Showing posts with label అమెరికా కబుర్లు. Show all posts
Showing posts with label అమెరికా కబుర్లు. Show all posts

Friday, February 3, 2017

కోర్ట్‌కెందుకెళ్లాల్సి వచ్చిందంటే.. 1

నాకు ఫైన్ ఎలా పడిందో మొన్న చెప్పా కదా..ఎప్పుడైనా కాప్ ఫైన్ ఇచ్చాక దాని పైన ఫైన్ కట్టాలనుకుంటే ఎలా కట్టొచ్చు, ఒకవేళ అది పే చెయ్యడానికి మనం ఒప్పుకోకపోతే ఆ విషయం తెలియజెయ్యడానికి వివరాలు ఉంటాయి.  ఫైన్ కట్టము అనుకుంటే కోర్ట్ కి రమ్మని ఒక డేట్ ఇస్తారు, ఆరోజు వెలితే వాళ్ల నిర్ణయం చెప్తారు, మొత్తం ఫైన్ కట్టాలా లేక ఏమన్నా తగ్గిస్తారా అన్నది.
సరే నేను కోర్ట్‌కి రావాలనుకుంటున్నాను అని టిక్ చేసాను ఆ వెబ్‌సైట్ లో.
ఒక 2 వారాలకి, ఫలానా రోజు కోర్ట్‌కి రమ్మని మెయిల్ వచ్చింది.
ఆరోజు కోర్ట్ కి వెళ్లాల్సింది మధ్యాహ్నం టైం కాబట్టి, ప్రొద్దున ఇంట్లోంచి పని చేసి, మధ్యాహ్నం లీవ్ పెట్టా, అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా.ఒక్కదాన్నే వెళ్తున్నా కదా అని ఇచ్చిన టైం కన్నా కొంచెం ముందు వెళ్లా, అక్కడ ఎలా ఉంటదో, కరెక్ట్‌గా ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొవడానికి టైం పడుతుందేమో అని. లోపలికి వెళ్లగానే రెసెప్షన్ ప్లేస్ లో బోర్డ్ పెట్టి ఉంది. ఆరోజు ఎవరెవరికి టైం ఇచ్చారు, ఏ టైం కి అని. నా పేరు అందులో ఉంది అని చూసుకొని అక్కడ ఉన్న అతన్ని అడిగా ఎటు వైపు వెళ్లాలి, వెళ్లాక ఏం చేయాలి, ఇలా ఈ టైం కి నాకు హియరింగ్ ఉంది అని. అతను ఎటువైపు వెళ్లాలో చూపించి, లోపల కోర్ట్ హాల్లో వెళ్లి కూర్చుంటే టైం ప్రకారం నా పేరు పిలుస్తారు అని చెప్పాడు. కోర్ట్ హాల్లో చిన్న స్టేజ్ లాంటి పైన్ జడ్జ్ కూర్చున్నాడు. అతని పక్కనే ఏవో పేపర్స్ చూపిస్తూ ఒకామె  ఉంది అసిస్టంట్ లాగ.
స్టేజ్ కింద హాల్ కి అటు పక్క ఇటు పక్క ఒక్కో టేబుల్, దాని దగ్గర ఒకరు కూర్చుని ఉన్నారు.
మిగతా హాల్ అంతా ఒకదాని వెనక ఒకటి బెంచ్ లాగా సీట్స్ ఉన్నాయి.
అమ్మో...ఇప్పుడు నా పేరు పిలిచి అక్కడ నిల్చోబెట్టి, ఏం చేసాను, ఎందుకు not guilty అని అప్లై చేసాను అని అందరి ముందు చెప్పమంటారేమో...ఏం చెప్పాలి..ఎలా చెప్పాలి బాబోయ్..అనుకుంటూ వెళ్లి ఒక బెంచ్ లో కూర్చున్నా. ఎక్కువ జనం ఏం లేరు. ఒక 15, 20 మంది ఉన్నారేమో. ఈ లోపు ఆ సైడ్ టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్లు ఒక్కొక్క పేరు పిలుస్తున్నారు.తమ పేరు పిలిచిన వాళ్లు వెళ్లి అక్కడ నిల్చుని వాళ్లతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. so మొత్తానికి అందరికి వినబడేలాగా మాట్లాడే పని లేదన్నమాట. అక్కడే సగం టెన్షన్ పోయింది నాకు. పోన్లే మనం ఏం మాట్లాడినా ఎవరికి తెలియదు :). ఇలా అలోచిస్తుండగానే నా పేరు పిలిచాడు ఒక సైడ్ టేబుల్ అతను.
అతని దగ్గరికి వెళ్లగానే నా కేస్ పేపర్స్ తీసి చదివి, సో నువ్వు ట్రైన్ ఆగినప్పుడు వెనకనుండి ట్రాక్స్ దాటావన్న మాట, అలా చెయ్యడం చాలా డేంజర్ కదా, ఇంకోసారి అలా చెయ్యకు, నీ ఫైన్ క్యాన్సల్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ పేపర్ లో అది రాసుకొని, నువ్వెళ్లొచ్చు అన్నాడు.సరే ఇంకెప్పుడు అలా చెయ్యను అని చెప్పి,  అంతే అయిపోయిందా..అనుకొని బయటికి వచ్చేసా. నిజంగానే మళ్లీ అలా ఎప్పుడూ దాటలేదు కూడా..

Wednesday, February 1, 2017

కోర్ట్‌కెందుకెళ్లాల్సి వచ్చిందంటే..

Google Image

నేను రోజు ట్రైన్‌లో వెళ్తాను కదా న్యూయార్క్ లో ఉన్నమా ఆఫీస్ కి, ట్రైన్ ఎక్కాలంటే ఇంటి దగ్గర నుండి ఒక 10 నిమిషాలు నడవాలి స్టేషన్‌కి. మా ఇంటి దగ్గరిది చాలా చిన్న స్టేషన్, అంటే ఒకటే ప్లాట్‌ఫాం. అది కూడా మొత్తం ట్రైన్ పొడవు కన్నా చిన్నగా ఉంటది.నేను ట్రైన్ ఎక్కాలంటే రోడ్ దాటి అవతలి పక్క ఉన్న ప్లాట్‌ఫాం కి వెళ్ళి ఎక్కాలి. ట్రైన్ వచ్చే ముందు రోడ్ మీద ఉన్న గేట్ పడిపోతుంది. గేట్ పడ్డాక కార్స్ మాత్రమే కాకుండా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా ఆగిపోవాలి. నేను రోజు టైం చూసుకొని హడావిడి పడుతూ ఐనా సరే ఒక్క నిమిషం అన్నా గేట్ పడేముందు అక్కడికి చేరుకుంటా. అప్పుడప్పుడు కొందరు గేట్ పడ్డాక ట్రైన్ ముందు నుండి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు.
ఇలాగే ఒకరోజు నాకుకొంచెం లేట్ అయింది. అప్పటికీ 10 నిమిషాల నడకే అయినా మా ఆయన డ్రాప్ చేస్తా అని వచ్చాడు. కాని కరెక్ట్‌గా అక్కడికి చేరుకునే సరికే గేట్ పడుతూ ఉంది. ట్రైన్ వచ్చింది. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే అయితే మళ్ళీ ఇంకో 40 నిమిషాల వరకు ఇక్కడ నుండి ట్రైన్ ఉండదు కాబట్టి దగ్గర్లో ఉన్న ఇంకో స్టేషన్ కి వెళ్ళి వెరే ట్రైన్ తీసుకున్నాను, కాని అక్కడికి డ్రాప్ చేసి రావడం తనకి లేట్ అయిపొతుంది.
ఈలోపు ఒకతను ఆగి ఉన్న ట్రైన్ వెనక నుండి గేట్ దాటి ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాడు, సరే నేను కూడా అలానే చేద్దాం, మళ్ళీ ఇది మిస్ ఐతే లేట్ అవుతది అనుకున్నా. మా ఆయన కూడా రోజూ చూస్తూనే ఉంటా, ఎవరో ఒకరు అలా క్రాస్ చేస్తారు అని ఎంకరేజ్ చేసే సరికి ఆ దాటుతున్న ఇంకొకతనితో పాటు నేను కూడా వెళ్లిపోయా. సరిగ్గా గేట్ క్రాస్ చేసి అటు వెళ్లే సరికి ఒక కాప్ నిల్చున్నాడు.
మా ఇద్దరి దగ్గరికి వచ్చి, ఈ ట్రైన్ మీరు అందుకోలేరు, ఆగండి అని ఆపేసి, మా ID కార్డ్స్ అడిగాడు. ID అంటే ఏముంది నా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసా. అతను అవి తీసుకొని, మాతో అలా గేట్ పడ్డాక దాటటం డేంజర్ కదా అని, మా ఇద్దరి  కార్డ్స్ తీసుకొని కార్లోకి వెళ్లి చెక్ చేస్తున్నాడు. చేస్తున్నాడు చేస్తున్నాడు..ఎంతకీ రాడు.
ఈలోపు అతను నేను మాటలు కలిపాం.నేను చెప్పా..ఈరోజే ఫస్ట్ టైం ఇలా గేట్ పడ్డాక ట్రాక్ దాటడం అని. అతను మాత్రం రోజూ అలాగే చేస్తాడట. తన వైఫ్ డ్రాప్ చేస్తుందట తనని. so ట్రైన్ వచ్చేవరకి బయట చలి లో ఎందుకని అలా కార్లోనే వెయిట్ చేసి అప్పుడు ఇలాగే ట్రైన్ ఆగాక వెనకనుండి క్రాస్ చేస్తాడట. ఒక్కరోజు కూడా ఎవరు ఆపలేదు, పాపం ఈరోజు నాతో ఉన్నందుకు అతనికి కూడా తగిలింది.
సరే 30 నిమిషాలు అయిపోయింది, ఇంకా రాడే ఆ కాప్.అంతసేపు ఏం చేస్తున్నాడో. 
ఇంక నెక్స్ట్ ట్రైన్ వచ్చే టైం కూడా అయింది. అది కూడా మిస్ అయితే ఇంక ఆఫీస్ కి వెళ్లి వేస్ట్, లంచ్ టైం కి చేరుకుంటా.
చూస్తుండగానే ఆ ట్రైన్ రానే వచ్చింది. అప్పుడు మెల్లగా వచ్చి అతను ట్రైన్ దగ్గరికి వెళ్లి TC తో ఒక 5 నిమిషాలు ఆపమని చెప్పి(అది చిన్న స్టేషన్ కాబట్టి ప్రాబ్లం ఎమి ఉండదు) మా దగ్గరికి వచ్చి చెరొక 200$ ఫైన్ టికెట్ చేతిలో పెట్టి ట్రైన్ ఎక్కించాడు :(.
ఇది అన్యాయం అనుకున్నాం.
ఆఫీస్‌కి వెళ్లి ట్రైన్ డిపార్ట్మెంట్  సైట్ లో చూస్తే పాదాచారులకి 50$ కన్నా ఎక్కువ ఫైన్ వెయ్యకూడదు అని ఉంది. అది కూడా ట్రైన్ వస్తున్నప్పుడు దాని ముందు నుండి దాటితే maximum of 50$ ఫైన్ అట.
తర్వాత....రేపు చెప్తా..                                          

Thursday, July 16, 2015

బుక్ కేక్


కేక్ బావుంది కదా..
అదేంటి రాత్రి 12 కి కేక్ కట్ చేయించకుండా ఇలా బుక్స్ తెచ్చి గిఫ్ట్ ఇస్తున్నాడేమో మా ఆయన అనుకున్నా.తెస్తే తెచ్చాడు కాని అవి ఏం పుస్తకాలో, చదవగలిగేవే తెచ్చాడా అనుకున్నా ఒక fraction of second లోనే. దగ్గరికి వచ్చాక అర్థం అయ్యింది అది కేక్ అని. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూ ఉంటావ్..అసలేం చదువుతావ్ అంతసేపు అని అంటూ ఉండే తను నా birthday కి తన ఫ్రెండ్‌తో చేయించిన కేక్ ఇది.

