Thursday, August 29, 2013

నీ జ్ఞాపకాలు

సంతోషానికి సంకెళ్ళు పడ్డాయి
మనసు గోడల్ని దాటి రానంటోంది
ఆనందం ఆనవాలు కోల్పోయింది
నీ జ్ఞాపకాల వలలో చిక్కుకొని...

దు:ఖం కొత్త చుట్టమయ్యింది
నీ తలపుల తలుపులు తెరుచుకొని
విషాదమే ఆకాశమై  ఆదుకొంది 
నువ్వు వదిలేసిన ఈ ప్రపంచాన్ని...

Tuesday, August 27, 2013

కొన్ని నమ్మకాలు

మనలో చాలామందికి రకరకాల నమ్మకాలుంటాయి. ఏదైనా పని మొదలుపెట్టే అప్పుడు తుమ్మితే ఆ పని కాసేపు ఆపాలని,ఇంట్లోంచి బయటికి వెళ్ళే అప్పుడు పిల్లి ఎదురైతే మంచి జరగదని అనుకోవడం,   ప్రొద్దున్నే లేచి ఇష్టమైన వాళ్ళ మొహం చూడాలనుకోవడం ఇల్లంటివి చాలా ఉన్నయి.
కొందరు కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు.
ఆ నమ్మకం ఎదుటివాళ్ళకి ఇబ్బంది కలిగించనంతవరకూ నష్టం లేదు.ఇవన్ని మన దేశంలోనే ఎక్కువ అనుకునేదాన్ని. కాని ఇక్కడికొచ్చాక అర్థమైంది అమెరికా వాళ్ళకి కూడా నమ్మకాలెక్కువ, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చాలా విషయాల్లో మన నమ్మకాలతో కలుస్తాయి. నల్ల పిల్లి విషయం, పగిలిన అద్దం లో  చూసుకోకూడదు ఇలంటివి కొన్ని.
ఇంక చెప్పాలంటే అమెరికా వాళ్ళకి ఎంత భయమో చూడండి.

ఇది మా బిల్డింగ్‌లో లిఫ్ట్ లో తీసిన ఫోటో.చూసారా అందులో 13 నంబర్ లేదు. 13 అంటే దురదృష్టమైన సంఖ్య అని నమ్ముతారని తెలుసు కాని ఇలా ఒక బిల్డింగ్‌లో 13వ ఫ్లోర్ లేకుండా 12 తర్వాత 14 వ ఫ్లోర్ నంబర్ వేసారు.

ఈ సీరియస్ నమ్మకాలని వదిలేస్తే చిన్నతనంలో అమాయకంగా అనుకున్న కొన్ని విషయాలు ఎంత బావుంటాయో..
కాకి అరిస్తే కాని, చేతిలోంచి ఎదైనా జారిపోతే కాని, ఇద్దరు ఒకేసారి ఒకే మాట అంటే కాని ఇంటికి చుట్టాలొస్తారనీ..
వర్షం పడ్డప్పుడు రెయిన్‌బో వస్తే సీతమ్మ చీర ఆరేసుకుందనీ..
పిడుగు పడిటం అంటే అర్జునుడి రథం లోంచి ఒక ముక్క విరిగిపడటం అనీ..
కాళ్ళు చాపుకున్నప్పుడు దాటితే పుండు పడుతుందనీ..
బుక్‌లో నెమలీక దాచిపెట్టుకుంటే అది పిల్లలు పెడుతుందనీ..(అంటే ఒకటి పెడితే అది పిల్లలు పెట్టి 2 అవుతాయంట)
జడ వేసుకోకుందా జుట్టు వదిలెస్తే దయ్యం పడుతుందనీ(అలా అయితే ఇప్పుడు ప్రతీ అమ్మాయికి ఒక దయ్యం అవసరం పడేది :))
మాడిపోయిన అన్నం తింటే జుట్టు బాగా పెరుగుతుందనీ..(ఇదైతే మాడిన అన్నం అవగొట్టడానికి అమ్మ వాళ్ళు చేసిన కుట్ర  అని నా అభిప్ర్రాయం, అందులోను ఆడపిల్లలకి ఎక్కువ అన్యాయం జరిగేది దీని వలన, మరి వాళ్ళే కదా జుట్టు కోసం ఆరాట పడేది)
అన్నం చాలా సేపు తింటే పెళ్ళి ఆలస్యంగా అవుతుందనీ...
ఇంకా అందరం ఒక్కసారన్నా అనుకొని ఉంటాం తలలు గుద్దుకుంటే కొమ్ములొస్తాయని...
ఇంకా..
హా..హాచ్చ్...అబ్బ ఇప్పుడే పోస్ట్ పబ్లిష్ చేద్దామనుకుంటే తుమ్మొచ్చింది కాసేపాగి చేస్తానేం..