్దాం, మళ్ళీ ఇది మిస్ ఐతే లేట్ అవుతది అనుకున్నా. మా ఆయన కూడా రోజూ చూస్తూనే ఉంటా, ఎవరో ఒకరు అలా క్రాస్ చేస్తారు అని ఎంకరేజ్ చేసే సరికి ఆ దాటుతున్న ఇంకొకతనితో పాటు నేను కూడా వెళ్లిపోయా. సరిగ్గా గేట్ క్రాస్ చేసి అటు వెళ్లే సరికి ఒక కాప్ నిల్చున్నాడు.
మా ఇద్దరి దగ్గరికి వచ్చి, ఈ ట్రైన్ మీరు అందుకోలేరు, ఆగండి అని ఆపేసి, మా ID కార్డ్స్ అడిగాడు. ID అంటే ఏముంది నా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసా. అతను అవి తీసుకొని, మాతో అలా గేట్ పడ్డాక దాటటం డేంజర్ కదా అని, మా ఇద్దరి  కార్డ్స్ తీసుకొని కార్లోకి వెళ్లి చెక్ చేస్తున్నాడు. చేస్తున్నాడు చేస్తున్నాడు..ఎంతకీ రాడు.
ఈలోపు అతను నేను మాటలు కలిపాం.నేను చెప్పా..ఈరోజే ఫస్ట్ టైం ఇలా గేట్ పడ్డాక ట్రాక్ దాటడం అని. అతను మాత్రం రోజూ అలాగే చేస్తాడట. తన వైఫ్ డ్రాప్ చేస్తుందట తనని. so ట్రైన్ వచ్చేవరకి బయట చలి లో ఎందుకని అలా కార్లోనే వెయిట్ చేసి అప్పుడు ఇలాగే ట్రైన్ ఆగాక వెనకనుండి క్రాస్ చేస్తాడట. ఒక్కరోజు కూడా ఎవరు ఆపలేదు, పాపం ఈరోజు నాతో ఉన్నందుకు అతనికి కూడా తగిలింది.
సరే 30 నిమిషాలు అయిపోయింది, ఇంకా రాడే ఆ కాప్.అంతసేపు ఏం చేస్తున్నాడో. 
ఇంక నెక్స్ట్ ట్రైన్ వచ్చే టైం కూడా అయింది. అది కూడా మిస్ అయితే ఇంక ఆఫీస్ కి వెళ్లి వేస్ట్, లంచ్ టైం కి చేరుకుంటా.
చూస్తుండగానే ఆ ట్రైన్ రానే వచ్చింది. అప్పుడు మెల్లగా వచ్చి అతను ట్రైన్ దగ్గరికి వెళ్లి TC తో ఒక 5 నిమిషాలు ఆపమని చెప్పి(అది చిన్న స్టేషన్ కాబట్టి ప్రాబ్లం ఎమి ఉండదు) మా దగ్గరికి వచ్చి చెరొక 200$ ఫైన్ టికెట్ చేతిలో పెట్టి ట్రైన్ ఎక్కించాడు :(.
ఇది అన్యాయం అనుకున్నాం.
ఆఫీస్‌కి వెళ్లి ట్రైన్ డిపార్ట్మెంట్  సైట్ లో చూస్తే పాదాచారులకి 50$ కన్నా ఎక్కువ ఫైన్ వెయ్యకూడదు అని ఉంది. అది కూడా ట్రైన్ వస్తున్నప్పుడు దాని ముందు నుండి దాటితే maximum of 50$ ఫైన్ అట.
తర్వాత....రేపు చెప్తా..                                          

Thursday, July 16, 2015

బుక్ కేక్


కేక్ బావుంది కదా..
అదేంటి రాత్రి 12 కి కేక్ కట్ చేయించకుండా ఇలా బుక్స్ తెచ్చి గిఫ్ట్ ఇస్తున్నాడేమో మా ఆయన అనుకున్నా.తెస్తే తెచ్చాడు కాని అవి ఏం పుస్తకాలో, చదవగలిగేవే తెచ్చాడా అనుకున్నా ఒక fraction of second లోనే. దగ్గరికి వచ్చాక అర్థం అయ్యింది అది కేక్ అని. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూ ఉంటావ్..అసలేం చదువుతావ్ అంతసేపు అని అంటూ ఉండే తను నా birthday కి తన ఫ్రెండ్‌తో చేయించిన కేక్ ఇది.

నా కన్నా బాగా వంట చేస్తానని ఫీలింగ్ తనకి, అందుకే Cook better than your husband by Vahchef చదివి వంట నేర్చుకోవాలట :(.
మా ఆయనకి నమ్మకం vahchef చెప్పినట్టు follow ఐతే  అన్ని వంటలు చెయ్యొచ్చట.
తర్వాత vahchef కి మెయిల్ చేసాడు ఈ pic పంపి that i used your name అని.
see what vahchef did


All credit goes to Sreedevi..who made this beautiful cakeand made my Bday special and to my husband for his thought and captions :)

Friday, March 27, 2015

ట్రైన్‌లో మర్చిపోయిన లాప్‌టాప్

ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లాలంటే అటు 2 గంటలు ఇటు 2 గంటలు ప్రయాణం చేస్తా కాబట్టి ప్రతీ Friday Work From Home చేస్తాను.అందుకని గురువారం సాయంత్రం వచ్చేఅప్పుడు office laptop నాతో పాటు తెచ్చేసుకుంటాను.  ఆరోజు laptop తీసుకొస్తున్నా. ఇంటికెళ్లాలంటే 2 ట్రైన్స్ మారాలి. subwayలో ఎలాగూ bag కింద పెట్టడానికి కూడా స్థలం ఉండదు కాబట్టి చచ్చినట్టు మోస్తూ నిల్చోవాలి. తర్వాత commuter railలో కూర్చోవడానికి ఉంటుంది కాని సీట్స్ అన్ని నిండిపోతాయి కాబట్టి హ్యాండ్‌బ్యాగ్ నాతోనే ఉంచుకొని laptop bag మాత్రం పైన షెల్ఫ్ లో పెట్టేసి, దిగేటప్పుడు తీసుకొంటాను.
ఆరోజూ అలానే చేసాను..కాని పైన పెట్టేవరకే.. దిగే అప్పుడు ఏం ఆలోచిస్తున్నానో ఏంటో హాయిగా చేతులు ఊపుకుంటూ handbag ఒక్కటి వేసుకొని దిగిపోయా.ట్రైన్ స్టేషన్ నుండి pick చేసుకోవడానికి మా ఆయన వచ్చాడు, వెళ్లి కార్లో కూర్చొని తన బ్యాగ్ చూసాక అప్పుడు గుర్తొచ్చింది.. నా laptop మర్చిపోయా అని. చూస్తే ఏముంది  ట్రైన్ వెళ్లిపోయింది అప్పటికే. అసలే office laptop. miss ఐతే కష్టం.ఆ ట్రైన్లో చివరి స్టాప్ కి కాల్ చేసి రిపోర్ట్ చేద్దామని ట్రై చేసా కాని, after business hours ఎవరు రెస్పాండ్ అవలేదు.
అయితే దురదృష్టం లో అదృష్టం అన్నట్టు అది సింగిల్ ట్రాక్, ఈ ట్రైన్ ఇంకో 4 స్టాప్స్ వెళ్ళి మళ్లీ అదే ట్రైన్ వెనక్కి వస్తుంది. టైం చూస్తే ఇంకొక గంటలో రిటర్న్ ట్రైన్ ఉంది.అంతసేపు టెన్షన్ పడుతూ అక్కడే కూర్చొని వెయిట్ చేసాం. రిటర్న్ ట్రైన్ వచ్చాక దాంట్లో ఎక్కేసి టికెట్ కలెక్టర్ ని అడిగి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో తెల్సుకొని అక్కడకి వెల్దాం అనుకొన్నాం.
ఇంతలో ట్రైన్ వచ్చింది. నేను ఈ కంపార్ట్మెంట్ లో ఎక్కానో గుర్తుంది నాకు, రోజూ ఒకటే  కంపార్ట్మెంట్లో చూసుకొని ఎక్కుతాను. అందుకని ట్రైన్ ఆగేలోపు సరిగ్గా ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎక్కాను. లోపలికి వెళ్లి పైన షెల్ఫ్ లో చూడగానే ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది నా బ్యాగ్. తొందరగా వెళ్లి అది తీసుకొని టికెట్ కలెక్టర్ అటు చివర డోర్ దగ్గర ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఇలా బ్యాగ్ మర్చిపోయా తీసుకొవడానికే ట్రైన్ ఎక్కా ఒక్క నిమిషం ఆపండి దిగిపోతా అని చెప్పా. అప్పటికి ట్రైన్ డోర్స్ ఇంకా మూయలేదు కాబట్టి సరే అని డోర్ దగ్గర నిల్చున్నాడు, నేను త్వరగా దిగిపోయా అప్పటి దాకా పడిన టెన్షన్ అంతా మర్చిపోయి హాయిగా..