నా కన్నా బాగా వంట చేస్తానని ఫీలింగ్ తనకి, అందుకే Cook better than your husband by Vahchef చదివి వంట నేర్చుకోవాలట :(.
మా ఆయనకి నమ్మకం vahchef చెప్పినట్టు follow ఐతే  అన్ని వంటలు చెయ్యొచ్చట.
తర్వాత vahchef కి మెయిల్ చేసాడు ఈ pic పంపి that i used your name అని.
see what vahchef did


All credit goes to Sreedevi..who made this beautiful cakeand made my Bday special and to my husband for his thought and captions :)

Friday, March 27, 2015

ట్రైన్‌లో మర్చిపోయిన లాప్‌టాప్

ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లాలంటే అటు 2 గంటలు ఇటు 2 గంటలు ప్రయాణం చేస్తా కాబట్టి ప్రతీ Friday Work From Home చేస్తాను.అందుకని గురువారం సాయంత్రం వచ్చేఅప్పుడు office laptop నాతో పాటు తెచ్చేసుకుంటాను.  ఆరోజు laptop తీసుకొస్తున్నా. ఇంటికెళ్లాలంటే 2 ట్రైన్స్ మారాలి. subwayలో ఎలాగూ bag కింద పెట్టడానికి కూడా స్థలం ఉండదు కాబట్టి చచ్చినట్టు మోస్తూ నిల్చోవాలి. తర్వాత commuter railలో కూర్చోవడానికి ఉంటుంది కాని సీట్స్ అన్ని నిండిపోతాయి కాబట్టి హ్యాండ్‌బ్యాగ్ నాతోనే ఉంచుకొని laptop bag మాత్రం పైన షెల్ఫ్ లో పెట్టేసి, దిగేటప్పుడు తీసుకొంటాను.
ఆరోజూ అలానే చేసాను..కాని పైన పెట్టేవరకే.. దిగే అప్పుడు ఏం ఆలోచిస్తున్నానో ఏంటో హాయిగా చేతులు ఊపుకుంటూ handbag ఒక్కటి వేసుకొని దిగిపోయా.ట్రైన్ స్టేషన్ నుండి pick చేసుకోవడానికి మా ఆయన వచ్చాడు, వెళ్లి కార్లో కూర్చొని తన బ్యాగ్ చూసాక అప్పుడు గుర్తొచ్చింది.. నా laptop మర్చిపోయా అని. చూస్తే ఏముంది  ట్రైన్ వెళ్లిపోయింది అప్పటికే. అసలే office laptop. miss ఐతే కష్టం.ఆ ట్రైన్లో చివరి స్టాప్ కి కాల్ చేసి రిపోర్ట్ చేద్దామని ట్రై చేసా కాని, after business hours ఎవరు రెస్పాండ్ అవలేదు.
అయితే దురదృష్టం లో అదృష్టం అన్నట్టు అది సింగిల్ ట్రాక్, ఈ ట్రైన్ ఇంకో 4 స్టాప్స్ వెళ్ళి మళ్లీ అదే ట్రైన్ వెనక్కి వస్తుంది. టైం చూస్తే ఇంకొక గంటలో రిటర్న్ ట్రైన్ ఉంది.అంతసేపు టెన్షన్ పడుతూ అక్కడే కూర్చొని వెయిట్ చేసాం. రిటర్న్ ట్రైన్ వచ్చాక దాంట్లో ఎక్కేసి టికెట్ కలెక్టర్ ని అడిగి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో తెల్సుకొని అక్కడకి వెల్దాం అనుకొన్నాం.
ఇంతలో ట్రైన్ వచ్చింది. నేను ఈ కంపార్ట్మెంట్ లో ఎక్కానో గుర్తుంది నాకు, రోజూ ఒకటే  కంపార్ట్మెంట్లో చూసుకొని ఎక్కుతాను. అందుకని ట్రైన్ ఆగేలోపు సరిగ్గా ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎక్కాను. లోపలికి వెళ్లి పైన షెల్ఫ్ లో చూడగానే ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది నా బ్యాగ్. తొందరగా వెళ్లి అది తీసుకొని టికెట్ కలెక్టర్ అటు చివర డోర్ దగ్గర ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఇలా బ్యాగ్ మర్చిపోయా తీసుకొవడానికే ట్రైన్ ఎక్కా ఒక్క నిమిషం ఆపండి దిగిపోతా అని చెప్పా. అప్పటికి ట్రైన్ డోర్స్ ఇంకా మూయలేదు కాబట్టి సరే అని డోర్ దగ్గర నిల్చున్నాడు, నేను త్వరగా దిగిపోయా అప్పటి దాకా పడిన టెన్షన్ అంతా మర్చిపోయి హాయిగా..

కాని అక్కడితోనే అయిపోలేదు, ఆరోజు నుండి ఎప్పుడు laptop తెచ్చినా చంకలో పిల్లని చూసుకున్నట్టు  నా పక్కనే సీట్లో పెట్టుకొని కూర్చోవడమో, ఎవరైనా వచ్చి అక్కడ కూర్చుంటాం తీసెయ్యమంటే తీసి కాళ్ల దగ్గర పెట్టుకోవడమో చేస్తుండేదాన్ని ఇబ్బంది అయినా సరే అని. అలా కొన్ని రోజులు బానే నడిచింది. laptop తీసుకురాని రోజు కూడా ఈరోజు తేలేదు కదా అని ఒకటికి రెండు సార్లు అనుకొని దిగేదాన్ని.
ఒక్కోసారి కాళ్ల దగ్గర పెట్టుకుంటే అది అటు ఇటూ పడిపోవడం, నా పక్కన కూర్చున్న వాళ్ల స్టాప్ వస్తే నేను లేచి దారి ఇవ్వడానికి ఇబ్బంది అయ్యేది. సరే ఏమి కాదు ఊరికే అలా మర్చిపోతామా ఏంటి ఘాఠ్ఠిగా...గుర్తుంచుకుందాం అని పైన పెట్టడం మొదలు పెట్టా మళ్లీ. గుర్తుంచుకొని బానే తెచ్చుకునేదాన్ని.ఆరోజు మళ్ళీ గురువారం. ఇంటికొచ్చి తాళం తీసి లోపలికి అడుగు పెట్టి  " హే...రేపు Friday ఆఫీస్ వెళ్లక్కర్లేదు..." అన్నా, అప్పుడన్నాడు మా ఆయన laptop ఏది అని. అప్పటిదాక గుర్తే లేదు తీసుకొచి ట్రైన్లో పెట్టి మర్చిపోయా అని. లాస్ట్‌టైమే బెటర్ కనీసం దిగగానే గుర్తొచ్చింది. ఈసారి భయం అవలేదు. కోపం వచ్చింది నా మీద నాకే.ఒక తప్పు ఒకసరి చెయ్యొచ్చు అదే తప్పు మళ్ళీ.. అది కూడా 3 నెలల్లోనే..:(
ఇంకేముంది మళ్లీ స్టేషన్‌కి వెళ్లాం, ఎలాగూ ప్రాసెస్ తెలిసిందే కాబట్టి ట్రైన్ టైం అయ్యేవరకు ఇంట్లోనే ఉండి సరిగ్గ టైం కి వెళ్లాం, సేం అలానే పోయిన సారి లాగనే ఆగగానే వెళ్ళి ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు తీసుకొని దిగిపోయా.
అప్పటి నుండి laptop పైన పెట్టినప్పుడల్లా,ఇప్పుడు వింటర్ లో వేసుకునే పెద్ద జాకెట్ తీసెసి బ్యాగ్ మీదనే పెడుతున్నా, అదైతే మర్చిపోయి దిగే చాన్సే లేదు ఈ చలికి. జాకెట్ తీసుకునే అప్పుడు ఇది కూడా గుర్తుంటుంది. ఈ టెక్నిక్ ఇప్పటివరకు బానే వర్క్ అవుట్ అయ్యింది. సమ్మర్ వస్తుంది కదా ఇంకేదన్నా ఐడియా ఆలోంచించాలి.  :(:(:(..

Tuesday, April 29, 2014

Beggar life..(నాదే)

beggar life అంటే ఎవరో అడుక్కునే వాళ్ళ గురించి కాదు, నేను ఎలా beggar అయ్యానో అని.
నేను మొన్నటి వరకు చేస్తున్న project ఇండియా నుండి రాగానే అయిపోయింది. తర్వాత project ఇప్పుడు నాకిష్టం   లేని NewYorkలో వచ్చింది. NewYork ఇష్టం లేదని కాదు, రోజు 2 ట్రైన్లు మారి ఆ subwayలో పడి journey చెయ్యాలి కదా... that's the bad part.
మా ఇంటి దగ్గర నుండి train తీసుకొని, వేరే   station కి వెళ్ళి అక్కడి నుండి office వరకి subway తీసుకోవాలి. ఫస్ట్ ట్రైన్ కి డైలీ టికెట్ తీసుకొవడం కన్నా మంత్లీ పాస్ బెటర్. so దానికి పాస్ తీసుకున్నాను. subway కి metro rail card తీసుకొని కావల్సినంత amount కావల్సినప్పుడు refill చేసుకోవచ్చు. ఇలా ఎలాగోలా కష్టపడి వెళ్ళొస్తున్నా రోజూ :(..