కాని అక్కడితోనే అయిపోలేదు, ఆరోజు నుండి ఎప్పుడు laptop తెచ్చినా చంకలో పిల్లని చూసుకున్నట్టు  నా పక్కనే సీట్లో పెట్టుకొని కూర్చోవడమో, ఎవరైనా వచ్చి అక్కడ కూర్చుంటాం తీసెయ్యమంటే తీసి కాళ్ల దగ్గర పెట్టుకోవడమో చేస్తుండేదాన్ని ఇబ్బంది అయినా సరే అని. అలా కొన్ని రోజులు బానే నడిచింది. laptop తీసుకురాని రోజు కూడా ఈరోజు తేలేదు కదా అని ఒకటికి రెండు సార్లు అనుకొని దిగేదాన్ని.
ఒక్కోసారి కాళ్ల దగ్గర పెట్టుకుంటే అది అటు ఇటూ పడిపోవడం, నా పక్కన కూర్చున్న వాళ్ల స్టాప్ వస్తే నేను లేచి దారి ఇవ్వడానికి ఇబ్బంది అయ్యేది. సరే ఏమి కాదు ఊరికే అలా మర్చిపోతామా ఏంటి ఘాఠ్ఠిగా...గుర్తుంచుకుందాం అని పైన పెట్టడం మొదలు పెట్టా మళ్లీ. గుర్తుంచుకొని బానే తెచ్చుకునేదాన్ని.ఆరోజు మళ్ళీ గురువారం. ఇంటికొచ్చి తాళం తీసి లోపలికి అడుగు పెట్టి  " హే...రేపు Friday ఆఫీస్ వెళ్లక్కర్లేదు..." అన్నా, అప్పుడన్నాడు మా ఆయన laptop ఏది అని. అప్పటిదాక గుర్తే లేదు తీసుకొచి ట్రైన్లో పెట్టి మర్చిపోయా అని. లాస్ట్‌టైమే బెటర్ కనీసం దిగగానే గుర్తొచ్చింది. ఈసారి భయం అవలేదు. కోపం వచ్చింది నా మీద నాకే.ఒక తప్పు ఒకసరి చెయ్యొచ్చు అదే తప్పు మళ్ళీ.. అది కూడా 3 నెలల్లోనే..:(
ఇంకేముంది మళ్లీ స్టేషన్‌కి వెళ్లాం, ఎలాగూ ప్రాసెస్ తెలిసిందే కాబట్టి ట్రైన్ టైం అయ్యేవరకు ఇంట్లోనే ఉండి సరిగ్గ టైం కి వెళ్లాం, సేం అలానే పోయిన సారి లాగనే ఆగగానే వెళ్ళి ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు తీసుకొని దిగిపోయా.
అప్పటి నుండి laptop పైన పెట్టినప్పుడల్లా,ఇప్పుడు వింటర్ లో వేసుకునే పెద్ద జాకెట్ తీసెసి బ్యాగ్ మీదనే పెడుతున్నా, అదైతే మర్చిపోయి దిగే చాన్సే లేదు ఈ చలికి. జాకెట్ తీసుకునే అప్పుడు ఇది కూడా గుర్తుంటుంది. ఈ టెక్నిక్ ఇప్పటివరకు బానే వర్క్ అవుట్ అయ్యింది. సమ్మర్ వస్తుంది కదా ఇంకేదన్నా ఐడియా ఆలోంచించాలి.  :(:(:(..

Friday, March 21, 2014

ఎంతెంత దూరం!!

ఎంతెంత దూరం వెల్లొచ్చా..
ఎంత దూరం వెల్లొచ్చావు...
చాలా రోజుల తర్వాత office వచ్చా..
ఎక్కడికెళ్ళావమ్మా ఇన్ని డేస్...
హాయిగా india ఎల్లొచ్చాగా..
google Image
(Emirates లో వెల్లా అందుకే emirates image)
అవునా..ఎన్ని రోజులు వెళ్లావేంటి..
40 రోజులు..40 రోజులే...
అంతకన్నా ఎక్కువిస్తారేంటి లీవ్ నీకు, అప్పటికి మీ మేనేజర్ కి ఏదో స్టోరీ చెప్పబట్టి కాని లేకపోతే 3 weeks కంటే ఎక్కువ లీవ్ ఇచ్చాడా ఎవరి కన్నా..
అంతేలే...ఏం చేస్తాం..
సరే ఏం చేసావ్ ఇండియాలో...
ఏం చేసా అంటే చాలా చేసినట్టు, full తిరిగినట్టు అనిపిస్తుంది కాని చెప్పడానికి పెద్దగా ఏమి చెయ్యలేదు. చుట్టాలు, ఫ్రెండ్స్ అందర్నీ కలిసా ఈసారి. last time కన్నా కొంచెం ఎక్కువ టైం ఉన్న కదా. నా close ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి 2 డేస్ ఉన్నాను. ఇంకా happy thing ఈసారి మా చెల్లి నేను ఉన్నన్ని డేస్ నాతోనే ఉంది ఎక్కడికెళ్ళినా.నేను వస్తున్నా అని 15 రోజులు లీవ్ పెడతాను అంది కాని అసలు వెళ్ళనే లేదు. తర్వతా ఏదో లాగా మేనేజ్ చేసుకుంటుందిలే అని నేను కూడా ఉండిపొమ్మన్నా..
కావాల్సినవన్నీ ఇంట్లో చేయించుకొని తిన్నా..shopping చేసా..తిరుపతి వెల్లొచ్చాం..ఇంకా అమ్మమ్మ వాళ్ళూరికి వెళ్ళొచ్చా
అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చావ్ సరే..వస్తూ మాకేం తెచ్చావ్ మరి..
స్వీట్సూ, పచ్చళ్ళూ ఇంకీ జంక్ ఫుడ్ తెచ్చా,,కావల్సినన్ని తిను..
వచ్చాక ఏం చేసావ్ మరి..
hmm.. అదెందుకు అడుగుతావ్‌లే..
India లో హాయిగా jackets, coats లేకుండా తిరిగానా, ఇక్కడ flight దిగగానే చ్.చలి. దిగగానే అందరు ఒక్కటే మాట, ఎంత bad winter తప్పించుకున్నావ్  అని.  ఇంటికొచ్చి నా కార్ start చేస్తే అది గుర్..గుర్.. అంటుంది తప్ప start అవ్వట్లేదు.ఈ చలికి engine ఎప్పుడో చచ్చి ఉంటది.
తెల్సిన వాళ్ళ దగ్గర jump cable అడుక్కొచ్చి స్టార్ట్ చేద్దాం  అని try చేస్తే మా ఫేస్‌లకి అది ఎలా చెయ్యాలో తెలీలేదు. మళ్ళీ మా roommate వాళ్ల ఫ్రెండ్ కి కాల్ చేస్తే అతనొచ్చి start చేసి వెళ్ళాడు. ఇంకేముంది ఇంక రోజూ రొటీన్ office మళ్ళీ.. :(:(

Thursday, September 26, 2013

నేను - నా సినిమా కష్టాలు

సినిమా కష్టాలు అంటే నాకు సినిమాలో లాంటి కష్టాలు ఉన్నాయని కాదు, సినిమా వల్ల కష్టాలు లేదా సినిమా కోసం కష్టాలు.
సంతోషం ప్లస్ బాధ
ఆహ్లాదం ప్లన్ చిరాకు
రెండు కలిపి ఎప్పుడన్నా వస్తాయా..
వస్తాయి ఎప్పుడైనా tasty food తింటున్నప్పుడు పక్కనుండి nasty smell  వస్తేనో..
మనం చేసిన వంట బావుందని మనకే మిగల్చకుండా వేరేవాళ్ళు తినేస్తేనో..
కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఎవరూ చూడకపోతేనో..(కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజు నాకు ఎలా ఉన్నా హాపీగా ఉన్నట్టనిపిస్తుంది మరి)
ఇలాంటప్పుడు ఈ ఇద్దరు ఫీలింగ్స్ కలిసి వస్తారు కదా...

Google Image


ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వస్తారట. ఎందుకో తెల్సా..
ఎందుకంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసా.ఇంక దేనికి అత్తారింటికి దారేదికే.  అంత వరకు బానే ఉంది. ఇది హ్యపీ పార్ట్(hopefully). నాకు సమంత ok, పవన్ కళ్యాణ్ ఇంకా ok, త్రివిక్రం ఇంకా ఎక్కువ ok. సో హ్యపీగానే ఉంటుందనుకుంటున్నా..
ఇంక sad పార్ట్‌కొస్తే ఫస్ట్, theater లో స్క్రీన్ గురించి చెప్పాలి, తర్వాత అందులో సీట్స్ గురించి చెప్పాలి.
నాకేమో ఎంచక్కా పెద్ద స్క్రీన్‌లో సినిమా చూస్తే సంతోషంగా, కంటికి హాయిగా, కడుపు  నిండిపోయినట్టుగా అనిపిస్తుంది.
ఇప్పుడు మేము వెళ్ళే theater లో స్క్రీన్ ఎంత ఉంటుందంటే ఇంట్లో ఉండే home theater కి 4 ఇంచులు అటూ ఇటూ ఉంటుందంతే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లోపలికి అడుగు పెట్టగానే షాక్ అయ్యా ఒక రెండు నిమిషాలు. అప్పటివరకు అలాంటి డొక్కు, పిచ్చి, గలీజ్ theater ఎప్పుడు చూడలేదు. ఇండియాలో చిన్న టౌన్‌లో నేను చూసిన theaters కూడా ఇంతకన్నా బానే ఉంటాయి.ఇందులో అసలు నాకు theaterలో సినిమా చూసిన ఫీలింగే రాదు. ఏదో DVD ప్రింట్ పెద్ద T.Vలో పెట్టుకొని చూసినట్టనిపిస్తది.
మామూలుగా అయితే నాకు స్క్రీన్ open చెయ్యకముందు వెళ్ళి, adsతో సహా చూస్తేనే తృప్తిగా అనిపిస్తుంది. ఒకవేళ రీల్ పడ్డాకో, టైటిల్స్ పడుతున్నప్పుడో వెళితే ఏదో మిస్ అయిపోయినట్టనిపిస్తుంది. ఇంక సినిమా మొదలయ్యాక వెళ్తే అంతే సంగతి, మళ్ళీ ఆ మిస్ అయిన సీన్స్ చూసేవరకు( అందులో ఏమి స్టోరీ జరగకపోయినా).  అలాంటి  ఫీలింగ్ ఏది రాదు ఈ theater లో.
సరే పోని చిన్న స్క్రీన్ అయినా హాయిగా కూర్చొని చూద్దాం అంటే అదీ లేదు. కాస్త త్వరగా వెళ్ళి వెనక సీట్స్‌లో కూర్చుంటేనే సరి, లేకపోతే కొంగలా మెడ పైకెత్తి చూడాలి. సినిమా అయ్యేలొపు మెడ పట్టెయ్యడం ఖాయం. పైగా అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
పోయినసారి ఒక సినిమాకెళ్ళినప్పుడు కాస్త లేట్ అయ్యింది. వెళ్ళే అప్పటికి టైటిల్స్ పడుతున్నాయి. అందరు కూర్చున్నారు. theater  మధ్యలో వరకు నిండిపోయింది. మధ్యలో ఒక 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. వెళ్ళింది ముగ్గురం కాబట్టి అక్కడ సరిపోతాయ్  అని వెళ్ళి కూర్చున్నాం.
కూర్చుంటూ అనుకున్నాం, మధ్యలో ఏ వరస ఒక్కటి మనకొసమే అన్నట్టు వదిలేసారు, లేకపొతే ఇంకా ముందుకెళ్ళి కష్టపడాల్సొచ్చేది అని నవ్వుకుంటూ కూర్చున్నాం. వాళ్ళిద్దరు బానే కూర్చున్నారు. నేను కూర్చున్న సీట్ ఒక సైడ్ కాస్త విరిగిపోయి వంగిపోయి ఉంది.
ఈ సీట్ కొంచెం విరిగిపోయింది, అటు పక్క దాంట్లోకి వెళ్ళి కూర్చుంటా అని పక్కనున్న దానితో చెప్పి, ఆ సీట్‌లోంచి లేచి పక్కకెళ్ళి కూర్చున్నా. అన్యాయంగా ఆ సీట్ ఇంకా ఎక్కువ విరిగి ఉంది, అసలు కూర్చోడానికే రాట్లేదు. మళ్ళీ లేచి పాత సీట్లొకే వచ్చా. అసలే నాకు సినిమా మొదలయ్యాక మధ్యలో లేచి అటు ఇటూ తిరిగితే మొహమాటం, వెనక వాళ్ళు తిట్టుకుంటారేమో అని.
 సరే అని పాత సీట్లో ఒక వైపు వంగి కూర్చొని, మా వాళ్ళకి చెప్పా ఇక్కడ కష్టంగా ఉంది, ముందుకెల్దామా అని. అప్పుడే అసలు కథ మొదలవుతుందేమో మా వాళ్ళు కళ్ళప్పగించి చూస్తున్నారు, నా మాటకు సరిగ్గా రిప్లై కూడా ఇవ్వకుండా. పోని ఒక్కదాన్ని వెళ్దామా అంటే పక్కన వాళ్ళతో డిస్కస్ చెయ్యకుండా ఉండలేను సినిమా మధ్య మధ్యలో.
పైగా మెడ నొప్పి ఉంటది అక్కడ. సో మెడ నొప్పి, నడుము నొప్పిలో రెండో దానికే ఓటేసి ఇక్కడే కూర్చుని సినిమా చూసా.
హ్మ్మ్.. ఆ theaterకే ఇంకాసేపట్లో వెళ్ళబోయేది.
మరి అంత ఇష్టం లేకుండా దానికే ఎందుకు వెళ్ళాలి అంటే ఇంకా ఎక్కడ తెలుగు సినిమాలు రావు కాబట్టి. ఇదేమైనా దగ్గరా అంటే అదీ కాదు, ఈ మాత్రం మహాభాగ్యానికి గంట డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలి. మేమే గంట డ్రైవ్ వేస్ట్ అనుకుంటే, ఇక్కడికి 2,3 గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
సో.. నాకు ఈ రోజు కొంచెం వెనకాల సీట్, విరిగిపోయింది కాకుండా రావాలని ఆశిస్తూ.. 

Thursday, August 1, 2013

అతివృష్టి - అనావృష్టి

అతివృష్టి - అనావృష్టి వర్షాల గురించి కాదు, ఎండ- వేడి, మంచు- చలి. ఇండియా లో హయిగా వర్షాలు పడుతూ ఉంటే ఇక్కడేమో ఎండలతో కష్టపడుతున్నాం. ఈసారి సమ్మర్ లో ఐతే 102,103 వరకు చేరింది టెంపరేచర్. చూడండి
ఇది నిన్న సాయంత్రం 6 గంటలకు తీసింది.సాయంత్రమే  అలా ఉంటే మధ్యాహ్నం  ఎలా ఉండి ఉంటుందో.
మొన్నొకరోజు బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ కార్లో మర్చిపోయి ఒక గంట తర్వాత తీస్కెళ్దామని వచ్చాను. చూసేసరికి స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోయి warning symbol తో  మెస్సేజ్ dislpay అవుతుంది, ఏమనో తెల్సా  ఫోన్ ఓవర్ హీట్ అయ్యింది,మళ్ళీ వాడేముందు కాసేపు చల్లని ప్లేస్ లో ఉంచమని. ఇలాంటిది ఐతే ఇంతకుముందెప్పుడు చూళ్ళేదు. ఒక గంటకే అలా అయిపోతే అలానే సాయంత్రం వరకు వదిలేస్తే ఇంక పనికి రాకుండా అయిపోయేదేమో.
అలా అని పోన్లే ఎండాకాలం లో కొన్ని రోజులు కష్టపడితే పడ్డారు, చలికాలం లో వేరే చోట్లలో మంచు పడుతుంటే ఇక్కడ హాయిగా ఉండొచ్చు అనుకోవడానికి లేదు. చలికాలం  ఇక్కడ ఎలా ఉంటుందంటే
మీరే చూడండి


ఇది ఈ సంవత్సరం వింటర్ మా ఇంటి ముందు. అక్కడ రెడ్ కలర్ లో రౌండ్ చేసానే అదే నా కార్.బంపర్ తప్ప అంతా మునిగిపోయింది కదా మంచులో.ఈ ఫిబ్రవరిలో ఐతే దాదాపు ప్రతిరోజు స్నో పడింది.
మంచు పడడం ఆగిపోగానే నడవడానికి, డ్రైవ్ చెయ్యడానికి వీలుగా ఉండేలా   అపార్ట్‌మెంట్ వాళ్ళు అంతా క్లీన్ చేపిస్తారు, మంచు అంతా తీసెయ్యడానికి వీలుగా ఎవరి కార్ వాళ్ళు అక్కడి నుండి తీసి పక్కకి పెట్టాలి. ఆ క్లీన్ చేసేవాళ్ళూ మధ్యలో  అంతా చేస్తారు కాని మన కార్స్ ని ఎందుకు చేస్తారు. అందుకే అదంతా కార్ మీద నుండి తీసి క్లీన్ చెయ్యక తప్పదు.
 ఆరోజు అదంతా తీసెయ్యడానికి నాకు ఒక 2 గంటలు పట్టింది. ఆ చల్ల గాలికి కాళ్ళకి, చేతులకి ఎంత కప్పుకున్నా, స్నో లో అంతసేపు ఉండే సరికి ప్రాణం పోయినట్టైంది.
ఈ ఎండలో ఆ మంచు ని చుస్తుంటే హయిగా అనిపిస్తుంది ఒకవైపు, మరోవైపు అమ్మో!!! మళ్ళీ చలికాలం వస్తే ఆ చలిని ఎలా భరించాలి అనిపిస్తుంది.
హ్మ్... అందుకే అన్నది ఐతే అతివృష్టి లేకపోతే అనావృష్టి.