నిన్నటి లాగే ఆరోజూ తెల్లవారింది. నిన్నటి లాగే ఆ రోజూ సూర్యుడొచ్చాడు.  కాని నిన్నటి లాగ ఆరోజు sunday కాదు, monday..అన్ని mondays లానే ఆ రోజూ నేను ఏడుస్తూ, లేవబుద్ది కాకపోయినా త్వరగా లేచా. పాత office అయితే గట్టిగా 15mins కూడా పట్టదు వెళ్ళడానికి. 7:30 తర్వతే లేచేదాన్ని రోజూ. ఇప్పుడు 7:30 కి ట్రైన్ ఎక్కెయ్యాలి  కూడా.. ఫస్ట్ train దిగేసి subway లోకి వెళ్దామని card swipe చేస్తే బ్యాలన్స్ లేదు అని చూపించింది. వెళ్ళి refill చేద్దామని చూస్తే ఏముంది నా bag లో వాలెట్ లేదు.
usualగా నేను అన్ని కార్డ్స్, ఏమన్నా కొంచెం క్యాష్ చిన్న వాలెట్ లో పెట్టుకుని, బయటికి ఏ handbag తీసుకెల్తే దాంట్లో ఈ వాలెట్ షిఫ్ట్ చేస్తూ ఉంటా. bag అవసరం లేకుంటే వాలెట్ ఒక్కటే పట్టుకొని వెళ్తా.
weekend బయటికి వెళ్ళినప్పుడు వేరే bag తీసుకెళ్ళా, వాల్లెట్ అందులోకి shift చేసుంటా. ప్రొద్దున హడావిడిగా వస్తూ ఇందులో పెట్టుకొవడం మర్చిపోయా.అప్పుడప్పుడు ఇలా మర్చిపోతే ఎలా అనే కొంచేం క్యాష్ విడిగా bagలొ పెట్టుకుంటాను.  కాని ఇది కొత్త bag.ఇంకా క్యాష్ పెట్టడం start చెయ్యలేదు దీంట్లో :(:( .
ఫస్ట్ ట్రైన్లో పాస్, metro card only office కి వచ్చే అప్పుడు మాత్రమే కాబట్టి అవి bagలోనే ఉన్నాయి.
one way ticket $2.50, cardలో 50 సెంట్స్ ఉంది, ఒక్క 2 డాలర్స్ కూడా లేవు bagలో. అప్పటికి 8:30 అవుతుంది.ఇప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాలంటే each way గంట journey. ఏ మధ్యాహ్నానికో వస్తాను. అసలే కొత్త job. పోని ఇంటికెళ్ళి work from home చేద్దామన్నా laptop office లోనే ఉంది. ఏం చెయ్యలో అర్థం కాక దిక్కులు చూస్తూ అలోచించా కాసేపు.అప్పుడు ఎవరినన్నా ఒక్క రెండు డాలర్లు అడగటం తప్ప వేరే దారి కనిపించలేదు. మరీ వేరే దేశం వాళ్ళని అడిగితే అడుక్కుతినే దాన్ని కథలు చెప్తున్నా అనుకుంటారేమో  ఏవరన్నా ఇండియన్స్ కనిపిస్తే అడుగుదాం అంటే ఒక్కరు కూడా కనిపించలేదు. ఒక పక్క టైం అయిపోతుంది. ధైర్యం చేసి అడుగుదాం అని prepare అయితే అసలు NY డౌన్‌టౌన్ లో ఎలా ఉంటారు జనాలు.. పరిగెడుతూనే ఉన్నారు.
తీరా అడిగాక ఇవ్వనుపో అంటే తల ఎక్కడ పెట్టుకోను అని ఒకవైపు.ఈలోపు card refill చేసుకోవడానికి ఆగిన ఒకతని దగ్గరికి వెళ్ళా, అమెరికన్,కొంచెం పెద్దతను. వెళ్ళి  can you do me a favour అని అడిగా, ఏంటి అన్నాడు.
నా cards ఉన్న వాలెట్ మర్చిపోయాను, metro card లో balance లేదు, ఒక 2 డాలర్స్ ఇస్తారా అని అడిగా..తను అతని దగ్గర 2$ లేవు కాని, ఒక metro card ఇచ్చి ఇందులో 6$ ఉన్నాయి, use చేస్కో అని చెప్పాడు. thanks చెప్తున్నా సరిగ్గా వినిపించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు.  thank God, మళ్ళీ returnలో కూడా officeలో ఎవర్ని అడగకుండా సరిపోతాయి అనుకొని వచ్చేసా.ఆరోజు ఇంటికి రాగానే చేసిన ఫస్ట్ పని, వాలెట్ తో పాటు కొంచెం క్యాష్ విడిగా పెట్టా bagలో.
Google Image
నేను ఫస్ట్ రోజు subway ఎక్కడానికి వెళ్ళినప్పుడు  ఒక ట్రైన్ వచ్చింది, అందులో fullగా ఎక్కిన తర్వాత కూడా ఇంకా జనాలు ఉన్నారు, లోపల ఇంకా ఎక్కడానికి place లేదు, అయినా తోసుకొని, అలా కుక్కుకొని ఎక్కుతున్నారు.  సర్లే ఇంకో 3,4 mins లో ఇంకోటి వస్తుంది కదా అని అలాగే నిలబడిపోయా, platform ఖాళీ అయినట్టనిపించింది.3 minsలో ఇంకో train వచ్చింది, అదొచ్చే టైంకి మళ్ళీ అంతమంది జనాలు పోగయ్యారు. ఇంక లాభం    లేదని ఇప్పుడు ఏది ముందొస్తే దాంట్లో ఎక్కేస్తున్నా. నిజంగా ఈ picలో చూపినట్టే అంత rush ఉంటుంది రోజూ.

Tuesday, January 7, 2014

సోప్ చాక్లెట్..

మీలో చాక్లెట్స్ అంటే ఎంతమందికి చాలా ఇష్టమో చేతులెత్తండి...పోని కొంచెం ఇష్టమున్న వాళ్ళు కూడా ఎత్తండి.. నాకు తెల్సు దాదాపుగా అందరు ఎత్తేసారు కదా.. ఇప్పుడు ఎత్తిన చేతులు దించి కింది పోస్ట్ చదవండి.
మొన్న  క్రిస్మస్ హాలిడేస్‌కి అందరం ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో కలిసాం. నేను వెళ్ళేఅప్పుడు ఒక చాక్లెట్ box తీసుకెళ్ళా. వెళ్ళగానే అది నేను ఎలా ఉన్నాను అనైనా అడగకుండా ఏమందో తెల్సా..ఇంకోసారి ఇంటికి రావాలనుకుంటే చాక్లెట్స్ కాని స్వీట్స్ కాని తీసుకెళ్ళకూడదట. ఒకవేళ కాదని తీసుకొస్తే  ఇంట్లోకి రానివ్వదట.
ఏం.. పాపం వాళ్ళింట్లో చిన్నపిల్లలెవరో ఉండుంటారు.. వాళ్ళు అన్ని తినేస్తేhealth పాడైపొతుందని భయపడుతుంది అనుకుంటున్నారా....మీరూహించింది కరెక్టే, కాని హాఫ్ మాత్రమే కరెక్ట్. భయమే కాని పిల్లలు లేరు వాళ్ళింట్లో.. భయం వాళ్ళాయన గురించి.
అవును మరి మేం వెళ్ళాక అతికష్టం మీద 10 నిమిషాలు ఆగి ఇంక ఆగలేక ఆ చాక్లెట్ box open చేసాడు. మా ఇంట్లో అయితే ఒక వారం పాటు తిన్నా ఆ box అయిపోదు. తను అచ్చు బఠాణీలో, పల్లీలో తిన్నట్టు టకా టకా నోట్లో వేసుకొని తినెసాడు. మా ఫ్రెండ్ పాపం అరుస్తూనే ఉంది  చాలు చాలు అని. అసలే doctor తనని స్వీట్స్ ఎక్కువ తినొద్దన్నాడట.

Google Image       


ఇంక లాభం లేదని వెళ్ళి లాక్కుని లాస్ట్ ది అని ఒక హాఫ్ bar ఇచ్చింది. సరే అని ఆ సగం బుధ్ధిగా తిని, ఇంట్లో అటు ఇటు ఒక round తిరిగొచ్చ్, అరె ఇక్కడెవరో చాక్లెట్ సగం తిని పెట్టారు.. అలా ఉంచొద్దు అని ఠక్కున మిగతాది కూడా తినేసాడు.

అలాంటి మనిషి ఒకసారి office నుండి train ఎక్కడానికి హడావిడిగా నడుచుకుంటూ వెళ్తుంటే, రోడ్ పైన చాక్లెట్ sample చేతిలో పెట్టారట.చాక్లెట్ చూస్తే ఆగుతాడా ఇంక తను, వెంటనే open చేసి నోట్లో వేసుకొని as usualగా బఠాణి నమిలినట్టు నమిలేసాడు. కాసేపయ్యాక ఇందేంటి నోట్లొంచి నురగొస్తుంది అని doubt వచ్చి, ఇదేదొ తేడా ఉంది అని ఆలోచించి అప్పుదు realize అయ్యాడు, అది చాక్లెట్ కాదు సబ్బు అని.. ;)
భలే దొరికిపోయాడు అందరికి అక్కడున్న ఉన్న 2 days ఏడిపించడానికి.
దీనికి highlight ఏంటంటే మరి నీకు doubt రాలేదా, చాక్లెట్ తియ్యగా లేదని అంటే..అనుకున్నాడట అప్పటికీ ఇదేంటి ఈ చాక్లెట్ తియ్యగా లేదు, sugar ఉన్నవాళ్ళ కోసం specialగా చేసారేమో తియ్యగా లేకుండా అని తినేసాడట.
ఇంకేం చేస్తాడు వెంటనే పక్కనున్న shopలోకెళ్ళి water bottle కొనుక్కొని నోరు కడుక్కొని ఇంటికొచ్చెసాడు...
అదీ సోప్ చాక్లెట్ సంగతి..
by the way  చెప్పడం మర్చిపోయా HAPPY NEW YEAR..

Thursday, September 26, 2013

నేను - నా సినిమా కష్టాలు

సినిమా కష్టాలు అంటే నాకు సినిమాలో లాంటి కష్టాలు ఉన్నాయని కాదు, సినిమా వల్ల కష్టాలు లేదా సినిమా కోసం కష్టాలు.
సంతోషం ప్లస్ బాధ
ఆహ్లాదం ప్లన్ చిరాకు
రెండు కలిపి ఎప్పుడన్నా వస్తాయా..
వస్తాయి ఎప్పుడైనా tasty food తింటున్నప్పుడు పక్కనుండి nasty smell  వస్తేనో..
మనం చేసిన వంట బావుందని మనకే మిగల్చకుండా వేరేవాళ్ళు తినేస్తేనో..
కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఎవరూ చూడకపోతేనో..(కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజు నాకు ఎలా ఉన్నా హాపీగా ఉన్నట్టనిపిస్తుంది మరి)
ఇలాంటప్పుడు ఈ ఇద్దరు ఫీలింగ్స్ కలిసి వస్తారు కదా...