Tuesday, July 30, 2013

గన్ షూటింగ్

ఎప్పుడు షాపింగూ, రొటీన్ పనులు కాకుండా ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాం అనుకుని, దగ్గర్లో ఏమున్నాయి అని వెతుకుతూంటే గుర్తొచ్చింది, గన్ షూటింగ్ రేంజ్ ఉంది దగ్గర్లోనే, పైగా ఎప్పుడూ వెళ్ళలేదు కూడా.
షూటింగ్ రేంజ్ అంటే అక్కడ కొంత స్పేస్ తో కొన్ని లైన్స్ ఉంటాయ్. ఒక్కో లైన్లో
కావాల్సిన దూరం లో ఒక టార్గెట్ ని సెట్ చేసుకొని, గన్ తో షూట్ చెయ్యాలి. గన్ అంటే బొమ్మ గన్ కాదు, నిజ్జంగా నిజం  తుపాకినే.   అందులోకి వెళ్ళే ప్రతి మనిషికి కొంత ఛార్జ్ చేస్తారు, ఇంకా గన్ కి, బుల్లెట్స్ కి మనకి కావాలనుకున్న దాన్ని బట్టి రెంట్ తీసుకోవాలి.
సరే వెళ్దాం అని డిసైడ్ అయ్యాక, appointment తీస్కుందాం అని కాల్ చేస్తే, కేవలం members మాత్రమే reservation చేసుకోవచ్చంట. మాకు మెంబర్‌షిప్ లేదు కాబట్టి వెళ్ళి లైన్లో వెయిట్ చేస్తే అప్పుడు బుక్ చేసుకోవచ్చు అని చెప్పాడు, కావాలంటే మన సొంత గన్స్ కూడా తీస్కెళ్ళొచ్చు అంట.
అక్కడికెళ్ళాక  ఒక ఫాం నింపమని ఒక అరగంట వెయిట్ చేయించాక మా ID కార్డ్స్ తీసుకున్నాడు. చాలా గన్స్, రైఫిల్స్ చాలా రకాలవి డిస్‌ప్లే  లో పెట్టి ఉన్నాయ్. వెళ్ళనైతే వెళ్ళం కాని వాటిని చూడగానే కొంచెం భయమేసింది. చాలా మంది వాళ్ల సొంత గన్స్ అనుకుంటా బయటి నుండి తెచ్చుకుంటున్నారు, అయిపోగానే వాళ్ళతో తీస్కెళ్తున్నారు.
  ఒకసారెప్పుడో  TV లో చూసా, గన్ పేల్చితే ఆ ఫోర్స్ కి పేల్చిన వ్యక్తి వెనక్కి పడిపోయాడు. మనకి మరీ ఆ రేంజ్ లో వద్దని, వాడికి చెప్పాం, ఇదే ఫస్ట్ టైం షూటింగ్ రావడం సో కొంచెం ఈజీ   గా ఉండేది ఇవ్వమని.
మొత్తం నలుగురం వెళ్ళాం కాబట్టి 2 గన్స్ చాలనుకున్నాం. వాడు ఒక పిస్టల్ ఇంకా ఒక రైఫిల్ తీసి, వాటిని ఎలా పట్టుకోవాలో, ఏ position లో నిల్చోవాలి, ఎలా ఫైర్ చెయ్యాలి అంతా చూపించాడు.
తర్వాత బుల్లెట్స్ తీసుకొచ్చి, లోడ్ చెయ్యడమూ, రీఫిల్ చెయ్యడం చూపించాడు. అలా 2 గన్స్ రెంట్ తీస్కొని, కళ్ళకి, చెవులకి సేఫ్టీ కోసం  గ్లాసెస్, ear muffs పెట్టుకొని లోపలికి వెళ్ళాం. 
Google Image
ఏ రోడ్ మీదనో ఇంకెక్కడో ఒక సైకో వచ్చి మనల్ని గన్ తో షూట్ చేస్తే అయ్యో పాపం అనుకుంటారు కాని, ఇప్పుడు ఎవరన్నా మనల్ని కాల్చేస్తే కనీసం పాపం అని కూడా అనుకోరు అనుకున్నాం.  
లోపల కూడా ఒక ఆఫీసర్ ఉన్నాడు, డౌట్స్ వస్తే చెప్పడానికి ఇంకా ఎలా షూట్ చేస్తున్నారో చూడడానికి. 
ఇంకా ఆ గన్స్ లో ఒక్కో బుల్లెట్ మెల్లగా లోడ్ చేస్తూ, మధ్య మధ్యలో అతన్ని మళ్ళీ అడిగి  మొత్తానికి ఒక గన్ లోడ్ చేసాం, మళ్ళీ సరిగ్గా లోడ్ చెయ్యక తేడా వచ్చి అది వెనక్కి పేలిపోతే ఎలా అని( అతడు సినిమా లో లాగ). అందరు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే మేము మాత్రం అన్నిటికన్నా పెద్దగా ఉన్న టార్గెట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం దగ్గర్లో సెట్ చేస్కున్నాం.
ఇంక ఫస్ట్ బుల్లెట్ పెల్చే అప్పుడు మాత్రం నిజంగానే కొంచెం చేతులు వణికాయి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నలుగురం కలిపి గంటలో ఒక 20 కూడా కాల్చామో లేదో ( వాడు 200 బుల్లెట్స్ ఇచ్చాడు, గంటసేపు  ఉంటాం అంటే). ఇంకా చాలని చెప్పి వచ్చేసాం. 
అదీ సంగతి.. 

Friday, July 26, 2013

నా ఫస్ట్ & లాస్ట్ బస్ ప్రయాణం-2

అలా ఇక్కడ చెప్పినట్లు ఇంక ఫ్లైట్ బుక్ చేసుకుందాం కొత్త యూనివర్సిటీ కి అని రూం కి వెళ్ళాను.  వెళ్ళేముందు అక్కడ ఎవరితోనైనా మాట్లాడితే బావుంటుందేమో అని నాతో పాటు జాయిన్ అయ్యే ఇంకో అమ్మాయిని  కాంటాక్ట్ అయి కాల్ చేసాను. 
తనేమో ఎల్లుండే ఇక్కడ Student orientation, అందరు స్టూడెంట్స్  రోజు రిపోర్ట్ చెయ్యాలి అని చెప్పింది. అంతేకాదు క్లాసులకి కూడా ఆరోజే రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే క్లాస్ ఫుల్ అయిపోతే  కష్టం అంది. ఎల్లుండే అంటే నేను రేపు ఎలాగైనా బయల్దేరాలి ఇక్కడి నుండి. ఇప్పుడు ఫ్లైట్ బుక్ చెయ్యాలి, అంతకన్నా ముఖ్యం గంట దూరం లో ఉన్న ఏర్ పోర్ట్ లో డ్రాప్ చెయ్యడానికి  ఎవరినైనా అడగాలి. 
రూం లో ఉన్న సీనియర్ కి విషయం చెప్తే, ఎవరినైన కనుక్కుంటాను డ్రాప్ చేస్తారేమో అంది. సరేలే అని వెళ్ళి టికెట్ కోసం చూస్తే కళ్ళు తిరిగే అంత ఉంది రేట్. ఎలాగో నాకు నేనే నచ్చచెప్పుకోని, పర్లేదులే టికెట్ రేట్ పోతేపోయింది, ఎలాగూ అక్కడ ఫీ తక్కువ కదా.. దాంట్లో సేవ్ చేస్తున్నాం కదా అనుకొని ధైర్యం తెచ్చుకున్నా. 
కాని అసలు సమస్య ఇంకా తీరలేదు, రేపు డ్రాప్ చెయ్యడానికి ఎవరు లేరు, అక్కడ కార్ ఉన్నవాళ్ళే తక్కువ , అందులోను రేపు కావల్సిన టైం లో ఎవరుంటారు, పైగా వర్షం కూడా ఉందట. 
అసలే కోతి, పైగా కల్లు తాగింది, ఆ పైన తేలు కుట్టింది టైపులో కష్టాలన్ని ఒకదాని పైన ఒకటి ఉన్నాయి అనిపించింది. 
ఈ డిస్కషన్ లో ఎవరో చెప్పారు,ఇక్కడ grey hound అని బస్సులు ఉంటాయ్ ప్రొద్దున ఎక్కితే, రాత్రి కల్లా చేరుకోవచ్చు. పైగా అది ఇంటి దగ్గర్లొనే ఎక్కొచ్చు అని చెప్పారు. బస్ టైమింగ్స్ చూస్తే ఉదయం 8 కి బయల్దేరి, రాత్రి 7 కి చేరేలాగ ఒక బస్ ఉంది, దగ్గరే కబట్టి వాళ్ళ పని డిస్ట్రబ్ అవకుండ ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారు. ఇంకా లేట్ చేస్తే ఇది కూడా ఉండదేమో అని బుక్ చేసా బస్ టికెట్. కాని ఇక్కడ ఇంకో సమస్య ఉంది,ఆ 11 గంటల జర్నీ లో మధ్యలో ఒక చోట బస్ మారాలి.
అసలే యు.ఎస్ కి కొత్త, ఇక్కడ ఏవి ఎలా ఉంటాయో ఎమి తెలియదు, పైగా ఇండియా నుండి తెచ్చిన లగ్గేజ్ అంతా నాతో ఒక్కదాన్నే మోసుకెళ్ళాలి. సరే ఎలాగైన వెళ్ళక తప్పదు కదా అనుకొని ధైర్యం తెచ్చుకున్నా, రాత్రంతా నిద్ర సగం  సగం నిద్ర, తర్వాతి రోజు ఎదో అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నట్టు అనిపించింది. 
మర్నాడు ప్రొద్దున్నే మా రూమ్మేట్ ఫ్రెండ్ డ్రాప్ చేసాడు బస్టాప్ లో. లగ్గేజ్ అంతా తన సహాయం తో బస్ కింద ఉన్న లగ్గేజ్ స్పేస్ లో పెట్టి బస్ ఎక్కి కూర్చున్నా.
 అలా యు.ఎస్ లో మొదటిసారి బస్ ఎక్కానన్నమాట. 

ఇక్కడి నుండి 6 గంటలు ఈ బస్ లో ప్రయాణించిన తర్వాత ఒక స్టేషన్లో ట్రాన్స్‌ఫర్ అయ్యి వేరే బస్ ఎక్కాలి. అక్కడ 2 గంటలు వెయిటింగ్ మళ్ళీ 3 గంటలు ఇంకో బస్ లో వెళ్తే నేను వెళ్ళాల్సిన ఊరు వస్తుంది, (ఊరు అంటే నిజ్జంగా ఊరే అక్కడ మా కాలేజ్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. అసలు ఆ ఊర్లో కాలేజ్ పెట్టలేదు, కాలేజ్ ఉంది కాబట్టే అక్కడో ఊరు ఏర్పండిందేమో అనిపిస్తుంది నాకు).
బస్ లో ఎక్కువ జనం లేరు, ఒక సగం బస్ నిండా ఉండి ఉంటారు. ఖాళీగా ఉన్న సీట్లో వెళ్ళి కూర్చున్నా. నా పక్కన ఎవరు కూర్చుంటారో ఏమో అని భయపడ్డా బస్ స్టార్ట్ అయ్యింది కాని  ఎవరూ రాలేదు. నేను చూసినంత వరకు ఎవరూ ఇండియన్స్ ఎక్కినట్టు అనిపించలేదు. మధ్యలో కొన్ని చోట్ల బస్ ఆగింది కాని నేను మాత్రం ఇంక ఆ 6 గంటలు  ఆకలేసినా,దాహమేసినా సీట్లోంచి లేవకుండా అలాగే కూర్చుండిపోయా.  బస్ ఆగినప్పుడల్లా అది ఏ ఊరో అనౌన్స్ చేస్తున్నారు.నేను దిగాల్సిందే చివరి స్టేషన్ కాబట్టి వాటి గురించి పట్టించుకోలేదు.
ఫైనల్ గా ఒక 30-40 నిమిషాలు లేట్ గా నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.బస్ దిగి కింద స్పేస్ లో ఉన్న చెక్ ఇన్ బ్యాగ్స్ తీసి కింద పెట్టా.బస్ ని స్టేషన్ బిల్డింగ్ కి ఆనుకొనే ఆపారు. అయినా కానిమొత్తం లగ్గేజ్ ఒకేసారి తీసుకొని లోపలొకి వెళ్ళలేను, ఎలాగా అని ఆలోచిస్తూ వాటితో కష్టపడుతుంటే ఒకతను వచ్చి 2 పెద్ద సూట్‌కేస్ లని పట్టుకొని లోపలికి తీస్కెళ్ళాడు.  
లోపల బిల్డింగ్ చాల చిన్నదిగ ఉంది, ఇక్కడ జనం ఎక్కువగానే ఉన్నారు.తర్వాతి బస్ ఎక్కడ ఎక్కాలో ఏమో కనుక్కుందాం అని లగ్గేజ్ అంతా కనిపించే అంత దగ్గర్లొ పెట్టి అక్కడే కౌంటర్ లో వెళ్ళి అడిగా.   కౌంటర్లో ఉన్న అమ్మాయి ఎక్కడ బస్ ఎక్కాలో చూపించింది. అది కనిపించే అంత దూరంలోనే ఉంది కాబట్టి వెళ్ళి నా లగ్గేజ్ దగ్గరే నిల్చున్నా, అక్కడ కూర్చోవడానికి ఏమి కనిపించలేదు. పైగా ఆ సామాను పట్టుకొని అటు ఇటు తిరగలేను కాబట్టి అక్కడే నిల్చున్నా ఇంక .
అక్కడే అక్కడే అక్కడే.....  నాకు అమ్రుతం దొరికింది, అంటే అంత టైం తర్వాత నీళ్ళు తాగితే అలానే ఉంటది కదా!!కాని తినడానికి ఏమి కనిపించలేదు, వెతికే ఓపిక కూడా లేదు.
ఇంకా గంట టైం ఉంది కాని, ఇంకో 15-20 నిమిషాల్లో ఆ డోర్ ముందు లైన్లో నిలబడటం మొదలు పెట్టారు జనాలు, నేను కూడా వెళ్ళి కలిసా అందులో. లైన్ పెద్దది అయ్యింది కాని గేట్ ఎంతకీ ఓపెన్  చెయ్యరు, అలా ఇంకొంచెం సేపు వెయిట్ చేసాక  ఒక్కొక్కర్ని టికెట్ చెక్ చేస్తూ బస్ లో కి పంపించారు.ఈ బస్ మొత్తం నిండిపొయింది.నా పక్కన ఎవరో ఒకతను వచ్చి కూర్చున్నాడు. ఎంతకీ బస్ స్టార్ట్ అవదు, చాలాసేపు తర్వాత అనుకున్న టైం కన్నా ఒక అర గంట లేట్ గా బయల్దేరింది.
ప్రొద్దున్నుండి ఏమీ తినలేదుగా నా కడుపులో తిప్పుతూ ఉంది.తెలియకుండానే నిద్ర పట్టేసింది, మెలకువ వచ్చేసరికి మొత్తం చీకటైపొయింది. టైం చూస్తే schedule ప్రకారం ఇంకా గంట ఉంది. బస్ లో అప్పుడే వాడు 40 నిమిషాలు లేట్ గా వెళ్తున్నాం , అని వచ్చే స్టేషన్ పేరు అనౌన్స్ చేసాడు.
అక్కడికెళ్ళాక బస్టాప్ నుండి పిక్ చేసుకోవడానికి సీనియర్స్ వస్తారు, వాళ్ళకి బస్ టైమింగ్స్ బయల్దేరే ముందు కాల్ చేసి చెప్పాను. ఆ చీకట్లో నిమిషాలు, సెకన్లు లెక్కపెడుతూ   దిగాక వాళ్ళకి ఎలా ఫోన్ చెయ్యాలి...అసలే బస్ లేట్ గా వెళ్తుంది, ఇంకా రాలేదు అని చూసి చూసి వాళ్ళు వెళ్ళిపోతే ఎలా... అని ఆలోచిస్తూ కూర్చున్నా.  
ఫస్ట్ బస్ లో ఆ 6 గంటలకన్నా, ఈ 3 గంటలు ఎక్కువ టైం అనిపించింది, బయటికి చూడ్డానికి కూడా లేకుండాఅంతా చీకటి. అలా అలా ఒక జీవిత కాలం గడిచాక నన్ను సంతోషం లో ముంచేస్తూ నేను దిగాల్సిన స్టేషన్ వస్తుందని అనౌన్స్ చేసాడు.
ఎందుకైనా మంచిదని దిగేముందు ఒకసారి అడిగా పక్కన కుర్చున్న అతన్ని, ఆ ఊరేగా ఇందాక చెప్పింది అని.
దిగేసరికి బస్ ఎదో షాప్ ముందు ఆగింది అనిపించింది. ( తర్వాత తెల్సింది అది walmart అని) జనాలే లేరు అసలు అక్కడ,ఇప్పుడేం చెయ్యాలా అని నా ఫ్యూచర్ ని తలచుకుంటూ లగ్గేజ్ కిందపెట్టేసరికి
నా సంతోషాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఇద్దరు ఇండియన్ అబ్బాయిలు వచ్చారు నా దగ్గరికి, చూడగానే అర్థమైంది నా కోసమే వచ్చారని. ఆ టైం లో వాళ్ళు నాకు నా కోసమే దిగి వచ్చిన దేవదూతల్లా అనిపించారు. వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ, బస్ కనపడగానే వచ్చారట.
ఒక 10 నిమిషాల్లో తీస్కెళ్ళి మా రూం లో వదిలారు నన్ను.
నా సంతోషాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ అక్కడ అన్నం, కూర పెట్టగానే మొహమాటం లేకుండా, కరువు బాధితురాలి లాగా తిన్నా చూడండి...ఒక రోజంతా తినకుండా ఎపుడూ లేనేమో . ఆ తర్వాత లోకల్ బస్ లలో వెళ్ళా కాని, మళ్ళీ ఇంత దూరం ఒక ఊరి నుండి ఇంకో ఊరికి బస్ లో ఎప్పుడూ వెళ్ళలేదు.  
అందుకే అది నా లాస్ట్ బస్ ప్రయణం అయ్యింది. ( హమ్మయ్య Title justification అయ్యింది ఫైనల్ గా!!) 