Google Image


ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వస్తారట. ఎందుకో తెల్సా..
ఎందుకంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసా.ఇంక దేనికి అత్తారింటికి దారేదికే.  అంత వరకు బానే ఉంది. ఇది హ్యపీ పార్ట్(hopefully). నాకు సమంత ok, పవన్ కళ్యాణ్ ఇంకా ok, త్రివిక్రం ఇంకా ఎక్కువ ok. సో హ్యపీగానే ఉంటుందనుకుంటున్నా..
ఇంక sad పార్ట్‌కొస్తే ఫస్ట్, theater లో స్క్రీన్ గురించి చెప్పాలి, తర్వాత అందులో సీట్స్ గురించి చెప్పాలి.
నాకేమో ఎంచక్కా పెద్ద స్క్రీన్‌లో సినిమా చూస్తే సంతోషంగా, కంటికి హాయిగా, కడుపు  నిండిపోయినట్టుగా అనిపిస్తుంది.
ఇప్పుడు మేము వెళ్ళే theater లో స్క్రీన్ ఎంత ఉంటుందంటే ఇంట్లో ఉండే home theater కి 4 ఇంచులు అటూ ఇటూ ఉంటుందంతే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లోపలికి అడుగు పెట్టగానే షాక్ అయ్యా ఒక రెండు నిమిషాలు. అప్పటివరకు అలాంటి డొక్కు, పిచ్చి, గలీజ్ theater ఎప్పుడు చూడలేదు. ఇండియాలో చిన్న టౌన్‌లో నేను చూసిన theaters కూడా ఇంతకన్నా బానే ఉంటాయి.ఇందులో అసలు నాకు theaterలో సినిమా చూసిన ఫీలింగే రాదు. ఏదో DVD ప్రింట్ పెద్ద T.Vలో పెట్టుకొని చూసినట్టనిపిస్తది.
మామూలుగా అయితే నాకు స్క్రీన్ open చెయ్యకముందు వెళ్ళి, adsతో సహా చూస్తేనే తృప్తిగా అనిపిస్తుంది. ఒకవేళ రీల్ పడ్డాకో, టైటిల్స్ పడుతున్నప్పుడో వెళితే ఏదో మిస్ అయిపోయినట్టనిపిస్తుంది. ఇంక సినిమా మొదలయ్యాక వెళ్తే అంతే సంగతి, మళ్ళీ ఆ మిస్ అయిన సీన్స్ చూసేవరకు( అందులో ఏమి స్టోరీ జరగకపోయినా).  అలాంటి  ఫీలింగ్ ఏది రాదు ఈ theater లో.
సరే పోని చిన్న స్క్రీన్ అయినా హాయిగా కూర్చొని చూద్దాం అంటే అదీ లేదు. కాస్త త్వరగా వెళ్ళి వెనక సీట్స్‌లో కూర్చుంటేనే సరి, లేకపోతే కొంగలా మెడ పైకెత్తి చూడాలి. సినిమా అయ్యేలొపు మెడ పట్టెయ్యడం ఖాయం. పైగా అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
పోయినసారి ఒక సినిమాకెళ్ళినప్పుడు కాస్త లేట్ అయ్యింది. వెళ్ళే అప్పటికి టైటిల్స్ పడుతున్నాయి. అందరు కూర్చున్నారు. theater  మధ్యలో వరకు నిండిపోయింది. మధ్యలో ఒక 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. వెళ్ళింది ముగ్గురం కాబట్టి అక్కడ సరిపోతాయ్  అని వెళ్ళి కూర్చున్నాం.
కూర్చుంటూ అనుకున్నాం, మధ్యలో ఏ వరస ఒక్కటి మనకొసమే అన్నట్టు వదిలేసారు, లేకపొతే ఇంకా ముందుకెళ్ళి కష్టపడాల్సొచ్చేది అని నవ్వుకుంటూ కూర్చున్నాం. వాళ్ళిద్దరు బానే కూర్చున్నారు. నేను కూర్చున్న సీట్ ఒక సైడ్ కాస్త విరిగిపోయి వంగిపోయి ఉంది.
ఈ సీట్ కొంచెం విరిగిపోయింది, అటు పక్క దాంట్లోకి వెళ్ళి కూర్చుంటా అని పక్కనున్న దానితో చెప్పి, ఆ సీట్‌లోంచి లేచి పక్కకెళ్ళి కూర్చున్నా. అన్యాయంగా ఆ సీట్ ఇంకా ఎక్కువ విరిగి ఉంది, అసలు కూర్చోడానికే రాట్లేదు. మళ్ళీ లేచి పాత సీట్లొకే వచ్చా. అసలే నాకు సినిమా మొదలయ్యాక మధ్యలో లేచి అటు ఇటూ తిరిగితే మొహమాటం, వెనక వాళ్ళు తిట్టుకుంటారేమో అని.
 సరే అని పాత సీట్లో ఒక వైపు వంగి కూర్చొని, మా వాళ్ళకి చెప్పా ఇక్కడ కష్టంగా ఉంది, ముందుకెల్దామా అని. అప్పుడే అసలు కథ మొదలవుతుందేమో మా వాళ్ళు కళ్ళప్పగించి చూస్తున్నారు, నా మాటకు సరిగ్గా రిప్లై కూడా ఇవ్వకుండా. పోని ఒక్కదాన్ని వెళ్దామా అంటే పక్కన వాళ్ళతో డిస్కస్ చెయ్యకుండా ఉండలేను సినిమా మధ్య మధ్యలో.
పైగా మెడ నొప్పి ఉంటది అక్కడ. సో మెడ నొప్పి, నడుము నొప్పిలో రెండో దానికే ఓటేసి ఇక్కడే కూర్చుని సినిమా చూసా.
హ్మ్మ్.. ఆ theaterకే ఇంకాసేపట్లో వెళ్ళబోయేది.
మరి అంత ఇష్టం లేకుండా దానికే ఎందుకు వెళ్ళాలి అంటే ఇంకా ఎక్కడ తెలుగు సినిమాలు రావు కాబట్టి. ఇదేమైనా దగ్గరా అంటే అదీ కాదు, ఈ మాత్రం మహాభాగ్యానికి గంట డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలి. మేమే గంట డ్రైవ్ వేస్ట్ అనుకుంటే, ఇక్కడికి 2,3 గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
సో.. నాకు ఈ రోజు కొంచెం వెనకాల సీట్, విరిగిపోయింది కాకుండా రావాలని ఆశిస్తూ.. 

Sunday, September 22, 2013

ఇలా కూడా మర్చిపోతారా!!

మతిమరుపు అందరికి ఉండేదే. చిన్నదో పెద్దదో రోజు ఏదో ఒక విషయం మర్చిపోవడమో లేదా తప్పుగా గుర్తుంచుకోవడమో చేస్తునే ఉంటాము.అసలు తెలివైన వాళ్ళే చిన్న చిన్న విషయాలు ఎక్కువ మర్చిపోతుంటారట.
ఊరికెల్లే అప్పుడు అన్ని పెట్టుకున్నామనుకొని ముఖ్యమైన వస్తువేదో మర్చిపోవడం,ఏదో తీసుకోవాలనుకొని పక్క రూం లోకి వెళ్ళడం దేనికోసం వచ్చామో మర్చిపోవడం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది.
ఎన్ని సార్లు నా తల పైనే కళ్ళద్దాలు పెట్టుకొని, ఎక్కడున్నాయా అని వెతుక్కున్నా.
ఒకసారి ఒక ముఖ్యమైన అప్లికేషన్ పంపించాల్సి ఉండె.కావాల్సిన అన్ని documents, ఫొటోస్, amount రాసిన చెక్ పెట్టుకున్నా, అన్ని ఉన్నాయా లేవా,పేరు,డీటైల్స్ అన్ని కరెక్ట్ రాసానా లేదా అని ఒకటికి నాలుగు సార్లు వెరిఫై చేసా.
నా రూమ్మేట్ కూడ అప్ప్లై చేస్తుంటే ఇద్దరం కూర్చుని అన్ని పేపర్స్ మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకుని పోస్ట్ చేసాము.
వాటికి రిప్లై రావడానికి కనీసం 10 నుండి 15 రోజులు పడుతుంది. పోస్ట్ చేసాక ఇద్దరం రోజూ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉన్నాం.
4 రోజులయ్యాక నాకు రిప్లై వచ్చింది. అదేంటి అంత తొందరగా వచ్చింది అని ఆశ్చర్యపడుతూ తెరిచి చూస్తే, నేను పంపిన documents అన్ని అలాగే పంపారు.అందులో ఏదో నోటీస్ పంపారు, ఏంటా అని చూస్తే నేను అన్ని documents బానే నింపా కాని, చివర్లో సంతకం పెట్టలేదట.
హ్మ్మ్. సంతకం పెట్టి మళ్ళీ పోస్ట్ చేసా.
ఇంకోసారి ఆఫీస్ laptop ఇంట్లోనే పెట్టి చేతులు ఊపుకుంటు వెళ్ళా. అక్కడికి వెళ్ళి డెస్క్ లో చూస్తే అప్పుడు గుర్తొచ్చింది laptop ముందు రోజు ఇంటికి తీస్కెళ్ళానని. అసలే అప్పటికే లేట్ అయింది, ఇంక హడవిడిగా ఇంటికి తిరిగొచ్చి laptop తీస్కెళ్ళా. ఇల్లు దగ్గరే కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆరోజుకింకా off పెట్టాల్సొచ్చేది.
Google Photo

ఇలాంటిదే ఇంకోటి కాకపోతే నా గురించి కాదు.
పోయిన సంవత్సరం జనవరిలో మా ఫ్రెండ్ ఒకతను ఇండియా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు, తన వీసా ఇంకో 3,4 నెలల్లో expire అవబోతుంది, ఈలోపు వెళ్ళొచ్చేస్తే తర్వాత వీసా మెల్లగా extend చేసుకోవచ్చు అనుకొని ప్లాన్ చేసాడు. తన మాస్టర్స్ అయిపోయి అప్పుడే జాబ్ చేస్తున్నాడు.
అనుకున్నట్టుగానే ఒక 3 వీక్స్ లీవ్ పెట్టి ఇండియా వెళ్లి, హ్యాపీగా ఫ్యామిలీతో enjoy చేసాడు. ఇంకా తిరిగి వచ్చేరోజు వచ్చేసింది. లగ్గేజ్ అంతా సర్దుకొని, immigration కి కావాల్సిన documents అన్ని రెడీగా పెట్టుకొని ఏర్‌పోర్ట్‌కెళ్ళాడు. అందరికి బై చెప్పి లోపలొకి వెళ్ళాక, పాస్‌పోర్ట్ వెరిఫై చెయ్యడానికి ఆఫీసర్‌కి ఇచ్చాడు. అతను పాస్‌పోర్ట్ చూసి "బాబూ నీకు అసలు ఏ దేశం వీసా లేదు, ఎక్కడికి వెళ్ళేది!!!" అన్నాడు. ఇతను షాక్ అయ్యి పాస్‌పోర్ట్ చూస్తే వీసా మే వరకు ఉంది, కాని 2012 కాదు, మే 2011 !! :((

అంటే వీసా expire అయిపోయి చాలా నెలలైంది. (వీసా expire అయినా US లో ఉండొచ్చు, valid status ఉంటే. కాని ఒకసారి US బయటికి వెల్తే మాత్రం తిరిగి రావాలంటే వీసా ఉండాలి).
తను అప్పుడెప్పుడో పాస్‌పోర్ట్ చూసుకొని, మే 2012 అని గుర్తు పెట్టుకున్నాడు, 2011 బదులు. తనేం అజాగ్రత్త మనిషి కూడా కాదు, ఇంకా చెప్పాలంటే చాలా జాగ్రత్త మనిషి. వెళ్ళేముందు job verification letter అదీ, ఇదీ అన్ని చూసుకున్నాడు కాని వీసా విషయం చూసుకోలేదు. 
తనేమో తప్పనిసరిగా US రావాలి, అప్పుడే MS అయిపోయి జాబ్ జాయిన్ అయ్యాడు, ఇంకా MS లోన్ అంతా అలానే ఉంది. 
చేసేది లేక ఇంటికెళ్ళి, మళ్ళీ వీసా కి అప్ప్లై చేసుకొని కొన్ని రోజులకి వచ్చాడు. వీసా వచ్చేలోపు చూడాలి తన టెన్షన్. అప్పుడు టెన్షన్ పడి అందర్ని టెన్షన్ పెట్టాడు కాని , తర్వాత ఎన్ని సార్లు నవ్వుకున్నామో అసలు అంత పెద్ద విషయం అలా ఎలా మర్చిపోయాడా అని. 


Wednesday, September 11, 2013

కారులో షికారు -2

So అలా మాస్టర్స్ అయ్యేవరకి కార్ లేకుండా ఎలా గడిపామో ఇక్కడ చెప్పా కదా..చూస్తుండగానే MS అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్‌తో ఉంటూ ట్రైనింగ్ తీసుకొని,జాబ్స్ కి ట్రై చేస్తుండేదాన్ని. ఆ ట్రయల్స్ కథ ఇంకోసారి చెప్తా, ఇప్పుడు ఒన్లీ కార్ గురించి. ఇప్పుడు ఉండేది కాస్త పెద్ద సిటీ కాబట్టి, బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా లోకల్ ట్రైన్స్,బస్సులు ఉండేవి అందుకని ఎక్కువ ప్రాబ్లం ఏమి అవలేదు.
అలా జాబ్స్ ట్రై చేస్తూ ఏమైనా ఫోన్ ఇంటర్వ్యూ ఉంటే ఇంట్లోనుండే అటెండ్ అవుతూ, దగ్గర్లో ఏవైనా F2F(ఫేస్ to ఫేస్) ఉంటే వెళ్ళివచ్చేదాన్ని.
ఒకసారి 3-4 గంటల్లో ఉండే ఊరిలో ఇంటర్వ్యూ  సెట్ అయ్యింది. అప్పటికే దానికి ఫోన్ రౌండ్ clear అయింది కాబట్టి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువే ఉంది.అప్పటికి చాలా రోజుల నుండి జాబ్ కి ట్రై చేస్తున్నా దీనికి కాబట్టి వెళ్తే బావుంటదని అనుకున్నా.
అక్కడ మాకు తెల్సిన వాళ్ళు ఎవరూ లేరు తీస్కెళ్ళడానికి. ఇంక ఫ్రెండ్స్‌ని కనుక్కుంటూ ఉన్న ఎవరైనా తెల్సిన వాళ్ళు ఉన్నారేమో తీస్కెళ్లడానికి అని. ఆ టైమింగ్స్ కి, ఆ ప్లేస్ కి బస్సులో వెళ్ళడం కుదరదు. ఈలోపు మా ఫ్రెండ్ తన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అక్కడ, మనలాగే స్టుడెంట్, కావాలంటే తీసుకెళ్ళి, తీసుకొస్తాడు.కాని కార్ రెంట్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు కాకుండా, అతనికి కూడా కొంచెం మనీ ఇవ్వాలి అని చెప్తే, OK అనుకున్నా ఇంక. అదేంటి సాటి తెలుగువాడు అయ్యుండి, మనీ ఎందుకు తీసుకుంటున్నడు అంటే, పాపం అతను మరి తన చేసే జాబ్ off పెట్టి వస్తున్నాడు కదా అందుకని. ఇంక అతనితో మాట్లాడి ఎలాగోలా సెట్ చేసుకొని ఇంటర్వ్యూకెళ్ళొచ్చా. ఆ జాబ్ రాలేదనుకోండి అది వేరే విషయం. అప్పుడొచ్చింది నాకు చిరాకు, అసలు నాకు లైసెన్స్ ఉంటే ఇంత కష్టం అవకపోయేది కదా అని. పోని అప్పుడైనా తీసుకోవచ్చు కదా అంటే ఆ జాబ్ లేని టైంలో అది వెతుక్కొవడానికే సరిపోయెది, ఇంక అంత ఖర్చు పెట్టి క్లాసులకేం వెళ్తాం.
ఆ తర్వాత కొన్ని రోజులకి ఫస్ట్ జాబ్ వచ్చింది.  అక్కడికి వెళ్ళాక వెంటనే అయితే కార్ ఏం అవసరం పడలేదు. అది కూడా కాస్త చిన్న సిటీనే, ఇంటి దగ్గర నుండి ఆఫీస్ కి కరెక్ట్‌గా ఆఫీస్ టైంలో ఒక బస్ ఉండేది. అందులో వెళ్ళొచ్చేదాన్ని. ఆ ఆఫీస్ మొత్తం మీద బస్‌లో వచ్చేదాన్ని నేనొక్కదాన్నే.
ఆఫీస్ కి మార్నింగ్ 9 కి లాస్ట్ బస్ ఉండేది, అది మిస్ అయ్యామో మళ్ళి సాయంత్రం వరకు ఉండదు. మిస్ అయితే అంతే సంగతులు అన్నమాట. ఒక 2,3 సార్లు అలా మిస్ అయితే చచ్చినట్టు క్యాబ్ తీసుకొని వెళ్ళాల్సొచ్చింది మరి. ఎండా కాలం అయితే ఏం ప్రాబ్లం అనిపించకపోయేది కాని చలి కాలం మంచులో బస్ వచ్చేవరకు వేచి ఉండాలంటే మాత్రం కష్టం అయ్యేది,అది కూడా రోడ్ పైన్నే,జస్ట్ షెడ్ లాగా ఉండేది.బస్టాప్ ఏమీ ఉండదు. చాలమటుకు టైంకే వచ్చేది కాని, ఒక్కోసారి లేట్ అయ్యేది.
అప్పుడైతే గట్టిగా డిసైడ్ చేసుకున్నా ఇంక లైసెన్స్ తీసుకోవడమే నా తర్వాతి అర్జెంట్ పని అని.
అప్పుడింకా ఒక ఫ్యామిలీ తో paying guestగా ఉండేదాన్ని. ఫెండ్స్‌తో ఉన్నా బోర్ కొట్టకపోయేది. బయటికి వెళ్దాం అన్నా కొత్త ప్లేస్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. కార్ ఉన్నా నాది నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి ఉండేది. అప్పుడైతే కార్ లేకపోవడాన్ని బాగా మిస్ అయ్యా.
గంటకి 50 కాదు 60 $ అయినా సరే అని డ్రైవింగ్ వచ్చేవరకి క్లాస్సెస్ తీసుకొన్నా.ఇది వేరే రాష్ట్రం కాబట్టి మళ్ళీ learners తీసుకొని, క్లాస్సెస్ తీసుకొని ఫైనల్ గా లైసెన్స్ తీసుకున్నా. చిన్న చిన్న అవసరాలుంటే అప్పుడప్పుడు కార్ రెంట్ తీసుకొని నడిపేదాన్ని.


Google Image


ఈలోపు ఈ జాబ్ అయిపోయింది, మళ్ళీ కొత్త జాబ్స్ కి ట్రై చెయ్యడం స్టార్ట్ చేసా. ఈసారి మళ్ళీ ఇంటర్యూకి వెళ్ళాల్సొచ్చినప్పుడు ఫస్ట్ టైం కార్ తీసుకొని 3 గంటలు అటూ, 3 గంటలు ఇటూ డ్రైవ్ చేసినప్పుడు I was so excited.......
వెళ్లొచ్చాక ఆ రోజు నైట్ ఏదో సాధించానన్నంత ఫీల్ అయ్యా :( అప్పటికి మా ఫ్రెండ్స్ చాలా మందికి ఇంకా డ్రైవింగ్ రాదు మరి.
తర్వాత జాబ్ వచ్చాక ఇక్కదా ఆ మాత్రం బస్ కూడా లేదు. కొన్ని రోజులు colleague తో కార్‌లో వెళ్ళాక, కొంచెం కుదురుకున్నాక అప్పుడు నా సొంతగా, మొదటగా కారు కొన్నాను. నాకిష్టమైన కారు.
ఇప్పుడు ఝాం ఝాం అని హాయిగా నా కార్లో షికారు చేస్తున్నా రోజూ...

అసలు కొంటే కొసరు ఫ్రీ అన్నట్టు ఈ పోస్ట్ చదివినందుకు కొసరు
 Don't think about past which is lost
 Think about present which is pleasant
 Don't worry about future, which may be brighter

Tuesday, September 10, 2013

కారులో షికారు

నువ్వు రాకముందు నా చుట్టూ ఎంత ఒంటరితనం
నువ్వు లేకముందు ఏది ఇప్పుడున్న ఆనందం

ఎన్ని ఉదయాలు వేచాను నీకోసం
నువ్వొచ్చాకే కదా వచ్చింది వసంతం..
హహ బావుందా దేనికోసం అనుకుంటున్నారు ఇదంతా..చెప్తా.చెప్తా..

నేను US వచ్చి కాలేజ్ లో ఎలా జాయిన్ అయ్యనో ఇక్కడ చెప్పా కదా.అలా కాలేజ్ లో చేరడమూ, రూం అదీ సెట్ చేసుకొవడమూ, ఖాళీగా ఉన్నప్పుడు క్లాసులకి వెళ్ళిరావడమూ మిగతా టైం అంతా సినిమాలు చూస్తూ గడిపేయడం తో సరిపోయేది. మా ఇల్లు ఎదురుగా రోడ్, రోడ్డుకి అవతల మా కాలేజ్, కొంచెం దూరం లోgrocery షాప్ అంతే మాకు తెలిసింది అప్పుడు. ఎక్కడికి వెళ్ళాలన్నా,  బయట చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా నడుచుకుంటూ వెళ్ళడమే. కాలేజ్‌లో ఇండియన్స్ చాలా మంది ఉన్నా ఎవరి దగ్గరా కార్ ఉండేది కాదు. ఒకరి దగ్గరో ఇద్దరి దగ్గరో ఉండేది కాని వాళ్ళెవరు తెలీదు. ఇంట్లోకి కాస్త ఎక్కువ సామాను కావల్సి వస్తే రూంలో ఉన్న నలుగురం కలిసి వెళ్ళి మోసుకుంటూ తెచ్చుకునే వాళ్ళం.
ఎండా కాలం అయితే ఎక్కువ కష్టం అవకపోయేది కాని,చలికాలం లో ఐతే పూర్తిగా కవర్ చేసుకొని, చేతులకి గ్లవుస్ వేసుకొని 2 చేతుల్లో 2 క్యారీ బాగ్స్ పట్టుకొని వచ్చేవాళ్ళం.
కారు ఉన్నవాళ్ళకి కుదిరినప్పుడో, ఎవరైనా కార్ రెంట్ చేసినప్పుడో మాకు పండగ అన్నమాట. మేము 2 పక్క పక్క అపార్ట్‌మెంట్స్ లో అందరం అమ్మాయిలమే ఉండేవాళ్ళం. కార్ దొరకగానే ఒక్కో ఇంట్లోంచి ఒక్కరో ఇద్దరో కాస్త దూరంలో ఉన్న పెద్దది, అన్ని దొరికే షాప్ కి వెళ్ళి నెలకి సరిపడా,కార్ ట్రంక్‌లో పట్టనన్ని తెచ్చుకునేవాళ్ళం. ఆ తర్వాత కొన్ని రోజుల వరకి ఇంట్లో తినడానికి వెతుక్కోకుండా ఉండేది. అమ్మాయిలెవరికి కార్ రాదు కాబట్టి అక్కడ ఉన్నన్ని రోజులు ఈ బాధలు తప్పేవి కాదు.
మాస్టర్స్ లో ఉన్నన్ని రోజులు ఇండియన్ స్టోర్ అనేదే తెలీదు మాకు. ఒక చిన్న పాకిస్తాని స్టోర్ ఉండేది, పప్పులు అవీ కావాలంటే అక్కడ దొరికేవి, కాని ఇంకే దేశి కూరగాయలు ఏవి దొరికేవి కాదు.ఇప్పుడైతే వారానికి ఒకసారి ఇండియన్ స్టోర్ వెళ్ళకుండా  గడవనే గడవదు.
స్టూండెంట్స్ off campus జాబ్స్ చేసుకునే placesలో ఐతే రోజు ప్రయాణం చెయ్యాలి కాబట్టి కొందరికి అయినా కార్స్ ఉండేవి కాని, చెప్పాగా నేను ఉండేది చిన్న ఊరు కాబట్టి బయట జాబ్స్ ఎవరూ చేసేవాళ్ళు కాదు.
ఇంక మా కాలేజ్ నుండి లోకల్‌లో తిరగడానికి ఒక బస్ ఉండేది. కాని అది ఒకే రూట్‌లో తిరిగేది. ఆ రూట్లో మాకు కావల్సినవేవి ఉండేవి కాదు. సో దాని వల్ల ఏమి ఉపయోగం లేదు.