Tuesday, July 23, 2013

నా ఫస్ట్ & లాస్ట్ బస్ ప్రయాణం-1

ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నానని ఈమెవరో గొప్ప ఇంటి అమ్మాయి , అసలు చిన్నప్పటినుండి బస్ ఎక్కలేదట పాపం అనుకుంటున్నారా!
అక్కడే మీరు బస్సులో కాలేసారు..అసలు విషయానికొస్తే ట్రిన్ ట్రిన్ ట్రిన్
ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..నా ఫ్లాష్ బ్యాకే కాని మీరు కూడా రావాలి మరి..
నా వీసా పనులు అన్ని పూర్తిచేసుకొని యు.ఎస్ కి వెళ్ళడానికి రెడీ గా ఉన్నా. వీసాకి వెళ్ళే ముందు నా దగ్గర 3 యూనివర్సిటీలకి అప్ప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఒక దాంట్లో ఫీజు కాస్త తక్కువ, అందుకే దానితోనే వీసా ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకున్న.ఆ యూనివర్సిటీ పేరు M అనుకుందాం, M వాడు నా i20 లో బ్రాంచ్ పేరు తప్పు ఇచ్చాడు. అందుకే నేను చివరి నిమిషం లో ఇంకో యూనివర్సిటీ తో వీసా అప్ప్లై చెయ్యాల్సి వచ్చింది( ఇది K అనుకుందాం). సో అలా యూనివర్సిటీ K కి నా ప్రయాణం fix అయింది. కనుక్కుంటే అక్కడికి వెళ్ళాక ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని M కి మారిపోవచ్చు అని చెప్పారు. 

అక్కడ తెల్సినవాళ్ళు ఎవరూ లేరు.ఆ యూనివర్సిటీకి చాలామందే వస్తున్నారు కాని నా టికెట్ విడిగా బుక్ చేసుకోవాల్సి వచ్చింది.
 ఇంకా వెళ్ళేముందు ఒకటే టెన్షన్, అసలు ఒక్కదాన్ని ఫ్లైట్ లో ఎలా వెళ్తా ఒక్కరు కూడా తోడు లేకుండా అని ( ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అంత టెన్షన్ ఎందుకు పడ్డానా అని, ఆ తర్వాత ఒక్కదాన్ని చాలసార్లు ఫ్లై చెయ్యడమే కాదు ఇంకా చాలా పనులు చేసా).
ఫేస్ బుక్/యూనివర్సిటీ కమ్యూనిటీ నుండి ఇప్పటికే అక్కడ చదువుతున్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. అదే రోజు ఇంకో ఇద్దరు అబ్బాయిలు వేరే ఫ్లైట్ కి వస్తున్నారని, ముగ్గురిని కలిసి రిసీవ్ చేసుకుంటామని చెప్పారు.
ఎలాగోలా ఏ సమస్య లేకుండా వచ్చేసా, ఫ్లైట్ దిగగానే లగేజ్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేద్దామని పక్కనే ఒక షాప్ ఉంటే అందులోకి వెళ్ళి అడిగా. ఒక కార్డ్ కొనుక్కోమని దానితో 200 ( 200 లేక 300 ఎంతో గుర్తులేదు) నిమిషాలు యు.ఎస్ లో ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చని చెప్పింది. నేను తెచ్చుకున్న క్యాష్ లోంచి ఒక 20$ తీసి ఇచ్చా. 13.78 ఎంతో చెప్పి మిగిలిన చిల్లర 6$ 22 సెంట్స్ ఇచ్చింది. ( ఇది కూడా పెద్ద చెప్పే విషయమా అనుకుంటున్నారా, మరి నాకు ఇక్కడికి రాగానే కొత్తగా అనిపించిన మొదటి విషయం కదా!!). 
అలా వాళ్ళకి ఫోన్ చెయ్యడం, ఏర్ పోర్ట్ నుండి 50 నిమిషాల దూరం లో ఉన్న మా యూనివర్సిటీకి వెళ్ళిపోవడం జరిగింది. 
ఎలాగూ ఇక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను, ఇక్కడి నుండి మారిపోతాను కాబట్టి టెంపరరీగా ఉండడానికి మరో ఇద్దరు అమ్మాయిలతో షేరింగ్ లో ఇల్లు  దొరికింది. ఇంకేముంది రేపు కాలేజ్ కి వెళ్ళి M కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని, ఎలాగు వారం టైం ఉంది కాబట్టి ఈ వారంలో ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నా. నేను తప్పనిసరిగా M కి వెళ్ళిపోవాలి, ఎందుకంటె నాకు ఎడ్యుకేషన్ లోన్ రాలేదు, నేను తెచ్చుకున్న మనీ ఇక్కడి ఫీ కి సరిపోవు. ఇక్కడ ఫీ కట్టాలంటే ఇండియాలో మా ఆస్తులన్నీ అమ్ముకోవాలి, ఇంకా చెప్పాలంటే అంతా అమ్మినా ఇక్కడి మొత్తం ఫీ కట్టలేము. ఎలాగైనా మారిపోవచ్చు అని ధైర్యం చేసి వచ్చేసా. 
తర్వాత రోజు లేచి కాలేజ్ కి వెళ్ళాలి ఇదీ సంగతి అని అప్పటికే అక్కడ చదువుకుంటున్న రూమ్మేట్ కి చెప్పా. తనేమో అలా ఎలా వెళ్తావ్ ఇక్కడ International affairs లో ఒక officer ఉంటది, తను ఫస్ట్ సెమిస్టర్ లో ట్రాన్స్‌ఫర్ కి అస్సలు ఒప్పుకోదు అని చెప్పి, తన ఫ్రెండ్స్ ఎవరో వస్తే నా గురించి చెప్పింది. వాళ్ళు కూడా అస్సలే అలా కుదరదు అన్నారు. సరే ఏదైతే అది అయిందని కాలేజ్ కి వెళ్ళా. కాని ఆ రోజు ఆ ఆఫీసర్ రాలేదు, తర్వాతి రోజు రమ్మన్నారు. ఇంటికి వచ్చాక ఇంక టెన్షన్ మొదలైంది.
ఇంకా ఆ రోజంతా ఎవరితో ఈ విషయం చెప్పినా ఒకటే మాట అలా కుదరదు అని. రాత్రి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ హాయిగా సామాన్లు సర్దుకుంటూ, వాళ్ళ వాళ్ళ రూం సెట్ చేసుకుంటూ ఉంటే నేనేమో దిక్కుతోచకుండా ఆలోచిస్తూ ఉన్నా.  ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అవకపోతే ఏం చెయ్యాలి, మా నాన్న ని మనీ పంపియమంటే ఇప్పటికిప్పుడు ఎలా తెస్తారు అని అలోచిస్తున్నా. వాళ్ళేమో ఇక్కడే ఉండిపో దాంట్లో ఏముంది అంటున్నారు, అసలు సమస్య తెలియక.
ఎలాగోలా ఆ రోజు గడిపేసి, తర్వాతి రోజు లేవగానే కాలేజ్ కి వెళ్ళా.నాకు కావాల్సిన ఆఫీసర్ ఉంది, భయపడుతూ వెళ్ళి కలిసి విషయం చెప్పా. 
వెంటనే ట్రాన్స్‌ఫర్ అవుతావా ఒక సెమిస్టర్ కూడా పూర్తి చెయ్యకుండా అంది, అవును అని చెప్పా. 
"ఎందుకు" అంది, టక్కున అక్కడ నా బ్రదర్ ఉన్నాడు అందుకే అన్నా కాస్త దీనంగా.
కాసేపు నా పాత i20 కొత్త యూనివర్సిటీ i20 చూసి "OK" అని ఇంకేదో అంది. అర్థం కాక Question mark  మొహంతో అక్కడే నిల్చున్నా. "Now you are lo longer student of this school, i relesed your Sevis" అంది. ఆ పని అంతా పూర్తి అవడానికి 2,3 రోజులు పడుతుంది.  కాని మళ్ళీ ఆఫీస్ కి రావాల్సిన పని లేదు, కొత్త యూనివర్సిటీకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అంది. హమ్మయ్య అనుకున్నా.
కానీ... ఇంకో పెద్ద సమస్య గురించి ఇంకాసేపట్లొ తెలుసుకోబోతున్నానని నాకు తెలియదు అప్పుడు.  