ఇప్పుడొక ప్రశ్న మీకు.
అమ్మాయిలకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది.
A. చదువు
B. ఫ్యామిలీ
C. ఉద్యోగం
పోనీ ఇంకోటి
అమ్మాయిలు ఏ పని చెయ్యకుండా అయినా ఉంటారు కాని ఇది లేకుండా ఉండలేరు. ఏంటది..
ఇంకేంటది షాపింగే కదా..మొదట్లో కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళకపోయేవాళ్ళం. తర్వాత్తర్వాత ఎవరైనా తీసుకెళ్తే షాపింగ్ కి వెళ్ళేవాళ్ళం.ఇంక మాక్కొంచెం అలవాటు అయ్యాక షాపింగ్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు కాబ్ లో వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కాబ్ కాస్ట్లీ కదా, కాని మాకొక కాబ్ డ్రైవర్ ఉండేవాడు, కార్లో ఎంత మంది ఎక్కినా ఎక్కించుకునేవాడు. ఒకే ట్రిప్‌లో అయిదుగురం, ఆరుగురం వెళ్ళేవాళ్లం, ఇండియాలో ఆటోలో వెళ్ళినట్టుగా ఒకరి మీద ఒకరం కూర్చుని.
అప్పటికి మాలో అంతా కొత్తవాళ్ళు కాబట్టి ముగ్గురు కన్నా ఎక్కువ మంది కార్‌లో కూర్చోకూడదు,కాప్ చూస్తే ప్రాబ్లం అవుతుంది అని కూడా తెలీదు. ( ఆ తర్వాత మాస్టర్స్ అయిపోయాక ఒకసారి తప్పక కార్‌లో వెనకాల నలుగురం కూర్చుంటే కాప్ ఆపి టికెట్ వేసాడు).
ఆ డ్రైవరే ok చెప్తే మాకేం తెలుస్తది ఇంక. మాల్ మాకు ఎక్కువ దూరం కాదు కాబట్టి ఒక 20-25$ అయ్యేది అంటే మనిషికి 3,4 $ అన్న మాట. ఇదేదొ బావుందని ఎప్పుడూ అలానే వెళ్ళేవాళ్లం.
తర్వాత ఇంకా మాస్టర్స్ అయ్యేలోపు ఎలాగైనా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందాం అని అనుకున్నాం. దాని కోసం మొదట Learners టెస్ట్ రాసి, అది పాసయ్యక రోడ్ టెస్ట్ ఇవ్వాలి. ఎలాగొలా Learners అయితే తీసుకున్నాను. తర్వాత డ్రైవింగ్ నేర్చుకోవడానికి గంటకు 40-45$ ఖర్చు పెట్టి నేర్చుకోవాలి. అప్పట్లో అది పెద్ద మొత్తం కదా, అప్పటికి కొన్ని క్లాస్సెస్ తీసుకున్నాను కాని లైసెన్స్ అయితే తీసుకోలేదు. మా ఊరిలో లైసెన్స్ ఇవ్వలంటే ఎవరిదన్న సొంత కార్ ఉండాలి, ఆ టైంలో ఇంక లైసెన్స్ తీసుకోవడం అయితే కుదర్లేదు.
ఇంక మాస్టర్స్ అయిపోయేవరకి కార్ నేర్చుకోకుండా, బయటి ప్రపంచం తెలీకుండా బతికేసాం. మాస్టర్స్ అయిపోయి బయటికి వచ్చాక కాని అర్థం కాలేదు, లైసెన్స్ లేకుండా ఎంత కష్టమో. దాని వల్ల ఎన్ని కష్టాలు పడాల్సొచ్చిందో రేపు చెప్తా.

 

Thursday, August 1, 2013

అతివృష్టి - అనావృష్టి

అతివృష్టి - అనావృష్టి వర్షాల గురించి కాదు, ఎండ- వేడి, మంచు- చలి. ఇండియా లో హయిగా వర్షాలు పడుతూ ఉంటే ఇక్కడేమో ఎండలతో కష్టపడుతున్నాం. ఈసారి సమ్మర్ లో ఐతే 102,103 వరకు చేరింది టెంపరేచర్. చూడండి
ఇది నిన్న సాయంత్రం 6 గంటలకు తీసింది.సాయంత్రమే  అలా ఉంటే మధ్యాహ్నం  ఎలా ఉండి ఉంటుందో.
మొన్నొకరోజు బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ కార్లో మర్చిపోయి ఒక గంట తర్వాత తీస్కెళ్దామని వచ్చాను. చూసేసరికి స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోయి warning symbol తో  మెస్సేజ్ dislpay అవుతుంది, ఏమనో తెల్సా  ఫోన్ ఓవర్ హీట్ అయ్యింది,మళ్ళీ వాడేముందు కాసేపు చల్లని ప్లేస్ లో ఉంచమని. ఇలాంటిది ఐతే ఇంతకుముందెప్పుడు చూళ్ళేదు. ఒక గంటకే అలా అయిపోతే అలానే సాయంత్రం వరకు వదిలేస్తే ఇంక పనికి రాకుండా అయిపోయేదేమో.
అలా అని పోన్లే ఎండాకాలం లో కొన్ని రోజులు కష్టపడితే పడ్డారు, చలికాలం లో వేరే చోట్లలో మంచు పడుతుంటే ఇక్కడ హాయిగా ఉండొచ్చు అనుకోవడానికి లేదు. చలికాలం  ఇక్కడ ఎలా ఉంటుందంటే
మీరే చూడండి


ఇది ఈ సంవత్సరం వింటర్ మా ఇంటి ముందు. అక్కడ రెడ్ కలర్ లో రౌండ్ చేసానే అదే నా కార్.బంపర్ తప్ప అంతా మునిగిపోయింది కదా మంచులో.ఈ ఫిబ్రవరిలో ఐతే దాదాపు ప్రతిరోజు స్నో పడింది.
మంచు పడడం ఆగిపోగానే నడవడానికి, డ్రైవ్ చెయ్యడానికి వీలుగా ఉండేలా   అపార్ట్‌మెంట్ వాళ్ళు అంతా క్లీన్ చేపిస్తారు, మంచు అంతా తీసెయ్యడానికి వీలుగా ఎవరి కార్ వాళ్ళు అక్కడి నుండి తీసి పక్కకి పెట్టాలి. ఆ క్లీన్ చేసేవాళ్ళూ మధ్యలో  అంతా చేస్తారు కాని మన కార్స్ ని ఎందుకు చేస్తారు. అందుకే అదంతా కార్ మీద నుండి తీసి క్లీన్ చెయ్యక తప్పదు.
 ఆరోజు అదంతా తీసెయ్యడానికి నాకు ఒక 2 గంటలు పట్టింది. ఆ చల్ల గాలికి కాళ్ళకి, చేతులకి ఎంత కప్పుకున్నా, స్నో లో అంతసేపు ఉండే సరికి ప్రాణం పోయినట్టైంది.
ఈ ఎండలో ఆ మంచు ని చుస్తుంటే హయిగా అనిపిస్తుంది ఒకవైపు, మరోవైపు అమ్మో!!! మళ్ళీ చలికాలం వస్తే ఆ చలిని ఎలా భరించాలి అనిపిస్తుంది.
హ్మ్... అందుకే అన్నది ఐతే అతివృష్టి లేకపోతే అనావృష్టి.

Tuesday, July 30, 2013

గన్ షూటింగ్

ఎప్పుడు షాపింగూ, రొటీన్ పనులు కాకుండా ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాం అనుకుని, దగ్గర్లో ఏమున్నాయి అని వెతుకుతూంటే గుర్తొచ్చింది, గన్ షూటింగ్ రేంజ్ ఉంది దగ్గర్లోనే, పైగా ఎప్పుడూ వెళ్ళలేదు కూడా.
షూటింగ్ రేంజ్ అంటే అక్కడ కొంత స్పేస్ తో కొన్ని లైన్స్ ఉంటాయ్. ఒక్కో లైన్లో
కావాల్సిన దూరం లో ఒక టార్గెట్ ని సెట్ చేసుకొని, గన్ తో షూట్ చెయ్యాలి. గన్ అంటే బొమ్మ గన్ కాదు, నిజ్జంగా నిజం  తుపాకినే.   అందులోకి వెళ్ళే ప్రతి మనిషికి కొంత ఛార్జ్ చేస్తారు, ఇంకా గన్ కి, బుల్లెట్స్ కి మనకి కావాలనుకున్న దాన్ని బట్టి రెంట్ తీసుకోవాలి.
సరే వెళ్దాం అని డిసైడ్ అయ్యాక, appointment తీస్కుందాం అని కాల్ చేస్తే, కేవలం members మాత్రమే reservation చేసుకోవచ్చంట. మాకు మెంబర్‌షిప్ లేదు కాబట్టి వెళ్ళి లైన్లో వెయిట్ చేస్తే అప్పుడు బుక్ చేసుకోవచ్చు అని చెప్పాడు, కావాలంటే మన సొంత గన్స్ కూడా తీస్కెళ్ళొచ్చు అంట.
అక్కడికెళ్ళాక  ఒక ఫాం నింపమని ఒక అరగంట వెయిట్ చేయించాక మా ID కార్డ్స్ తీసుకున్నాడు. చాలా గన్స్, రైఫిల్స్ చాలా రకాలవి డిస్‌ప్లే  లో పెట్టి ఉన్నాయ్. వెళ్ళనైతే వెళ్ళం కాని వాటిని చూడగానే కొంచెం భయమేసింది. చాలా మంది వాళ్ల సొంత గన్స్ అనుకుంటా బయటి నుండి తెచ్చుకుంటున్నారు, అయిపోగానే వాళ్ళతో తీస్కెళ్తున్నారు.
  ఒకసారెప్పుడో  TV లో చూసా, గన్ పేల్చితే ఆ ఫోర్స్ కి పేల్చిన వ్యక్తి వెనక్కి పడిపోయాడు. మనకి మరీ ఆ రేంజ్ లో వద్దని, వాడికి చెప్పాం, ఇదే ఫస్ట్ టైం షూటింగ్ రావడం సో కొంచెం ఈజీ   గా ఉండేది ఇవ్వమని.
మొత్తం నలుగురం వెళ్ళాం కాబట్టి 2 గన్స్ చాలనుకున్నాం. వాడు ఒక పిస్టల్ ఇంకా ఒక రైఫిల్ తీసి, వాటిని ఎలా పట్టుకోవాలో, ఏ position లో నిల్చోవాలి, ఎలా ఫైర్ చెయ్యాలి అంతా చూపించాడు.
తర్వాత బుల్లెట్స్ తీసుకొచ్చి, లోడ్ చెయ్యడమూ, రీఫిల్ చెయ్యడం చూపించాడు. అలా 2 గన్స్ రెంట్ తీస్కొని, కళ్ళకి, చెవులకి సేఫ్టీ కోసం  గ్లాసెస్, ear muffs పెట్టుకొని లోపలికి వెళ్ళాం. 
Google Image
ఏ రోడ్ మీదనో ఇంకెక్కడో ఒక సైకో వచ్చి మనల్ని గన్ తో షూట్ చేస్తే అయ్యో పాపం అనుకుంటారు కాని, ఇప్పుడు ఎవరన్నా మనల్ని కాల్చేస్తే కనీసం పాపం అని కూడా అనుకోరు అనుకున్నాం.  
లోపల కూడా ఒక ఆఫీసర్ ఉన్నాడు, డౌట్స్ వస్తే చెప్పడానికి ఇంకా ఎలా షూట్ చేస్తున్నారో చూడడానికి. 
ఇంకా ఆ గన్స్ లో ఒక్కో బుల్లెట్ మెల్లగా లోడ్ చేస్తూ, మధ్య మధ్యలో అతన్ని మళ్ళీ అడిగి  మొత్తానికి ఒక గన్ లోడ్ చేసాం, మళ్ళీ సరిగ్గా లోడ్ చెయ్యక తేడా వచ్చి అది వెనక్కి పేలిపోతే ఎలా అని( అతడు సినిమా లో లాగ). అందరు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే మేము మాత్రం అన్నిటికన్నా పెద్దగా ఉన్న టార్గెట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం దగ్గర్లో సెట్ చేస్కున్నాం.
ఇంక ఫస్ట్ బుల్లెట్ పెల్చే అప్పుడు మాత్రం నిజంగానే కొంచెం చేతులు వణికాయి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నలుగురం కలిపి గంటలో ఒక 20 కూడా కాల్చామో లేదో ( వాడు 200 బుల్లెట్స్ ఇచ్చాడు, గంటసేపు  ఉంటాం అంటే). ఇంకా చాలని చెప్పి వచ్చేసాం. 
అదీ సంగతి.. 

Friday, July 26, 2013

నా ఫస్ట్ & లాస్ట్ బస్ ప్రయాణం-2

అలా ఇక్కడ చెప్పినట్లు ఇంక ఫ్లైట్ బుక్ చేసుకుందాం కొత్త యూనివర్సిటీ కి అని రూం కి వెళ్ళాను.  వెళ్ళేముందు అక్కడ ఎవరితోనైనా మాట్లాడితే బావుంటుందేమో అని నాతో పాటు జాయిన్ అయ్యే ఇంకో అమ్మాయిని  కాంటాక్ట్ అయి కాల్ చేసాను. 
తనేమో ఎల్లుండే ఇక్కడ Student orientation, అందరు స్టూడెంట్స్  రోజు రిపోర్ట్ చెయ్యాలి అని చెప్పింది. అంతేకాదు క్లాసులకి కూడా ఆరోజే రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే క్లాస్ ఫుల్ అయిపోతే  కష్టం అంది. ఎల్లుండే అంటే నేను రేపు ఎలాగైనా బయల్దేరాలి ఇక్కడి నుండి. ఇప్పుడు ఫ్లైట్ బుక్ చెయ్యాలి, అంతకన్నా ముఖ్యం గంట దూరం లో ఉన్న ఏర్ పోర్ట్ లో డ్రాప్ చెయ్యడానికి  ఎవరినైనా అడగాలి. 
రూం లో ఉన్న సీనియర్ కి విషయం చెప్తే, ఎవరినైన కనుక్కుంటాను డ్రాప్ చేస్తారేమో అంది. సరేలే అని వెళ్ళి టికెట్ కోసం చూస్తే కళ్ళు తిరిగే అంత ఉంది రేట్. ఎలాగో నాకు నేనే నచ్చచెప్పుకోని, పర్లేదులే టికెట్ రేట్ పోతేపోయింది, ఎలాగూ అక్కడ ఫీ తక్కువ కదా.. దాంట్లో సేవ్ చేస్తున్నాం కదా అనుకొని ధైర్యం తెచ్చుకున్నా. 
కాని అసలు సమస్య ఇంకా తీరలేదు, రేపు డ్రాప్ చెయ్యడానికి ఎవరు లేరు, అక్కడ కార్ ఉన్నవాళ్ళే తక్కువ , అందులోను రేపు కావల్సిన టైం లో ఎవరుంటారు, పైగా వర్షం కూడా ఉందట. 
అసలే కోతి, పైగా కల్లు తాగింది, ఆ పైన తేలు కుట్టింది టైపులో కష్టాలన్ని ఒకదాని పైన ఒకటి ఉన్నాయి అనిపించింది. 
ఈ డిస్కషన్ లో ఎవరో చెప్పారు,ఇక్కడ grey hound అని బస్సులు ఉంటాయ్ ప్రొద్దున ఎక్కితే, రాత్రి కల్లా చేరుకోవచ్చు. పైగా అది ఇంటి దగ్గర్లొనే ఎక్కొచ్చు అని చెప్పారు. బస్ టైమింగ్స్ చూస్తే ఉదయం 8 కి బయల్దేరి, రాత్రి 7 కి చేరేలాగ ఒక బస్ ఉంది, దగ్గరే కబట్టి వాళ్ళ పని డిస్ట్రబ్ అవకుండ ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారు. ఇంకా లేట్ చేస్తే ఇది కూడా ఉండదేమో అని బుక్ చేసా బస్ టికెట్. కాని ఇక్కడ ఇంకో సమస్య ఉంది,ఆ 11 గంటల జర్నీ లో మధ్యలో ఒక చోట బస్ మారాలి.
అసలే యు.ఎస్ కి కొత్త, ఇక్కడ ఏవి ఎలా ఉంటాయో ఎమి తెలియదు, పైగా ఇండియా నుండి తెచ్చిన లగ్గేజ్ అంతా నాతో ఒక్కదాన్నే మోసుకెళ్ళాలి. సరే ఎలాగైన వెళ్ళక తప్పదు కదా అనుకొని ధైర్యం తెచ్చుకున్నా, రాత్రంతా నిద్ర సగం  సగం నిద్ర, తర్వాతి రోజు ఎదో అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నట్టు అనిపించింది. 
మర్నాడు ప్రొద్దున్నే మా రూమ్మేట్ ఫ్రెండ్ డ్రాప్ చేసాడు బస్టాప్ లో. లగ్గేజ్ అంతా తన సహాయం తో బస్ కింద ఉన్న లగ్గేజ్ స్పేస్ లో పెట్టి బస్ ఎక్కి కూర్చున్నా.
 అలా యు.ఎస్ లో మొదటిసారి బస్ ఎక్కానన్నమాట. 

ఇక్కడి నుండి 6 గంటలు ఈ బస్ లో ప్రయాణించిన తర్వాత ఒక స్టేషన్లో ట్రాన్స్‌ఫర్ అయ్యి వేరే బస్ ఎక్కాలి. అక్కడ 2 గంటలు వెయిటింగ్ మళ్ళీ 3 గంటలు ఇంకో బస్ లో వెళ్తే నేను వెళ్ళాల్సిన ఊరు వస్తుంది, (ఊరు అంటే నిజ్జంగా ఊరే అక్కడ మా కాలేజ్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. అసలు ఆ ఊర్లో కాలేజ్ పెట్టలేదు, కాలేజ్ ఉంది కాబట్టే అక్కడో ఊరు ఏర్పండిందేమో అనిపిస్తుంది నాకు).
బస్ లో ఎక్కువ జనం లేరు, ఒక సగం బస్ నిండా ఉండి ఉంటారు. ఖాళీగా ఉన్న సీట్లో వెళ్ళి కూర్చున్నా. నా పక్కన ఎవరు కూర్చుంటారో ఏమో అని భయపడ్డా బస్ స్టార్ట్ అయ్యింది కాని  ఎవరూ రాలేదు. నేను చూసినంత వరకు ఎవరూ ఇండియన్స్ ఎక్కినట్టు అనిపించలేదు. మధ్యలో కొన్ని చోట్ల బస్ ఆగింది కాని నేను మాత్రం ఇంక ఆ 6 గంటలు  ఆకలేసినా,దాహమేసినా సీట్లోంచి లేవకుండా అలాగే కూర్చుండిపోయా.  బస్ ఆగినప్పుడల్లా అది ఏ ఊరో అనౌన్స్ చేస్తున్నారు.నేను దిగాల్సిందే చివరి స్టేషన్ కాబట్టి వాటి గురించి పట్టించుకోలేదు.
ఫైనల్ గా ఒక 30-40 నిమిషాలు లేట్ గా నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.బస్ దిగి కింద స్పేస్ లో ఉన్న చెక్ ఇన్ బ్యాగ్స్ తీసి కింద పెట్టా.బస్ ని స్టేషన్ బిల్డింగ్ కి ఆనుకొనే ఆపారు. అయినా కానిమొత్తం లగ్గేజ్ ఒకేసారి తీసుకొని లోపలొకి వెళ్ళలేను, ఎలాగా అని ఆలోచిస్తూ వాటితో కష్టపడుతుంటే ఒకతను వచ్చి 2 పెద్ద సూట్‌కేస్ లని పట్టుకొని లోపలికి తీస్కెళ్ళాడు.  
లోపల బిల్డింగ్ చాల చిన్నదిగ ఉంది, ఇక్కడ జనం ఎక్కువగానే ఉన్నారు.తర్వాతి బస్ ఎక్కడ ఎక్కాలో ఏమో కనుక్కుందాం అని లగ్గేజ్ అంతా కనిపించే అంత దగ్గర్లొ పెట్టి అక్కడే కౌంటర్ లో వెళ్ళి అడిగా.   కౌంటర్లో ఉన్న అమ్మాయి ఎక్కడ బస్ ఎక్కాలో చూపించింది. అది కనిపించే అంత దూరంలోనే ఉంది కాబట్టి వెళ్ళి నా లగ్గేజ్ దగ్గరే నిల్చున్నా, అక్కడ కూర్చోవడానికి ఏమి కనిపించలేదు. పైగా ఆ సామాను పట్టుకొని అటు ఇటు తిరగలేను కాబట్టి అక్కడే నిల్చున్నా ఇంక .
అక్కడే అక్కడే అక్కడే.....  నాకు అమ్రుతం దొరికింది, అంటే అంత టైం తర్వాత నీళ్ళు తాగితే అలానే ఉంటది కదా!!కాని తినడానికి ఏమి కనిపించలేదు, వెతికే ఓపిక కూడా లేదు.
ఇంకా గంట టైం ఉంది కాని, ఇంకో 15-20 నిమిషాల్లో ఆ డోర్ ముందు లైన్లో నిలబడటం మొదలు పెట్టారు జనాలు, నేను కూడా వెళ్ళి కలిసా అందులో. లైన్ పెద్దది అయ్యింది కాని గేట్ ఎంతకీ ఓపెన్  చెయ్యరు, అలా ఇంకొంచెం సేపు వెయిట్ చేసాక  ఒక్కొక్కర్ని టికెట్ చెక్ చేస్తూ బస్ లో కి పంపించారు.ఈ బస్ మొత్తం నిండిపొయింది.నా పక్కన ఎవరో ఒకతను వచ్చి కూర్చున్నాడు. ఎంతకీ బస్ స్టార్ట్ అవదు, చాలాసేపు తర్వాత అనుకున్న టైం కన్నా ఒక అర గంట లేట్ గా బయల్దేరింది.
ప్రొద్దున్నుండి ఏమీ తినలేదుగా నా కడుపులో తిప్పుతూ ఉంది.తెలియకుండానే నిద్ర పట్టేసింది, మెలకువ వచ్చేసరికి మొత్తం చీకటైపొయింది. టైం చూస్తే schedule ప్రకారం ఇంకా గంట ఉంది. బస్ లో అప్పుడే వాడు 40 నిమిషాలు లేట్ గా వెళ్తున్నాం , అని వచ్చే స్టేషన్ పేరు అనౌన్స్ చేసాడు.
అక్కడికెళ్ళాక బస్టాప్ నుండి పిక్ చేసుకోవడానికి సీనియర్స్ వస్తారు, వాళ్ళకి బస్ టైమింగ్స్ బయల్దేరే ముందు కాల్ చేసి చెప్పాను. ఆ చీకట్లో నిమిషాలు, సెకన్లు లెక్కపెడుతూ   దిగాక వాళ్ళకి ఎలా ఫోన్ చెయ్యాలి...అసలే బస్ లేట్ గా వెళ్తుంది, ఇంకా రాలేదు అని చూసి చూసి వాళ్ళు వెళ్ళిపోతే ఎలా... అని ఆలోచిస్తూ కూర్చున్నా.  
ఫస్ట్ బస్ లో ఆ 6 గంటలకన్నా, ఈ 3 గంటలు ఎక్కువ టైం అనిపించింది, బయటికి చూడ్డానికి కూడా లేకుండాఅంతా చీకటి. అలా అలా ఒక జీవిత కాలం గడిచాక నన్ను సంతోషం లో ముంచేస్తూ నేను దిగాల్సిన స్టేషన్ వస్తుందని అనౌన్స్ చేసాడు.
ఎందుకైనా మంచిదని దిగేముందు ఒకసారి అడిగా పక్కన కుర్చున్న అతన్ని, ఆ ఊరేగా ఇందాక చెప్పింది అని.
దిగేసరికి బస్ ఎదో షాప్ ముందు ఆగింది అనిపించింది. ( తర్వాత తెల్సింది అది walmart అని) జనాలే లేరు అసలు అక్కడ,ఇప్పుడేం చెయ్యాలా అని నా ఫ్యూచర్ ని తలచుకుంటూ లగ్గేజ్ కిందపెట్టేసరికి
నా సంతోషాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఇద్దరు ఇండియన్ అబ్బాయిలు వచ్చారు నా దగ్గరికి, చూడగానే అర్థమైంది నా కోసమే వచ్చారని. ఆ టైం లో వాళ్ళు నాకు నా కోసమే దిగి వచ్చిన దేవదూతల్లా అనిపించారు. వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ, బస్ కనపడగానే వచ్చారట.
ఒక 10 నిమిషాల్లో తీస్కెళ్ళి మా రూం లో వదిలారు నన్ను.
నా సంతోషాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ అక్కడ అన్నం, కూర పెట్టగానే మొహమాటం లేకుండా, కరువు బాధితురాలి లాగా తిన్నా చూడండి...ఒక రోజంతా తినకుండా ఎపుడూ లేనేమో . ఆ తర్వాత లోకల్ బస్ లలో వెళ్ళా కాని, మళ్ళీ ఇంత దూరం ఒక ఊరి నుండి ఇంకో ఊరికి బస్ లో ఎప్పుడూ వెళ్ళలేదు.  
అందుకే అది నా లాస్ట్ బస్ ప్రయణం అయ్యింది. ( హమ్మయ్య Title justification అయ్యింది ఫైనల్ గా!!) 