Sunday, July 21, 2013

జైలు జీవితంలో ఒక లేడి డిటెక్టివ్!!


టైటిల్ చూసి ఇది అప్పుదేప్పుడు టీవీ లో వచ్చిన సీరియల్ అనుకునేరు.. అది కాదు కానీ నేను డిటెక్టివ్ రోల్ పోషించాను ఒకసారి..
నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో హాస్టల్లో చేరిపించారు మా ఇంట్లో వాళ్ళు ఏదో చదివి ఉద్ధరిస్తానని, చదవటం సంగతి అటుంచి ఆ జైలు లో సారీ హాస్టల్లో మేం పడిన కష్టాలు ఎన్నో.ప్రొద్దునే 5 గంటలకు లేపేవాళ్ళు అది కూడా ఎంత కర్ణ కఠోరంగా అరుచుకుంటూ మా వార్డెన్ వచ్చేది అలాఅందరి రూమ్స్ తలుపులు బాదుతూ వెళ్ళేది. మేము ఫస్ట్ ఫ్లోర్ కాబట్టిఇంకా అదృష్టవంతులం ఒక వార్డెన్ కే బలి అయ్యేవాళ్ళం పాపం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవాళ్ళకి వాచ్ మాన్ కూడా కర్రతో బాదే వాడు తలుపుల పైనే లెండి. ఇప్పుడే చెప్తుంటే చినన్ విషయం లానే ఉంది కానీ ఆ సమయం లో చలికి అంత ఉదయమే లెగవాలంటే ఎంత కష్టంగా ఉండేదో (ఎంతైనా యుగానికి ఒక్కడు సినిమా చూసిన కష్టం ముందు చిన్నదే అనుకోండి).అప్పుడు లేచి వాళ్ళు పెట్టే ఆయిల్ ఫుడ్ తిని పరిగెత్తుకుంటూ క్లాసు కి వెళ్ళేవాళ్ళం. ఆలస్యం అయితే అక్కడ కర్ర పట్టుకొని రెడీ గా ఉండేది ఒక దయ్యం. అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉంటె అలా పరిగెత్తి పరిగెత్తి ఒలంపిక్స్ లోబంగారు పతకం తెచ్చేదాన్ని. ఇంకా ఆ ఫుడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొందరు బానే తినేవాళ్ళు , నాలాంటి కొందరికి ముద్ద దిగకపోయేది.పైగా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చూసి "ఏందే ఇంత సన్నగా ఐపోయావ్ అంత డబ్బు కడుతున్నాం, కట్టినదానికి సరిపడా తినవే అలా డబ్బులు వేస్ట్ చెయ్యకు" అని, ఇంతకి వీళ్ళ బాధ నేను చిక్కిపోయినందుకా లేక కట్టిన డబ్బు కు సరిపడా తినలేదనా??
మా రూం లో ఐదుగురం ఉండే వాళ్ళం. ఒకే ఒక అమ్మాయ్ కి సెల్ ఫోన్ ఉండేది. ఇంకా ఆమెకి కాల్ రావడం బిల్డప్ ఇస్తూ ఫోజు కొడుతూ తిప్పుకుంటూ మాట్లాడటం. ఇంకా నా మనసు రగిలి పోయింది ఈ సారి నేను కూడా ఎలాగైనా తెచ్చేసుకుందాం సెల్ ఫోన్ అని ఇంటికెల్లినప్పుడు మా నాన్న మంచి మూడ్ లో ఉన్నప్పుడు చూసి న కోరిక వదిలా. మా అమ్మ అయితే అసలు ఛాన్స్ లేదు. ఆయన పక్కనే నా ఆ జన్మ శత్రువు ఉంది అదేనండి మా అక్క. మా నాన్నకి ఉన్న బడ్జెట్ లో దానికి అన్ని కొనిచేవాళ్ళు నా దగ్గరికి వచేసరికి అది మళ్లీ ఒక కొత్త అవసరం అనబడే కోరికతో రెడీ. అలా నాకు అది ఉపయోగించిన పుస్తకాలూ, బట్టలు ,సైకిల్ ఒకటేంటి అన్ని....:(
మా అక్క మహా తెలివైనది లెండి. అది అన్ని వస్తువులు చాల జాగ్రత్తగా చూసుకునేది ఇంకా పనికి రావు అనిపించగానే ప్రేమగా అమ్మానాన్న సమక్షం లో నాకు ఇచ్చేది చూడడానికి అంత బావున్నట్టే అనిపించేది
. అలా దాని సైకిల్ నాకు ఇచ్చేసి స్కూటీ కొనుక్కుంది. నేను అలా నాకు వచ్చిన సైకిల్ ని మహదానందంగా వేసుకొని ఒకే ఒక్క రౌండ్ వేసోచ్చా మా వీధిలో , ఇంకేముంది ఇంటికి మళ్లీ నేను ఆ సైకిల్ పైన రాలేకపోయా అంత పురాతన స్తితిలో ఉంది అది కానీ చూడడానికి మాత్రం కోతదనిల ఉంది రంగు అది పోకుండా. నాకు మళ్లీ తిట్లు దాని వలన. ఇలా చిన్నప్పటి నుండి మా అక్క చేతిలో బలి అవుతూనే ఉన్నా.

మళ్లీ న సెల్ ఫోన్ విషయానికి వస్తే నాన్నని కి అడగగానే పక్కనే ఉన్నా మా అక్క తన సెల్ ఇచ్చి నన్ను ఉన్చేసుకోమంది.నాకు అప్పుడప్పుడే దాని దుర్మార్గపు ఆలోచనలు అర్థం అవుతున్నాయ్ కాబట్టి ఈ సారి గట్టిగ చెప్పను నాకు కొత్తదే కావాలి అని .ఇంకేముంది మరో సంవత్సరం కి వాయిదా పడింది నా సెల్ సంగతి.
ఇంకా మళ్లీ హాస్టల్ విషయనికి వస్తే మా రూమ్మేట్ అలా సెల్ తో గడుపుతుండగా నేను కుళ్ళు పడుతూ ఉండగా ఒకరోజు రూం లోనే సెల్ కనిపించకుండా పోయింది, నేను తీసాను అనుకునేరు కాదు లెండి. రూం లో కి కోతగా ఎవరు రాలేదు, మేము బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కనుక హాస్టల్ లోనే ఎవరో తీసి ఉండాలి కానీ ఎవరి మీద డౌట్ పడతాం ఎవర్ని అడుగుతాం, మా ఫ్లోర్ లో అందరి రూమ్స్ లో అడిగి మొత్తం వెతికి చివరికి వచ్చి కూర్చున్నాం. నేను మళ్లీ అలా చూస్తూ చూస్తూ వెళ్ళాను. మా వార్డెన్ రూం ఒక వైపుకి ఉండేది అదే ఫ్లోర్లో , ఆమె ఇంకా రాలేదు. అటు వైపు ఎవరు వెళ్లారు సాధారణంగా. ఎందుకో నా డిటెక్టివ్ బుర్ర పని చేసి అటు కూడా ఒక లుక్కేసా. ఆ రోజు వర్షం పడి ఉంది ఆ రూం కిటికీ పక్కనే చెప్పులతో నడిచిన మట్టి గుర్తులు ఉన్నాయ్.ఎందుకో అనుమానం వచ్చి కిందికి వెళ్లి ఆ కిటికీ ఉన్నా ప్లేస్ లో చుస్తే ఫోన్ ఉంది అక్కడ నాకు అర్థమైంది సీన్, అదేమన్న చదువుకు సంభందించిన విషయమా అర్ధం కాకపోవడానికి. ఎవరో సెల్ తీసుకున్నారు వెతుకుతున్నాం అని తెలియగానే పైన కిటికీ లోంచి కిందకి పడేసారు. ఇప్పుడు ఆ దొంగని పట్టుకోవడం కోసం నాకో ఐడియా తట్టింది వెంటనే అందరి చెప్పులు కింది భాగం చూసి ఈ గుర్తులతో మ్యాచ్ అయ్యే వి దొరకపడితే సరోపోతుంది. కానీ అందర్నీ చూపించమంటే ఎందుకు వింటారు , ఇంకా మా వార్డెన్ కి చెప్పి ఒక్కొక్క రూం కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసాం. ఇంకేం దొంగ దొరికింది. మొదట్లో ఒప్పుకోలేదు కానీ, మా వార్డెన్ గట్టి గ అడగగానే ఒప్పుకుంది. ఇంకా నేను నిజంగానే నా తెలివితో "లేడి డిటెక్టివ్" అయ్యా.....
కానీ ఇంత తెలివైన దాన్ని మా వాళ్ళు డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుంటా అంటే ఒప్పుకోలేదండి . నా టాలెంట్ ని తోక్కేసారు :(