Tuesday, July 23, 2013

నా ఫస్ట్ & లాస్ట్ బస్ ప్రయాణం-1

ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నానని ఈమెవరో గొప్ప ఇంటి అమ్మాయి , అసలు చిన్నప్పటినుండి బస్ ఎక్కలేదట పాపం అనుకుంటున్నారా!
అక్కడే మీరు బస్సులో కాలేసారు..అసలు విషయానికొస్తే ట్రిన్ ట్రిన్ ట్రిన్
ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..నా ఫ్లాష్ బ్యాకే కాని మీరు కూడా రావాలి మరి..
నా వీసా పనులు అన్ని పూర్తిచేసుకొని యు.ఎస్ కి వెళ్ళడానికి రెడీ గా ఉన్నా. వీసాకి వెళ్ళే ముందు నా దగ్గర 3 యూనివర్సిటీలకి అప్ప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఒక దాంట్లో ఫీజు కాస్త తక్కువ, అందుకే దానితోనే వీసా ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకున్న.ఆ యూనివర్సిటీ పేరు M అనుకుందాం, M వాడు నా i20 లో బ్రాంచ్ పేరు తప్పు ఇచ్చాడు. అందుకే నేను చివరి నిమిషం లో ఇంకో యూనివర్సిటీ తో వీసా అప్ప్లై చెయ్యాల్సి వచ్చింది( ఇది K అనుకుందాం). సో అలా యూనివర్సిటీ K కి నా ప్రయాణం fix అయింది. కనుక్కుంటే అక్కడికి వెళ్ళాక ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని M కి మారిపోవచ్చు అని చెప్పారు. 

అక్కడ తెల్సినవాళ్ళు ఎవరూ లేరు.ఆ యూనివర్సిటీకి చాలామందే వస్తున్నారు కాని నా టికెట్ విడిగా బుక్ చేసుకోవాల్సి వచ్చింది.
 ఇంకా వెళ్ళేముందు ఒకటే టెన్షన్, అసలు ఒక్కదాన్ని ఫ్లైట్ లో ఎలా వెళ్తా ఒక్కరు కూడా తోడు లేకుండా అని ( ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అంత టెన్షన్ ఎందుకు పడ్డానా అని, ఆ తర్వాత ఒక్కదాన్ని చాలసార్లు ఫ్లై చెయ్యడమే కాదు ఇంకా చాలా పనులు చేసా).
ఫేస్ బుక్/యూనివర్సిటీ కమ్యూనిటీ నుండి ఇప్పటికే అక్కడ చదువుతున్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. అదే రోజు ఇంకో ఇద్దరు అబ్బాయిలు వేరే ఫ్లైట్ కి వస్తున్నారని, ముగ్గురిని కలిసి రిసీవ్ చేసుకుంటామని చెప్పారు.
ఎలాగోలా ఏ సమస్య లేకుండా వచ్చేసా, ఫ్లైట్ దిగగానే లగేజ్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేద్దామని పక్కనే ఒక షాప్ ఉంటే అందులోకి వెళ్ళి అడిగా. ఒక కార్డ్ కొనుక్కోమని దానితో 200 ( 200 లేక 300 ఎంతో గుర్తులేదు) నిమిషాలు యు.ఎస్ లో ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చని చెప్పింది. నేను తెచ్చుకున్న క్యాష్ లోంచి ఒక 20$ తీసి ఇచ్చా. 13.78 ఎంతో చెప్పి మిగిలిన చిల్లర 6$ 22 సెంట్స్ ఇచ్చింది. ( ఇది కూడా పెద్ద చెప్పే విషయమా అనుకుంటున్నారా, మరి నాకు ఇక్కడికి రాగానే కొత్తగా అనిపించిన మొదటి విషయం కదా!!). 
అలా వాళ్ళకి ఫోన్ చెయ్యడం, ఏర్ పోర్ట్ నుండి 50 నిమిషాల దూరం లో ఉన్న మా యూనివర్సిటీకి వెళ్ళిపోవడం జరిగింది. 
ఎలాగూ ఇక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను, ఇక్కడి నుండి మారిపోతాను కాబట్టి టెంపరరీగా ఉండడానికి మరో ఇద్దరు అమ్మాయిలతో షేరింగ్ లో ఇల్లు  దొరికింది. ఇంకేముంది రేపు కాలేజ్ కి వెళ్ళి M కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని, ఎలాగు వారం టైం ఉంది కాబట్టి ఈ వారంలో ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నా. నేను తప్పనిసరిగా M కి వెళ్ళిపోవాలి, ఎందుకంటె నాకు ఎడ్యుకేషన్ లోన్ రాలేదు, నేను తెచ్చుకున్న మనీ ఇక్కడి ఫీ కి సరిపోవు. ఇక్కడ ఫీ కట్టాలంటే ఇండియాలో మా ఆస్తులన్నీ అమ్ముకోవాలి, ఇంకా చెప్పాలంటే అంతా అమ్మినా ఇక్కడి మొత్తం ఫీ కట్టలేము. ఎలాగైనా మారిపోవచ్చు అని ధైర్యం చేసి వచ్చేసా. 
తర్వాత రోజు లేచి కాలేజ్ కి వెళ్ళాలి ఇదీ సంగతి అని అప్పటికే అక్కడ చదువుకుంటున్న రూమ్మేట్ కి చెప్పా. తనేమో అలా ఎలా వెళ్తావ్ ఇక్కడ International affairs లో ఒక officer ఉంటది, తను ఫస్ట్ సెమిస్టర్ లో ట్రాన్స్‌ఫర్ కి అస్సలు ఒప్పుకోదు అని చెప్పి, తన ఫ్రెండ్స్ ఎవరో వస్తే నా గురించి చెప్పింది. వాళ్ళు కూడా అస్సలే అలా కుదరదు అన్నారు. సరే ఏదైతే అది అయిందని కాలేజ్ కి వెళ్ళా. కాని ఆ రోజు ఆ ఆఫీసర్ రాలేదు, తర్వాతి రోజు రమ్మన్నారు. ఇంటికి వచ్చాక ఇంక టెన్షన్ మొదలైంది.
ఇంకా ఆ రోజంతా ఎవరితో ఈ విషయం చెప్పినా ఒకటే మాట అలా కుదరదు అని. రాత్రి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ హాయిగా సామాన్లు సర్దుకుంటూ, వాళ్ళ వాళ్ళ రూం సెట్ చేసుకుంటూ ఉంటే నేనేమో దిక్కుతోచకుండా ఆలోచిస్తూ ఉన్నా.  ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అవకపోతే ఏం చెయ్యాలి, మా నాన్న ని మనీ పంపియమంటే ఇప్పటికిప్పుడు ఎలా తెస్తారు అని అలోచిస్తున్నా. వాళ్ళేమో ఇక్కడే ఉండిపో దాంట్లో ఏముంది అంటున్నారు, అసలు సమస్య తెలియక.
ఎలాగోలా ఆ రోజు గడిపేసి, తర్వాతి రోజు లేవగానే కాలేజ్ కి వెళ్ళా.నాకు కావాల్సిన ఆఫీసర్ ఉంది, భయపడుతూ వెళ్ళి కలిసి విషయం చెప్పా. 
వెంటనే ట్రాన్స్‌ఫర్ అవుతావా ఒక సెమిస్టర్ కూడా పూర్తి చెయ్యకుండా అంది, అవును అని చెప్పా. 
"ఎందుకు" అంది, టక్కున అక్కడ నా బ్రదర్ ఉన్నాడు అందుకే అన్నా కాస్త దీనంగా.
కాసేపు నా పాత i20 కొత్త యూనివర్సిటీ i20 చూసి "OK" అని ఇంకేదో అంది. అర్థం కాక Question mark  మొహంతో అక్కడే నిల్చున్నా. "Now you are lo longer student of this school, i relesed your Sevis" అంది. ఆ పని అంతా పూర్తి అవడానికి 2,3 రోజులు పడుతుంది.  కాని మళ్ళీ ఆఫీస్ కి రావాల్సిన పని లేదు, కొత్త యూనివర్సిటీకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అంది. హమ్మయ్య అనుకున్నా.
కానీ... ఇంకో పెద్ద సమస్య గురించి ఇంకాసేపట్లొ తెలుసుకోబోతున్నానని నాకు తెలియదు అప్పుడు.