కలల లోకం లో నేను

మీకు కలలు వస్తాయా????
ఇదేం ప్రశ్న !!! కలలు రాకుండా ఎవరైనా ఉంటారా అని అనుకుంటున్నారా??
నాకు అయితే విచిత్రమైన కలలు వస్తాయ్ ...
నేను ఆ రోజు ఎం చేస్తానో, లేకపోతే ఏదైనా సినిమా చూస్తానో రాత్రంతా అదే విషయమ్మీద కలలు.ఒకోసారి కలలో జరిగింది నిజమే అనుకుంటున ఉంటాను
నిన్నే టీవీ లో నరసింహ సినిమా చూసానా , రాత్రి అంత నేను నీలాంబరి ఫ్రెండ్ ఐపోయినట్టు, ఎందుకు అలా మొండిగా చేస్తావ్, నరసింహ ని మర్చి పోయి వేరే పెళ్లి చేసుకోవచ్చుగా అని నేను సర్దిచేప్తున్నా , నీలాంబరి నా మీద కూడా అరుస్తుందట, ఇది నా కల. హ్యాపి డేస్ చుసిన రోజు మా కాలేజ్ లో అందరు ఫ్రెండ్స్ అయపోయినట్టు నక మొత్తం సినిమా వచ్చింది కలలో, కాకపోతే సీన్ మా కాలేజ్ లో .....
ఇంకా చంద్రముఖి రోజు అయితే ఏకంగా జ్యోతిక ప్లేస్ లో నేనే..ఇంకా నయం అరుంధతి చూసినపుడు నాకు అసలు కలేం రాలేదు న అదృష్టం :)
ఒకసారి మా కాలేజ్ లో కొత్త లెక్చరర్ వచ్చింది...రాగానే ఏదో అసైన్మెంట్ ఇచ్చింది ,,,ఇంకా ఆ రోజు కలలో ఆమే పళ్ళు అమ్ముతుందట కాలేజ్ లో సాయంత్రం వరకు ఎవరు ఎక్కువ పళ్ళు అమ్మి పెడితే వాళ్ళు అసైన్మెంట్ ఫినిష్ చేసినట్టు ,ఎక్కువ పళ్ళు అమ్మితే ఎక్కువ మార్క్స్ అట ..ఇంకా చూడాలి తర్వాత నుండి ఎప్పుడు ఆ క్ల్లాస్ లో ఆమెని చుస్తే ,అరటిపళ్ళు , ఆపిల్ లు ముందు పెట్టుకుని పళ్ళు అమ్మే సీన్ గుర్తుకు వచ్చేది.

Saturday, July 20, 2013

నేను గెలిచిన ఫస్ట్ ప్రైజ్

అందరు చిన్నప్పటి విషయాలు రాస్తున్నారు కదా నేను గుర్తు తెచుకొని ఏదో ఒకటి రాద్దామనుకున్నాను , కాని నాకు ఏమి గుర్తు రావట్లేదు :(
ప్రతి మనిషి లో ఒక టాలెంట్ ఉంటుందంటారు ....మంచిదో చెడ్డదో .కానీ అదేంటో చిన్నప్పటి నుండి చూస్తున్న నాలో ఏదో ఒక టాలెంట్ బయటపడుతుందేమో అని ప్చ్ ..లాభం లేదు ,జీవితం గడిచి పోతుంది కాని నాలో ఒక్క టాలెంట్ కూడా బయటపడలేదు.
చిన్నప్పుడు నా వయసు వాళ్ళందరూ పరిగెడుతుంటే నేను నడవటమే మొదలు పెట్టలేదట ,అప్పటి నుండి మొదలు అన్ని పనులు లేట్ గానే నాకు :( పోనియండి లేట్ గా వచ్చిన పర్లేదు , కొన్ని అయితే ఎంత ట్రై చేసిన చెయ్యలేని పనులున్నాయండి బాబు .
కొంచెం
పెద్దయ్యాక స్కూల్ కి వెళ్ళే టైం లో , పంద్రాగస్టు కి , రిపబ్లిక్ డే వస్తే చాలా గేమ్స్ పెట్టేవాళ్ళు , మా అక్క ఉందే, రెండు చేతులతో కప్పు లు పట్టుకోచ్చేది ..మనలో మన మాట ఏదో స్టైల్ గా ఉంటుంది , అది కాకుండా సినిమాల్లో చిన్న పిల్లల చేతుల్లో కూడా కప్పులు చూపించే వాళ్ళని అలా అన్నాను కానీ , మాకు కప్పులు ఇచ్చే అంత సినిమా లేదండి, స్టీల్ గిన్నెలు ,గ్లాసులు ఇచేవాళ్ళు ప్రైజు కింద . అవి పట్టుకోచి తెగ ఫోజులు కొట్టేది.నేను అన్ని గేమ్స్ లో పాల్గొనేదాన్ని , కానీ అదేందో ప్రతి చోట విధి నన్ను వెక్కిరించేది.కనీసం సెకండ్ ప్రైజ్ కూడా రాకపోయేది.
నాకు సరిగ్గా గుర్తు లేదు కానీ ఏడో,ఎనిమిదో క్లాసు లో కి వచ్చాక, ఒకసారి క్రికెట్ ఆడించారు , ఎవరు ముందుకు రాలేదు,ఖో -ఖో , స్సిప్పింగ్ , రన్నింగ్ ఆడే వాళ్ళని క్రికెట్ ఆడమంటే ఏమి ఆడతాం చెప్పండి. అన్నట్టు చెప్పడం మర్చి పోయా మాది గర్ల్స్ స్కూల్
మా హై స్కూల్ నుండి కస్టపడి రెండు టీం లు సిద్ధం చేసారు , పాటికి అర్ధమయ్యే ఉంటది అందులో నేను కూడా ఉన్నానని. అసలు అందరి కన్నా ఫస్ట్ పేరు ఇచ్చిందే నేను. ఇంకేముంది రెండు టీం లలో ఒకటి ఫస్ట్, ఒకటి సెకండ్ . అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ,మనకు సెకండ్ ప్రైజ్ వచ్చింది.
ఇంకా పండగ రోజు రానే వచ్చింది అదేనండి ప్రైజ్ తీసుకునే రోజు, కానీ ఏం చేస్తాం , నేను కెప్టెన్ కాదు కదా , ఐతేనేం నా వంతు ప్రైజ్ నాకు వచ్చింది, "స్టీల్ ప్లేట్ " .
అది పట్టుకొని విజయ గర్వం తో ఇంటికి చేరాను. పరిగెత్తుకుంటూ వెళ్లి , "అమ్మా , నాన్నా, అక్కా..." ఇంట్లో అందర్నీ పిలిచి నా విజయ చిహ్నాన్ని చూపించాను. మా అమ్మ కళ్ళల్లో ఆనందం తో కూడిన కన్నీళ్ళు.
సీన్ కట్ చేస్తే రోజు నుండి మన భోజనం అందులోనే ఇంకా. అందులో తినడానికి సరిగ్గా వచెది కాదు, అయినా సరే దాంట్లోనే తినేదాన్ని.
ఇలా జరుగుండగా ఒకరోజు ,
' అమ్మ ఒక ఇరవై రూపాయలివ్వా..'అప్పట్లో నాకు చేతికి పది రూపాయలు కూడా ఇవ్వకపోఎది మా అమ్మ .ఎందుకే ? మొన్నేగా పది ఇచ్చా ...అంటే ఇప్పుడు ఇవ్వను అని దాని అర్ధం..నేను ఊరుకుంటానా ....నేను తెచ్చియన్ ప్లేట్ వాడుతున్నారు కదా ఇంట్లో ...దాని కి ఐన ఇవ్వు లేకపోతే, నాకు ఇచ్చేసేయ్ ....
వెంటనే టంగు మని నా ముందు ఏదో పడింది...
తర్వాత అలిగి నాకు కావాల్సింది తీసుకునే వెళ్ళాను మర్నాడు స్కూల్ కి , మా ఫ్రెండ్స్ ముందు పరువు నిలుపుకున్నాను...
ఇంతకీ నేను ఇంత కష్టపడింది , అప్పుడే మా స్కూల్ ముందు తెరిచిన బేకరీ లో తినడానికి. అలాగా ఆరోజు స్కూల్ అవగానే వెళ్లి తినేసి వచ్చాం.
అదన్న మాట సంగతి..